Sunday, November 2, 2025
E-PAPER
Homeచౌరస్తాతీరమెక్కడో? గమ్యమేమిటో?

తీరమెక్కడో? గమ్యమేమిటో?

- Advertisement -

వెలుతురును మింగేసిన కొండ చిలువలా వుంది రోడ్డు. అక్కడక్కడ మసకమసకగా వెలుగుతున్న దీపం బుడ్లు స్తంభాల మీద వేళాడుతున్న తెల్ల గబ్బిలాల్లా వున్నాయి. కనరాని గడుసుదయ్యాన్ని చూసి గుండెలవిసేలా ఏడుస్తూ పరుగెడుతున్నది గాలి. జుట్టు విరబోసుకుని పిచ్చిదానిలా నిలబడి వుంది చీకటి. అది ఇంద్రదేవుని మదపుటేనుగులా ఉంది. అది దారి తప్పి భూమ్మీదకు వచ్చిన యముని దున్నపోతులా వుంది. అది గొలుసు తెంచుకుని పారిపోతున్న నరకలోకపు జాగిలంలా వుంది. డ్రైవర్‌ పదఘటనలను భరిస్తూ, చక్రం ఎటు తిరిగితే అటు తిరుగుతున్న ఆ వాహనంలో సిటిజన్లు, సీనియర్‌ సిటిజన్లు, నెటిజన్లు, రేపటి పౌరులు పడక సీట్లల్లో వెచ్చని రగ్గులు కప్పుకుని నిద్రాదేవికి వెల్‌కమ్‌ చెప్తున్నారు. తెల్లవారేసరికి చేరుకోవలసిన చోటికి చేరుకుంటామని నిశ్చింతగా వున్నారు వాళ్లు. తాము చేరుకునే చోటు తాము చేరాలనుకున్న చోటు ఒక్కటి కావని తెలీదు వాళ్లకు. వాహనం గాలి గుండెల్ని చీల్చుకుంటూ చీకటిని విదిలించి కొడుతూ, పూనకం వచ్చినట్లు, రంగులరాట్నం పైకీ కిందకీ తిరుగుతున్నట్లు, కాళ్ల చక్రాల్ని గుండ్రంగా గుండ్రాలుగా తిప్పుతూ వెళ్తున్నది.

వయసు వొంటిమీద మూడు దశాబ్దాల సంతకం చెయ్యడానికి ఇంకా రెండు సంవత్సరాలు అవసరం వుండగా ఉద్యోగం వచ్చిన కొడుకుని భద్రంగా వెళ్లు, వెళ్లగానే ఫోన్‌ చెయ్యి అన్న తల్లిదండ్రులకు తెలీదు అదే ఆఖరి సెండాఫ్‌ అవుతుందని. ‘పర్లేదు డాడీ, మా ఫ్రెండ్సున్నారు, వాళ్లతో వుంటా, రోజూ సాయంత్రం తప్పకుండా ఫోన్‌ చేస్తా! మమ్మీ ఫస్టు సాలరీ రాగానే నీకు ఏం కావాలో చెప్పు, తెస్తా’ అన్న కొడుక్కు తెలీదు తను ఫస్ట్‌ సాలరీ అందుకోడని. అసలు జాబ్‌లో చేరబోవడం లేదని, చేరడానికి తాను వుండనే వుండడని. అర్థరాత్రయినా ఫోన్‌కి చెవీ, నోరూ అప్పగించిన ఆ అమ్మాయి కళ్లు నిద్రపోవడానికి నిరాకరించాయి. ఈ రోజే ఎంగేజ్‌మెంట్‌ అయింది కదా. ఇవేళ్టికి వుండిపోరాదూ అన్న తల్లితో లేదమ్మా చాలా వర్క్‌ పెండింగ్‌లో వుంది అని బై చెప్పింది కూతురు, అదే తన చివరాకరి బై అనే విషయం తెలీక. కాబోయే లైఫ్‌ పార్ట్‌నర్‌తో ఫోన్‌లో మాట్లాడుతుంటే యుగాలు క్షణాలుగా గడచిపోతున్న సంగతి ఇప్పుడే తెలిసివచ్చింది ఆమెకు. పెదాలకు విశ్రాంతి లేదు, మాటలకు పంక్చువేషన్‌ లేదు, వాక్యాలకు కామా తప్ప ఫుల్‌స్టాప్‌ లేదు. ఇక నిద్రవస్తోంది ఫోన్‌ పెట్టేయనా అని తను అనదు.

