– మోడీ విధానాలతో ప్రజల మధ్య పెరుగుతున్న అంతరాలు
– మహిళల ఉపాధి, వేతనాల్లో కోతలు
– కార్మిక వర్గంపై కేంద్రం దాడి
– నయా ఉదారవాద విధానాలు దేశానికి నష్టం
– పోరాటాలతోనే హక్కుల్ని కాపాడుకోవాలి : శ్రామిక మహిళా జాతీయ కన్వెన్షన్‌లో సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
‘కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితంగా పేదలు, ధనికుల మధ్య రోజురోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయి. ఇది నయా ఉదారవాద పెట్టుబడిదారీ విధాన లక్షణం. వాటివల్ల చిన్న ఉత్పత్తిదారులు, రైతులు, చిన్నతరహా పరిశ్రమలను చిదిమేస్తున్నాయి. వీటి ప్రభావం శ్రామిక మహిళలపై తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే నిర్వహిస్తున్న శ్రామిక మహిళా పోరాటాలను మరింత ఉచ్ఛస్థితికి తీసుకుపోవాలి. పోరాడితేనే హక్కుల్ని సాధించుకోగలం. ఆ దిశగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి’ అని సెంటర్ ఆప్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్ సేన్ పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అఖిల భారత శ్రామిక మహిళా సమన్వయ కమిటి 13వ అఖిలభారత సమ్మేళనాన్ని మెర్సి కుట్టియమ్మ అధ్యక్షతన నిర్వహించారు. అంతకు ముందు సభా ప్రాంగణంలో సీఐటీయూ జెండాను ఆ సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె హేమలత ఎగరేశారు. అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం తపన్‌సేన్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరలో విశాఖపట్నంలో జరుగనున్న సీఐటీయూ అఖిలభారత మహాసభల నేపథ్యంలో శ్రామిక మహిళా కన్వెన్షన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా చూపడుతున్న పోరాటాల్లో శ్రామిక మహిళల పాత్ర పెరుగుతోందన్నారు. ప్రపంచంలో, దేశంలో సంక్షోభ పరిస్థితులు ముగింపునకు వస్తున్నాయని పెట్టుబడిదారీ తాబేదార్లు, మోడీ లాంటి వారు ప్రచారం చేసుకుంటున్నారనీ, కానీ దేశంలో ఆర్థిక వ్యవస్థ స్తంభించిందనీ, తిరోగమనంలో ఉందనే వాస్తవాలను ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారని వివరించారు. దేశంలో నిరుద్యోగం పేరుకు పోతున్నదనీ, పేదరికం పెరుగుతున్నదనీ, అత్యధిక మంది పేదలుగా మారుతున్నారనీ, తద్వారా అంతరాలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడిదారీ విధానాన్ని మరింత వేగంగా అమలు చేయటం మూలంగా ఉపాధి కోతలు, కార్మిక హక్కుల మీద దాడి పెరిగిపోతున్నాయని చెప్పారు. ఉపాధిలో కోత విధించటమంటే మహిళా శ్రామిక శక్తిని తగ్గించటమేనని అన్నారు. మరోవైపు సామ్రాజ్యవాద శక్తులు సైనికంగా, ఆర్థికంగా బలపడుతున్నాయన్నారు. దీనికి ప్రపంచబ్యాం కు, ఐఎంఎఫ్ వంటి ద్రవ్య పెట్టుబడి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఇది ఆధిపత్య వాదంతో అభివృద్ధి చెందుతున్న దేశాలపై దాడికి దారి తీస్తూ, భూ భౌగోళిక రాజకీయాల్లో మార్పునకు దారితీస్తున్నదని విశ్లేషించారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాష్టీకం అలాంటిదేనని ఉదహరించారు. పాలస్తీనాలో అన్నం కోసం క్యూలైన్‌లో నిలబడిన 69 మంది పిల్లలను దుర్మార్గంగా చంపిన దుష్ట చర్యను చూశామని చెప్పారు. ఈ దుశ్చర్యలు ఎవరికీ పట్టవనీ, వర్గ సంఘాలు మాత్రమే దీన్ని ఎదిరించాలన్నారు. ఐదు నెలల్లో అమెరికాకు సంబంధించిన ఆయుధ కంపెనీలు అపార లాభాలు గడించాయని గుర్తుచేశారు. చైనాపై అమెరికా సుంకాలు విధించటం, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతిని ఆపాలని షరతులు పెట్టి, సుంకాలు విధించటాన్ని చూస్తే ట్రంప్ అధిపత్య ధోరణి పరాకాష్టకు చేరిందని విమర్శించారు. ఇలాంటి చర్యలను కార్మిక వర్గ ఉద్యమాలు మాత్రమే నిలవరిస్తా యని చెప్పారు. శ్రామిక మహిళలు అలాంటి పోరాటా లను నిర్వహించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పాలకులు అనుస రిస్తున్న విధానాలను కష్ట జీవులు భరించలేకపో తున్నా రన్నారు. ఈ ఏడాది జూలై 9న జరిగిన సార్వత్రిక సమ్మెలో అన్ని పరిశ్రమల కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు. అస్సాంలోని ఒక పారిశ్రామికవాడలో 200 పరిశ్రమలుంటే..అందులో మూడు పరిశ్రమల్లో మాత్రమే సీఐటీయూ ఉందనీ, కానీ సమ్మె ప్రాధాన్యతను వారికి వివరించడంతో వారంతా సమ్మెలో భాగస్వాములు అయ్యారని వివరించా రు. కార్మికులకు ప్రభుత్వాల విధానాలను అర్థం చేయించటమే మన కర్తవ్యంగా ఉండాలన్నారు. ‘శ్రమ శక్తి నీతి’ పేరుతో కార్పొరేట్లు తమ దోపిడీ ముసుగును తొలగించారనీ, 29 కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌లు తేవడం దానిలో భాగమేనని తెలిపారు. సమ్మిళిత వృద్ధితో కార్మికులను ఆదుకుంటామని చెబుతూ కార్మికులను చట్టాల అవతలికి నెట్టేస్తున్నారని అన్నారు. కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయటంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అయినా..యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్య నాధ్ అయినా ఒకే పద్దతి అనుసరిస్తారని చెప్పారు. కేరళ ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం పెట్టుబడిదారీ విధానాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడితే.. కేంద్రం అడ్డంకులు సృష్టిస్తున్నదని చెప్పారు. స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించినందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా అక్కడి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతున్నదని తెలిపారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను ఐక్య పోరాటాలతోనే తిప్పికొట్టగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె హేమలత, కోశాధికారి ఎం సాయిబాబు, శ్రామిక మహిళా కన్వీనర్ ఎఆర్ సింధు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆఫీసు బేరర్లు ఉషారాణి, కెఎన్ ఉమేశ్, సుదీప్ దత్త, బేబీరాణి, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కా రాములు, పాలడుగు భాస్కర్, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్ ఎస్వీ రమ, సీఐటీయూ ఆంద్రప్రదేశ్ అధ్యక్షులు ఏవీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.
శ్రామిక మహిళా పోరాటాలు పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



