ధర్మాన్ని, న్యాయాన్ని నమ్మే ధర్మారావు అనే ధనవంతుడు ఒక గ్రామంలో ఉండేవాడు. నమ్మకస్తుడైన రామన్న, అతని ఇంట్లో పనిచేసేవాడు. ఒకరోజు ధర్మారావు ఇంట్లో దొంగతనం జరిగింది. విలువైన ఆభరణాలు, ధనం అదశ్యమయ్యాయి. బయటివారికి సాధ్యం కాని ఈ దొంగతనం, ఇంట్లో ముఖ్యమైన వ్యక్తి పనే అని ధర్మారావుకు అర్థమైంది. అతనికి కోపం కంటే నిరాశ ఎక్కువైంది.
ఈ సమస్యను పరిష్కరించడానికి ధర్మారావు గ్రామ పెద్దలను ఆశ్రయించాడు. గ్రామ పెద్దలు లోతుగా చర్చించి ఒక ఉపాయం ఆలోచించారు. మరుసటి రోజు గ్రామంలోని వారందరినీ, ముఖ్యంగా ధర్మారావు ఇంట్లో పనిచేసే వారందరినీ గ్రామ సభకు పిలిచారు.
గ్రామ పెద్ద ప్రజల ముందు కొన్ని కర్రలను ఉంచి, ”ఈ కర్రలు చాలా శక్తి వంతమైనవి. వీటికి అద్భుతమైన శక్తులున్నాయి. దొంగతనం చేసిన వ్యక్తి పట్టుకున్న ఒకరోజు తర్వాత ఈ కర్రలు ఒక అంగుళం పెరుగుతాయి. మీరందరూ ఈ కర్రలను మనిషికి ఒకటి చొప్పున పట్టుకుని మీ ఇంటికి వెళ్ళండి. రేపు ఉదయం తిరిగి తీసుకురండి,” అని ప్రకటించాడు. ప్రజలందరూ కర్రలు తీసుకుని ఇంటికి వెళ్ళారు. రామన్న కూడా తన కర్రను తీసుకుని ఆందోళనగా ఇంటికి చేరాడు. నిజానికి దొంగతనం చేసింది రామన్నే. ధర్మారావు నమ్మకాన్ని దుర్వినియోగం చేసి అతడు ఈ పని చేశాడు. ఇప్పుడు గ్రామ పెద్ద మాటలు అతనికి భయాన్ని కలిగించాయి. రాత్రంతా నిద్ర పట్టలేదు. కర్ర నిజంగా పెరుగుతుందేమో, తాను దొరికిపోవడం ఖాయమని భయపడ్డాడు. ‘తేలు కుట్టిన దొంగలా’ రాత్రంతా మదనపడ్డాడు.
అతని మనసులో ఒక ఆలోచన మెరిసింది. కర్ర నిజంగా పెరుగుతుందో లేదో తెలియదు, కానీ ఒక అంగుళం తగ్గించి తీసుకువెళ్తే, ఒకవేళ పెరిగినా అది సాధారణ పొడవులోనే ఉంటుందని, తాను నిర్దోషిగా రుజువవుతానని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, రామన్న తన కర్రను రహస్యంగా ఒక అంగుళం నరికేశాడు. మరుసటి రోజు ఉదయం, ప్రజలందరూ తమ కర్రలతో గ్రామ సభకు వచ్చారు. గ్రామ పెద్ద ప్రతి ఒక్కరి కర్రను జాగ్రత్తగా పరిశీలించాడు. రామన్న కర్ర దగ్గరకు రాగానే, అది అందరి కర్రల కంటే ఒక అంగుళం చిన్నదిగా ఉండటం గమనించాడు. వెంటనే ఆయన రామన్నను నిలదీశాడు. ”రామన్నా, నీ కర్ర ఎందుకు చిన్నదిగా ఉంది? దొంగతనం చేసింది నువ్వే కదా?” రామన్న బిత్తరపోయాడు. తన తప్పు బయటపడిందని అర్థమైంది. సిగ్గుతో, పశ్చాత్తాపంతో తలదించుకుని తన నేరాన్ని అంగీకరించాడు. గ్రామ పెద్దల చాకచక్యం, రామన్న భయం వెనుక దాగి ఉన్న నిజం తేలిపోయింది. ధర్మం గెలిచింది.
డా. పోతగాని సత్యనారాయణ, 9182531202