తన వేలికి ఆమె తొడిగిన వుంగరాన్ని చూసుకుంటూ అతను మాట్లాడుతున్న మాటల్లో ఇంత తీపి వుంటుదని ఇప్పుడే తెల్సింది ఆమెకు. అర్థరాత్రి దాటాక ఆమె చేతిలోంచి ఫోన్‌ ఎప్పుడు జారిపోయిందో, కనురెప్పల మీద నిద్ర ఎప్పుడు దండయాత్ర చేసిందో ఆమెకు తెలియలేదు. ఉంగరాలు మార్చుకున్న వేళ్ల నుండి జారి పడి మూగబోయిన ఫోన్లు తిరిగి మాట్లాడుకోలేవని ఆమె అనుకోలేదు. రిటైరై ఏడాది దాటినా రావలసిన డబ్బు అందలేదు. అది అందితే చేయవలసిన పనుల జాబితా కళ్లముందు వేలాడుతుంటే, అప్పులన్నీ తీర్చేసి, మిగిలిన దాంతో ఉర్లో వున్న పాత ఇంటిని రిపేర్‌ చేసి శేష జీవితాన్ని హాయిగా గడిపేద్దామనుకున్న ఆలోచనలు మెదడులో నిరంతరం సంచరిస్తుంటే ఆరు పదుల వయసు బరువు మోస్తూ, ఓ బంధువు ఇంట్లో పెళ్లికి బయలుదేరిన ఆయన ఆ బస్సు ఎక్కకుండా వుండాల్సింది. ఎవరూ చెప్పనేలేదు తను ఎక్కిన బస్సులో నుంచి ఇక కిందికి దిగేది లేదని. మూడు పదుల జీవితాన్ని అంకితం చేసిన ఉద్యోగ జీవితానికి రావలసిన డబ్బు అందడాన్ని తన కళ్లు చూడబోవడం లేదని ఆయనకు ఎవరు చెప్తారు?

దాన్ని వాడు తాగుతున్నాననుకున్నాడు కానీ అదే వాడ్ని తాగేసింది. వాడి మెదడుని నమిలేసింది. వాడికున్న నూకల్ని కాజేయడానికి వాడు ఓ వైపు వెళ్లాలనుకుంటే తను మరో వైపుకు ఉరికింది. అది నడిపేవాడి ఒంట్లో ప్రవహిస్తున్నది నెత్తురు కాదని తెలిసి అది అదుపు తప్పిన ఆంబోతులా దండెం మీద ఆరేసిన అంగీలా గాల్లో ఎగురుతూ రంకెలేస్తున్నది. దాని తల పొగరు చూసిన డివైడర్‌ గుండె గుభిల్లుమంది. దాని భయం నిజమైంది. ఫెళ్లున తనని గుద్దుకున్న రెండు చక్రాల మీదినుంచి విసిరేయబడ్డ శరీరం ఊపిరి పీల్చడం మరచిపోయిందని దానికి అర్థమైంది. ఎప్పటిలాగే తెల్లారేసరికల్లా గమ్యం చేరుతాననుకుంటున్న ఐరావతానికి దిళ్లూ, బ్లాంకెట్లూ, కుషన్‌ పరుపులూ, లబ్‌డబ్‌ మంటున్న గుండె గడియారాలూ మోసుకుపోతున్న దానికి, చీకట్లో తనకూ, తన్ను మోసుకు వెల్తున్న వాళ్లకూ నూరేళ్లు నిండబోతున్న సంగతి తెలీదు. దారికి అడ్డంగా యముడి చేతినుంచి జారిపడిన పాశం వుందని అది ఊహించనేలేదు. నడిరాత్రి పట్టపగలయింది. మండే సూర్యుడు పట్టుతప్పి నేలమీద పడ్డాడు. కాలిపోతున్న బస్సు హోలిక అయింది. ఆమె ఒళ్లో వున్న ప్రహ్లాదుడి ప్రాణాల్ని ఈసారి ఆ హరి పట్టించుకోలేదు. కొన్ని కళ్లు తెరుచుకోలేదు. తెరుచుకున్న కొన్ని కళ్లల్లో చూపేలేదు. దట్టమైన పొగలో ఊపిరి ఆగిపోయిన శరీరాలకు తాము వెళ్దామనుకున్న చోటుకు చేరలేక పోయామన్న సంగతి ఎవరు చెప్తారు?

  • చింతపట్ల సుదర్శన్‌
    9299809212
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -