Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి

రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి

- Advertisement -

సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ఎదుట విద్యార్థుల ధర్నా

నవతెలంగాణ-రామన్నపేట
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కొమ్మాయిగూడెం, సిరిపురం రోడ్డులోని రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జీల కింద నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం మాట్లాడారు. నాలుగు ఐదు అడుగుల లోతు వర్షపు నీరు నిలిచి ఉండటంతో విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే నీటిని తొలగించాలని కోరారు. రైల్వే అధికారులు ముందు చూపు లేకుండా అండర్‌ పాసెస్‌ వే నిర్మాణం చేశారని, వర్షాలు పడిన ప్రతిసారీ అక్కడ నీరు నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతోందన్నారు. ధాన్యం లోడ్‌ లారీ ఆ నీటి నుంచి పోలేక మధ్యలోనే ఆగిపోవడంతో అందరికీ ఇబ్బంది ఏర్పడిందన్నారు.

మండల కేంద్రంలోని పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు బస్సులు రాలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో బడికి పోలేకపోతున్నారని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ అధికారులకు అనేకసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే 7 హెచ్‌పీ విద్యుత్‌ మోటార్లు బిగించి నీటిని తొలగించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడ్తామని, అవసరమనుకుంటే రైల్‌రోకో కార్యక్రమం కూడా చేపడ్తామని హెచ్చరించారు. అనంతరం సంబంధిత రైల్వే అధికారి పీడబ్ల్యూ కృష్ణకు వినతిపత్రం అందజేశారు. అందుకు స్పందించిన అధికారి.. సమస్య పరిష్కారం కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహాచారి, కల్లూరి నాగేష్‌, నాయకులు గొరిగే సోములు, శానగొండ రామచంద్రం, మెట్టు శ్రవణ్‌ కుమార్‌, పుట్టల ఉదయ్ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -