Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన

ఐక్య పోరాటాలతోనే హక్కుల సాధన

- Advertisement -

స్వాగతోపన్యాసంలో సీఐటీయు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

దేశ వ్యాప్తంగా ఐక్యపోరాటాల ద్వారానే శ్రామిక మహిళల హక్కుల్ని సాధించుకోగలమనీ, ఆ దిశగా ప్రస్తుత వేదిక మార్గనిర్దేశనం చేయాలని శ్రామిక మహిళా కన్వెన్షన్‌ ఆహ్వాన సంఘం చీఫ్‌ ప్యాట్రిన్‌ చుక్కరాములు సూచించారు. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీ 13వ అఖిల భారత కన్వెన్షన్‌లో ఆయన ప్రారంభోపాన్యాసం చేశారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వ్యవస్థీకృత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న మహిళల సమస్యలు అనేకం ఉన్నాయని చెప్పారు. అధికారిక, అనధికారిక ఉపాధిలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి, పరిష్కరించుకొనేలా ఈ వేదిక ఉపయోగ పడాలన్నారు. మొత్తం శ్రామిక వర్గంలో శ్రామిక మహిళల సాధికారత, గౌరవం, హక్కులకోసం ఐక్య పోరాటాలు నిర్మించడంపై ఈ సమావేశంలో చర్చించాలని కోరారు. శ్రామిక వర్గానికి కేంద్రంగా, వేగవంతమైన వృద్ధి, ఆవిష్కరణలు, సాంస్కృతిక గొప్పతనాన్ని కలిగిన మహానగరంగా ఉన్న హైదరాబాద్‌, ఈ ముఖ్యమైన సమావేశానికి సరైన నేపథ్యాన్ని అందిస్తోందని వ్యాఖ్యానించారు. అనుభవాలను పంచుకోవడానికి, సంఘీభావాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా మహిళా కార్మికులకు సురక్షితమైన, మంచి పని పరిస్థితులు, లింగ సమానత్వం, న్యాయమైన వేతనాలను నిర్ధారించడం, సామాజిక భద్రతను ప్రోత్సహించడం తదితర అంశాలపై చర్చించాలని ఆకాంక్షించారు. కర్మాగారాలు, పొలాలు, చిన్న సంస్థలు, గృహ ఆధారిత ప్రదేశాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల హక్కుల కోసం పోరాడటానికి శ్రామిక మహిళా సమన్వయ కమిటీ నిబద్ధతతో పోరాటాలు చేస్తుందని తెలిపారు. రెండ్రోజుల (శని, ఆదివారాలు) సదస్సును నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర కమిటీని విశ్వసించినందుకు అఖిల భారత కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం జరగడానికి ఉదారంగా విరాళాలు ఇవ్వడం ద్వారా నైతికంగా, ఆర్థికంగా మద్దతిచ్చిన శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -