Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం35 నుంచి 65 ఏండ్ల లాయర్లకు అవకాశం

35 నుంచి 65 ఏండ్ల లాయర్లకు అవకాశం

- Advertisement -

అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో చేర్చేందుకు బార్‌ కౌన్సిల్‌ నిర్ణయం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
న్యాయవాదుల సంక్షేమ నిధి ద్వారా ప్రయోజనం పొందేందుకు వీలుగా 35 ఏండ్ల పైబడి 65 ఏండ్ల వరకు ఉన్న న్యాయవాదుల కోసం స్టేట్‌ బార్‌ కౌన్సిల్‌ ఒక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌లో చేరడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబరు 18న బార్‌ కౌన్సిల్‌ సమావేశం తీర్మానం చేసినట్టు బార్‌ కౌన్సిల్‌ చైర్మెన్‌ నరసింహారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. బార్‌ కౌన్సిల్‌ నిర్ణయించిన మొత్తాన్ని నవంబరు 1 నుంచి డిసెంబరు 31లోగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. 2026 జనవరి నుంచి సభ్యత్వం అమల్లోకి వస్తుంది. వయస్సుల వారీగా ఫీజు వివరాలు ఇలా ఉన్నాయి.

వయస్సు సర్వీసు చెల్లించాల్సినది
36 నుంచి 40 ఏండ్లు 7 ఏండ్లు రూ. 50 వేలు
41-45 ఏండ్లు 10 ఏండ్లు రూ.55 వేలు
46-50 ఏండ్లు 15 ఏండ్లు రూ.60 వేలు
51-55 ఏండ్లు 20 ఏండ్లు రూ.65 వేలు
56-60 ఏండ్లు 25 ఏండ్లు రూ.70 వేలు
61-65 ఏండ్లు 30 ఏండ్లు రూ.75 వేలు


హైడ్రా కమిషనర్‌ హాజరుకు హైకోర్టు ఆదేశం
5హైదరాబాద్‌లోని బతుకమ్మకుంట ప్రాంత భూమి విషయంలో తామిచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించి పనులు నిర్వహించాలన్న కేసులో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. కోర్టు వివాదంలో ఉన్న ప్రయివేటు స్థలంపై ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను ధర్మాసనం శుక్రవారం విచారించింది. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ హైడ్రా కమిషనర్‌ ఎ.వి.రంగనాథ్‌కు ఫాం-1 నోటీసులు జారీ చేసింది. యథాతథస్థితి కొనసాగించాలన్న ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ.సుధాకర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ బి.మధుసూదన్‌రావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ విచారించింది. పిటీషనర్‌ సమర్పించిన ఫోటోలను పరిశీలిస్తే కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు జరిగాయని అర్థం అవుతుందని చెప్పింది. అక్కడ శిలాఫలకం కూడా ఉందని గుర్తించింది. విచారణను నవంబరు 27కు వాయిదా వేసింది.

టెట్‌ మినహాయింపు కుదరదు
ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల పాఠశాలల్లోని (భవితా కేంద్రాలు) స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లకూ టెట్‌ (టీచర్‌ ఎల్జిబిలిటీ టెస్ట్‌) అర్హతను మినహాయించలేమంటూ శుక్రవారం హైకోర్టు స్పష్టం చేసింది. మినహాయింపు కోరుతూ వారు దాఖలు చేసిన మూడు పిటిషన్లను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్ల క్యాడర్లలోని స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల నియామకంలో టెట్‌ అర్హత నుంచి మినహాయింపునివ్వాలంటూ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. పిటిషన్‌లను కొట్టివేసింది.

ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు వెసులుబాటు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం భూముల వ్యవహారంలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లకు సంబంధించిన స్థలాల విషయంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్‌ బెంచి రద్దు చేసింది. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే సర్వే నెం.181, 182ల్లో మాత్రం యథాతథస్థితి ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. నాగారం భూములపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేసిన పిటీషన్లను జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య, జస్టిస్‌ గాడి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించి మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అధికారులు కొనుగోలు చేసిన భూములపై ఆరోపణలు లేవని తెలిపింది. అందువల్ల యథాతథస్థితి ఉత్తర్వులు కేవలం 181, 182కే పరిమితం చేస్తూ సర్వే నెం.194, 195లను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -