Sunday, November 2, 2025
E-PAPER
Homeసోపతికాలం వలలో చిక్కిన మనిషి పాట

కాలం వలలో చిక్కిన మనిషి పాట

- Advertisement -

కాలం మాయల మరాఠి. ఎన్నో గారడీలు తెలుసు దానికి. అపుడే కంటికి అందమైన వెలుగులు చూపించి వెంటనే చీకటులను పూస్తుంది. కాలం వేసిన గాలంలో చిక్కి మనమంతా ఊగిసలాడుతుంటాం. అపుడే అర్థమయినట్టుగా, మన చేతికి చిక్కినట్టుగా తోస్తుంది. కాని దాని చేతికి మనం చిక్కామన్న విషయాన్ని మనం ఎరుగం. అలాంటి కాలం చేసే మాయని, విధి ఆడే వింత ఆటని గురించి పాటలో చెప్పాడు విశ్వ. 2018 సం.లో వెంకటేశ్‌ మహా దర్శకత్వంలో వచ్చిన ‘C/o కంచరపాలెం’ సినిమాలోని ఆ పాటనిపుడు చూద్దాం.

పాట నాడిని పట్టుకున్న గీతరచయిత విశ్వ. ఇది వరకే ఆయన రాసిన పాటలెన్నో జనాన్ని బాగా అలరించాయి. నేటికీ అలరిస్తూనే ఉన్నాయి. ట్రెండ్‌ కి తగినట్టుగా ఎంతో అద్భుతమైన పాటలు రాశాడు విశ్వ. ఈ పాట కూడా చాలా ఫిలాసఫికల్‌ గా రాశాడు. సినిమాకథ మొత్తం ఈ పాటలో నిండి ఉంది. ఈ పాట ఎంత పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందరికో రింగ్‌ టోన్‌ గా, కాలర్‌ టోన్‌ గా మారింది ఈ పాట. కాలం వలలో చిక్కి ఊగిసలాడే మనిషి జీవన తత్త్వాన్ని గురించి ఈ పాటలో ఎంతో గొప్పగా చెప్పాడు. మనం జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తుంటాం. ప్రతీసారి విజయమే చెంత చేరకపోవచ్చు. అపజయాలు కూడా వచ్చి ఎదురుగా నిలబడతాయి. వాటిని కూడా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి.

ఎన్నెన్నో వింతలూ, విశేషాలు, కష్టాలు, సుఖాలు, ఎత్తుపల్లాలు, చీకట్లు, వెలుతురులు, సంతోషాలు, దుఃఖాలు..ఇలా అన్ని కలగలిసి మనిషి జీవితం సాగుతూ ఉంటుంది. కాలం చేసే మాయలో మనమంతా చిక్కుకుని విలవిలలాడుతూ ఉంటాం. కాలం చేతికి చిక్కినపుడు ఏం చేయాలో తోచక కిందా మీదా పడతాం. ఓపిగ్గా బతుకు అనే సముద్రాన్ని ఈదితే గమ్యం చేరుకోగలం. ఆశలు, బంధాలు మనల్ని కట్టిపడేస్తాయి. మనం ఎంతో సాధించాలనుకున్నా సాధించలేని పరిస్థితులు వచ్చి మనల్ని చుట్టుకుంటాయి. ఇదంతా ఎవరో చేసింది కాదు. సాగుతున్న కాలం ఆడుతున్న ఆట ఇది. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని మనం గ్రహించక చిరాకులో మన పక్కన ఉన్న వాళ్ళమీదనో, స్నేహితుల మీదనో, కుటుంబ సభ్యుల మీదనో అరుస్తుంటాం. కాలం ఆడే ఆటలో ఎదురీది ఎదురీది చివరికి తీరం చేరే సరికి ఎలాంటి ఫలితముంటుందో కూడా మనకు తెలియదు. ఎప్పటినుంచో కలవని వాళ్ళు, మనతో తెగతెంపులు చేసుకున్న వాళ్ళు కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చి, తోడుగా ఉంటూనే..ఉంటూనే మళ్ళీ విడిపోయే సందర్భాలూ ఎదురవుతుంటాయి. ఇదంతా కాలం మహిమే.

ఇలాంటి వింత పరిస్థితుల్ని చూశాక ఇది నా జీవితమేనా? అని మనకే అనిపిస్తుంటుంది. అలా మన సందేహం నివత్తి అయ్యేలోపే ఇంకా ఎలాంటి మార్పుల్ని చవిచూస్తామో మనమే ఊహించలేం. సముద్రాల్లో ఉండే ఆటుపోటులు..మన గుండెల్లో కూడా సాగుతుంటాయి. సముద్రం బడబాగ్నిని కడుపులో దాచుకున్నట్టుగానే మనం కూడా ఎన్నో కష్టాల్ని గుండెల్లో దాచుకుంటాం. ఈ లోకమంతా కల్లోలాలే. మన హదయాల లోతుల్లో, కొలనుల్లో ఎన్నెన్నో అలజడులో మరి. నిండు పున్నమి వేళల్లో, వెన్నెల వెలుగుల్లో నువ్వు ప్రయాణం చేస్తుంటే అప్పటికప్పుడే మబ్బులు కమ్ముకుని, చీకట్లు ఆవరించుకుని నీ ప్రయాణం గందరగోళంగా మారిపోతే ఎవరు ఏమి చేయగలరు. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోయి, కిందపడిపోయి నువ్వుంటే నీ ఆరాటం తీరుతుందా? ఏ కారణం వల్ల మనకిలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో.. ఏ కారణం వల్ల మన నుదుటిరాతలు మారాయో.. లోతుగా తెలిసేదెలా? ఇంకా..రేపటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో తెలియాలంటే, నువ్వనుకున్న విజయం నీ చెంతకు వస్తుందో లేదో తేలాలంటే నీ ఉనికి ఉండాలి కదా..వేచి చూడు..అనుకున్న తీరం దొరికేదాకా ఈదుతూనే ఉండు..అని అంటున్నాడు కవి.

ఏ చోట ఏముందో మనకెలా తెలుస్తుంది. సన్నని నీడలా విధి మన వెంటే తిరుగుతుంటుంది. పొంచి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు తన పంజా మనపై విసురుతుందో మనం గుర్తించలేం. ఏ ముడుపులో ఏం దాగున్నదో తెలుసుకో. నీవనుకున్న మార్గంలో నీ శైలిలో నీవు తేల్చుకో. చిక్కులు, ముల్లు కప్పి పైకి అందమైన రంగులు పూసుకుని మెరుస్తున్న లోకమంటేనే ఓ పెద్ద నాటకం. ఆ నాటకం ఎలాంటి మలుపులతో సాగుతుందో, దాని కథనం ఏమిటో మనం ఎరుగం. నువ్వు ఎందరి మీదో ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉంటావ్‌. నీ మీదే నువ్వు ప్రగాఢమైన విశ్వాసంతో ఉంటావ్‌. ఆ నమ్మకాలను పక్కదారి పట్టి పోతుంటే కంచికి చేరాల్సిన నీ కథలు చేరకుండానే పోతాయి. అంటే..అంతా సఫలమై ఇక ముగింపుకొచ్చింది అనుకునే సమయంలో అంతా మారిపోయి, తలకిందులైపోయి మళ్ళీ మొదటికొచ్చేసింది అని అనిపిస్తుంటుంది. అలా అనుకున్నదొకటి అయినదొకటి, ఊహించినదొకటి జరిగినదొకటి అన్నట్టైపోతుంది. ఆ విషయాన్నే ఎంతో తాత్త్వికంగా చెప్పాడిక్కడ విశ్వ.

ఇక్కడ కవి ఇచ్చిన సందేశమేమిటంటే..సినిమాలో హీరో పాత్ర ద్వారా ఇస్తున్న సందేశమేమిటంటే..నీ చేతుల్లోనే అంతా ఉంది..ఆ విషయం నీకు తెలియదు. అదష్టం కోసం ఎక్కడెక్కడో వెతుకుతుంటావ్‌. కాలం నిన్ను పరీక్షిస్తుంది. విధి నీతో ఆడుకుంటుంది. నువ్వు ఓపికగా ముందుకు సాగుతూ ఉండు. ఎన్ని అవరోధాలు ఎదురైనా నీ గమనం గమ్యం చేరేదాకా ఆగకూడదు. నీ చేతుల్లో ఉన్నదాన్ని చేతల్లో చూపించాలి. ఎదురీది సాగాలి. అలా ఎదురీదుతూ..ఎదురీదుతూ రేపు ఏం జరుగుతుందో నువ్వెదురు చూడు. అనుకున్న విజయాలే కావు. అనుకోని విజయాలు నీ ముందుకు వచ్చి నిలబడతాయి. మనిషి మనిషిని తట్టిలేపిన పాట ఇది. మనసు మనసును పట్టి ఊపిన పాట ఇది.

పాట:
ఆశాపాశం బందీ సేసేలే/సాగే కాలం ఆడే ఆటేలే/తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో/సేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో/ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా/ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏలీలో ఎద కొలనుల్లో/నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లిపోతు పల్లటిల్లిపోయి నీవుంటే తీరేనా నీ ఆరాటం/ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా/రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా/ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా/ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో/ఏ ముడుపులో ఏం దాగున్నదో నీవుగా తేల్చుకో నీ శైలిలో/చిక్కు ముల్లు గప్పి రంగులీనుతున్న/లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కధనం/నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని/పక్కదారి బట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం/నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా/రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా/ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్నా..

  • డా||తిరునగరి శరత్‌చంద్ర,
    [email protected]
    సినీ గేయరచయిత, 6309873682
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -