నిజామాబాద్ ఘటనపై సిటిజన్స్ ఫోరం ప్రతినిధులు
ఎన్‌కౌంటర్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్
నవతెలంగాణ-హిమాయత్ నగర్
రియాజ్ క్రిమినల్ కాదని, పోలీసు కస్టడీలోనే చనిపోయారని సిటిజన్స్ ఫోరం నిజనిర్ధారణ ప్రతినిధులు తెలిపారు. నిజామాబాద్‌లో జరిగిన రియాజ్ ఎన్‌కౌంటర్‌పై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం మీడియా సమావేశంలో ఫోరం ప్రతినిధులు ఖలీదా పర్వీన్, సారా మాథ్యూస్, మాజీద్ సుతారి, న్యాయవాది సమీర్ అలీ, మహ్మద్ అబ్దుల్ తాజ్, షేర్ సికిందర్ మాట్లాడారు. రియాజ్ బైక్ రికవరీ ఏజెంట్‌గా పని చేస్తున్నారని తెలిపారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య తర్వాత పోలీసులు రియాజ్ కుటుంబాన్ని కస్టడీలోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. నిజామాబాద్ వెళ్లి వాస్తవాలను పరిశీలించామని, అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. పోలీస్ స్టేషన్, ఆస్పత్రి పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు.
అక్టోబర్ 17న కానిస్టేబుల్ ప్రమోద్ హత్య జరిగిందని, అదే నెలలో 20న రియాజ్‌ను ఎన్‌కౌంటర్ చేశారని చెప్పారు. ప్రస్తుతం రియాజ్ ఎన్‌కౌంటర్ కేసును ప్రభుత్వం సిట్‌కు అప్పగించిందన్నారు. దీనిని సీబీఐకి అప్పగిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్‌ను ఎవరు చంపారో వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రియాజ్ చాకుతో పొడిచి ప్రమోద్‌ను చంపారని పోలీసులు పేర్కొంటున్నారని, దీనిపై పూర్తి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రియాజ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతని కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, వారికి రూ.5 కోట్ల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.



