రేషన్‌కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా తన భాష మార్చుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనీస మర్యాద లేకుండా బీఆర్‌ఎస్ నేతలపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సీఎం హోదాకు తగదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రికి ఉన్న అలవాట్లు అందరికి ఉండవనీ, తనలాగే ప్రతి ఒక్కరు ఉండాలనడం మూర్ఖత్వమన్నారు. కాంగ్రెస్‌ను గెలిపించకుంటే సంక్షేమ పథకాలను ఆపుతామని రాజ్యాంగ బద్ధమైన స్థానంలో ఉన్న సీఎం ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను మార్చడం సరికాదని హితవు పలికారు. రూ.5 భోజన పథకం పేరును అన్నపూర్ణగా పెట్టామనీ, ఆదేమి కేసీఆర్ కుటుంబం పేరు కాదు కాదా అని నిలదీశారు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి సర్కస్ కంపెనీలా నడిపిస్తున్నారని విమర్శించారు.
మైనారిటీల ఓట్లు దక్కవనే భయంతోనే అజహరుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రూ.44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామనీ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ కేవలం రూ.4,600 కోట్లు మాత్రవే ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. రెండేండ్లలో నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టలేదని చెప్పారు. కమ్మ సామాజిక వర్గం ఓట్ల కోసమే అమీర్‌పేటలో ఎన్టీఆర్ విగ్రహం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధంగా ఉన్నానని తలసాని సవాల్ విసిరారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, ప్రసన్న లక్ష్మి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి ఇప్పటికైనా భాష మార్చుకో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



