ఓసిడి అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్. ఈ సమస్య ఉన్నవారు ఏదైనా పనిని అవసరానికే మొదలు పెడతారు. కానీ మళ్ళీమళ్ళీ ఆ పనిగురించే అవాంఛితంగా ఆలోచనలు వస్తూ ఉండడంతో, అది సరిగా చేసానో, లేదో అన్న అనుమానంతో, దాని గురించి వచ్చే ఆలోచనలతో సతమతమయ్యి, తద్వారా జనితమయ్యే ఆందోళనను తగ్గించుకోవడానికి, ప్రవర్తనలు, చర్యలు పునరావతం చేస్తూనే ఉండిపోతారు.
ఉదాహరణకు, తలుపులకు తాళం వేయడం అవసరంతో మొదలౌతుంది. మళ్ళీ వెనుతిరిగి వేసామో లేదో అని ఒకటి రెండు సార్లు చూడడం అసహజమేమీ కాదు, కానీ మళ్ళీ మళ్ళీ అదేచర్య, ఆదుర్దా-ఆందోళనలతో, మాటిమాటికి చేస్తూ ఉంటే ఆ ఒక్క విషయంలోనే కాకుండా మరెన్నో పనుల్లో అదేవిధంగా జరుగుతూ వస్తుంటే, వారు తప్పక ఓసిడి బాధితులు. అబ్సెషన్ అంటే ఒకే విషయం గురించి పదే-పదే ఆలోచించడం, దాని నుండి బయటకు రాలేకపోవడం, ప్రతి చిన్నవిషయానికి విపరీతంగా ఆదుర్దా పడిపోవడం, అనవసరంగా కలతకు గురికావడం, దేనినో/ వేటినో పోగుట్టుకొంటామేమోననే మితిమీరిన భయాలు. అబ్సెషన్ వల్ల కలిగే ఆదుర్దా నుండి బయట పడడానికి, చేసిందే తప్పని సరిగా చేస్తూ ఉండిపోవడం జరుగుతుంది కాబట్టి ఇది కంపల్సివ్ డిసార్డర్. అబ్సెసివ్ -కంపల్సివ్ డిజార్డర్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఎల్లప్పుడూ భయపడుతూ ఉంటారు.
ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా ఉంటారు. అవాంఛిత భావాలు, బలవంతపు ఆలోచనలు వారి రోజువారీ జీవితాన్ని శాసిస్తుంటాయి! ఈరుగ్మత ఉన్నవారు కొన్ని చిత్రాలు, కోరికలు, ఆలోచనలపై చిక్కుకుపోయిన అనుభూతిలో ఉంటారు. పదే పదే అవే అనుభూతులు, ఆలోచనలు వస్తూ ఉండటం వలన ప్రతిపనిని మళ్ళీ మళ్ళీ చేయవలసి వస్తుంది. శుభ్రపరచడం, వస్తువులను తనిఖీ చేయడం లేదా చేతులు కడుక్కోవడం వంటి పునరావత ప్రవర్తనలు వ్యక్తి సామాజిక పరస్పర చర్యలకు లేదా రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయి. మురికివస్తువు లేదా ఉపరితలాన్ని తాకిన తర్వాత పదిసార్లు చేతులు కడుక్కోవడం వంటి బలవంతపు ప్రవర్తన వ్యక్తి ఇష్టాయిష్టాలకు అతీతంగా జరుగుతుంటాయి. వాటిని ఆపడం వారితరం కాకపోవచ్చు. ఆవిషయంలో వారు తమని తాము శక్తిహీనులుగా భావించవచ్చు.
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లక్షణాలు:
అవాంఛిత ఆలోచనలు లేదా కోరికలు, తద్వారా ఎనలేని ఆందోళన. ఉపశమనం కోసం తప్పని సరిగా, బలవంతంగా పునరావతమయ్యే ప్రవర్తనలు లేదా చర్యలు ఆలోచనలన్నీ పరిశుభ్రత, క్రమబద్ధత, హాని జరగవచ్చునని నిరంతర భయం వంటి విషయాల చుట్టూ తిరుగుతుంటాయి. నిత్యజీవితం అయోమయం, గజిబిజిగా తయారౌతుంది. దేనిపైనా ఒకపద్ధతిలో దృష్టిపెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఓసిడి రోజువారీ దినచర్యలకు అంతరాయం కలిగించి, సాంఘిక, సంబంధాలను దెబ్బతీస్తుంది.
అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ కారణాలు:
ఇది జన్యుపరమైనదని, తరచుగా కుటుంబాలలో కనిపిస్తుందని అధ్యయనాలు వెల్లడిచేసాయి. సెరోటోనిన్ వంటి న్యూరో ట్రాన్స్మిటర్లలో అసమతుల్యత ద్వారా ఓసిడి లక్షణాలు ప్రభావితమవుతాయి. ఈ సమస్య ఉన్న వ్యక్తులలో నిర్ణయం తీసుకోవడం, ప్రవర్తన నియంత్రణకు సంబంధించిన మెదడు ప్రాంతాలు భిన్నంగా ఉండవచ్చు. ఒత్తిడితో కూడిన సంఘటనలు ఓసిడి లక్షణాలను తీవ్రతరం చేయవచ్చు, ప్రేరేపించవచ్చు. అదేవిధంగా పరిపూర్ణవాద/ మితిమీరిన ఆందోళన ధోరణి వంటి వ్యక్తిత్వ లక్షణాలు ఈ జబ్బు అభివద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతాయి.
ఓసిడి మెదడుపై ప్రభావం చూపుతుందా?
మెదడులోని గ్రేమేటర్-రిచ్ప్రాంతాలు ప్రేరణలను నియంత్రించడానికి, ఇంద్రియాలను నిర్వహించడానికి, సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి, మాట్లాడటం, రాయడం, ప్రతిచర్య సమయం, సమతుల్యత, సమన్వయం, డ్రాయింగ్ వంటి మోటారు నైపుణ్యాలను అభివద్ధి చేయడానికి, నియంత్రించడానికి, ప్రదర్శించడానికి ఉపయోగపడతాయి. తీవ్రస్థాయి ఓసిడి మెదడులోని గ్రేమాటర్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. బాధితుల్లో వారి ప్రేరణలను నియంత్రించే సామర్థ్యాన్ని తక్కువగా చేస్తుంది. గ్రేమాటర్ తక్కువ స్థాయిలు బాధితుల్లో సమాచారాన్ని స్వీకరించే విధానాన్ని కూడా మార్చగలవు. ప్రతికూల ఆలోచనల్ని పెంపొందించే దిశగా వారి ప్రవత్తిని మలుస్తుంది.
ఓసిడి ఎలా గుర్తించగలం?
తలుపు మూయడం, లైట్లు ఆర్పడం లేదా వస్తువులను లెక్కించడం వంటి పనులు చేసినప్పుడు వాటిపై నిరంతర సందేహాలు వ్యక్తపరచడం. మురికి, క్రిములపట్ల ఎనలేని భయం. వస్తువులను నిర్దిష్ట క్రమంలో పెడుతూ ఉండిపోవడం. ఎవరికైనా హానికలిగించే లేదా బాధించే ఆలోచనలతో సతమతమైతూ ఉండిపోవడం. వస్తువులను పదేపదే శుభ్రపరచడం. ఒక నిర్దిష్టమార్గంలో పనులను ఏర్పాటు చేయడం, తాను ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోతే/ అంతరాయంకలిగితే, అమితంగా కలత చెందటం వంటి ఎన్నో సూచికలు బాధితులకి, వారి కుటుంబ సభ్యులకి, చుట్టూ ఉన్న వ్యక్తులకీ, నిరంతరం వ్యక్తమౌతూనే ఉంటాయి.
ఓసిడిని నయం చేయవచ్చా?
అబ్సెసివ్- కంపల్సివ్ డిజార్డర్‌కి సంపూర్ణ చికిత్స లేదు. స్వల్పస్థాయి అంటే కొంత సమయం, కొన్ని విషయాలకి మాత్రమే పరిమితమైన ఓసిడిని క్రమబద్దమైన మెడిటేషన్, యోగాభ్యాసంతో నియంత్రించవచ్చు. జీవనశైలిని మార్చివేసేటంతటి ఓసిడికి, తీవ్రతను బట్టి దీర్ఘకాలిక చికిత్స అవసరం కావచ్చు. దానికోసం వారు మానసిక వైద్యనిపుణుల్ని సంప్రదించి సమర్థవంతమైన మానసిక చికిత్సను పొందవచ్చు. ఓసిడిని ఎలా అధిగమించాలో మార్గనిర్దేశం చేయగల్గుతారు. ఓసిడి లక్షణాలను తగ్గించడంలో సహాయపడి, మెదడులోని సెరోటోనిన్ స్థాయిలను పెంచడానికి, వైద్యులు సెలెక్టివ్ సెరొటోనిన్ రీ అప్టేక్ ఇన్హిబిటర్స్, ట్రైసైక్లిక్యాంటిడి ప్రెసెంట్స్ వంటి మందులను సూచించవచ్చు.
మానసిక చికిత్స:
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ వంటి చికిత్సలు బాధితుల ఆలోచనలను, ఆందోళనలను గుర్తించి, వాటిని నియంత్రించడంలో సహాయపడతాయి. అతి తీవ్ర ఓసిడిని తగ్గించడానికి శస్త్రచికిత్స కూడా అందుబాటులో ఉంది.
డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్: దీనిలో మెదడులోని నిర్దిష్ట భాగాలలో ఎలక్ట్రోడ్లు అమర్చి, వాటిని ఉత్తేజపరిచేందుకు విద్యుత్ ప్రవాహాలు ఉపయోగించబడతాయి. ఈ విద్యుత్ ప్రేరణలు దీర్ఘకాలిక ఓసిడి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.
ట్రాన్స్ క్రానియల్ మాగెటిక్ స్టిమ్యులేషన్: తలలోకి చొప్పించిన అయస్కాంత పరికరం ట్రాన్స్ క్రానియల్ మాగెటిక్ స్టిమ్యులేషన్ కోసం ఉపయోగించ బడుతుంది. ఇది మెదడుకు విద్యుత్ సంకేతాలను పంపుతుంది. ప్రేరణలు చికిత్సకు సంబంధించిన రసాయనాలను సహజంగా ఉత్పత్తి చేయడానికి మెదడును ప్రేరేపిస్తాయి. ఒకవిధంగా ఆలోచిస్తే, ఓసిడిని నియంత్రించడానికి దానినే తిరుగు మంత్రంగా ఉపయోగించాలి!!! స్వల్ప స్థాయి ఓసిడి ఉన్నవారు ప్రయత్నించి చూడండి!!!



