Stream of Consciousness (చైతన్య స్రవంతి) అనే మాటను మొదటిసారిగా ఉపయోగించినవాడు విలియం జేమ్స్ (1842 – 1910). ఇతడు తత్త్వవేత్త, మానసిక శాస్త్ర నిపుణుడు. సాహిత్య రచనలు చేసే రచయిత కాదు. తన Principles of Psychology (1890) గ్రంథంలో చైతన్య స్రవంతికి ఈయన ఇచ్చిన నిర్వచనం, ”జాగత మస్తిష్కం లోని అవలోకనాల, ఆలోచనల, జ్ఞాపకాల, అనుభూతుల నిరాఘాటమైన ప్రవాహం.” ఇతని తమ్ముడైన హెన్రీ జేమ్స్ ఈ శిల్పంతో రానసిన ప్రసిద్ధ నవల పేరు The Portrait of a Lady (1881). జేమ్స్ జాయిస్, ఎడ్వార్డ్ డుజార్డిన్, డోరతీ రిచర్డ్ సన్, వర్జీనియా వుల్ఫ్, విలియమ్ ఫాక్నర్, థామస్ వుల్ఫ్ లు కూడా ఈ శిల్పంతో నవలలు రాశారు.
పాత్రల చేతనాత్మక (conscious) మానసిక ప్రపంచంలోని చిందరవందర ఆలోచనలను, అస్తవ్యస్త భావాలను, జ్ఞాపకాలను ఉన్నదున్నట్టుగా, కలగాపులగంగా పాఠకుల ముందుంచడం చైతన్య స్రవంతిలోని ప్రధాన లక్షణం. వాటిలో సవ్యమైన భాష, తార్కికత, సమంజసత్వం మొదలైనవి ఉండవు. అవి ఆటంకాలు (inhibitions) లేని ఆలోచనలు కనుక, కొన్నిసార్లు వాటిలో అశ్లీలం ఉండవచ్చు. ఇంకా, ఒక రకమైన గందరగోళం కూడా చోటు చేసుకుంటుంది. రాసే సమయంలో రచయిత మానసిక స్థితి కూడా దానికి అనుగుణంగా ఉంటే అది బహుశా అదనపు ఉపయోగాన్ని అందిస్తుంది. అంటే, అధివాస్తవికత (surrealism) లాగా అన్న మాట. సర్రియలిజం విషయానికి వస్తే, స్వప్నావస్థలో లేదా ఉపచేతన (subconscious) స్థితిలో మనసులో తలెత్తే అసంబద్ధ భావాలను యథాతథంగా కాయితం మీద పెట్టడం ఉంటుంది. చైతన్య స్రవంతి శిల్పంలో కథా గమనం క్రమమైన పద్ధతిలో సాగకపోవడం తరచుగా జరిగే విషయం. అంతా సంప్రదాయేతరం (unconventional) గా ఉంటుంది. ఇది సర్రియలిజపు లక్షణాలలో కూడా ఒకటి.
ఈ రచనా పద్ధతిలో సర్వసాధారణంగా కనిపించే ప్రధాన అంశం ఇంటీరియర్ మోనోలాగ్ (స్వగత సంభాషణం). ఈ మాటను కొందరు విమర్శకులు చైతన్య స్రవంతికి ప్రత్యామ్నాయంగా వాడుతారు. కానీ, విస్తతమైన అర్థాన్నిచ్చే మొదటి పదమే మెరుగైనది. స్వగత సంభాషణకు రచయిత వివరణకర్తగా, గైడ్ గా, వ్యాఖ్యాతగా ఉండటం దాదాపు ఎప్పుడూ జరగదు. అంతే కాకుండా అతడు పాత్రల మానసిక ప్రపంచాలలోని చపలచిత్తతను గానీ, సంభాషణలలోని వ్యాకరణ దోషాలను గానీ, అస్తవ్యస్తమైన క్రమాన్ని గానీ, తార్కికకతా రాహిత్యాన్ని గానీ సరిదిద్దే ప్రయత్నం చేయడు. మచ్చుకు యులిసిస్ నవలలో జేమ్స్ జాయిస్ రాసిన ఈ భాగాలను గమనించిండి.
“She smilesmirked supercilious (wept! arenw’t men?), but, lightward gliding, mild she smiled on Boylan.” “Bronze by gold heard
the hoofirons, steelyringing. Imperthnthn thnthnthn.” ఇక్కడ వ్యాకరణం కరిగిపోయింది. రెండవ వాక్యంలో సరైన వాక్యనిర్మాణాన్ని ధ్వనులు స్థానభ్రంశం చేస్తూ onomatopoeia (సాహిత్య ఉపకరణాలలో ఒకటి) నెలకొన్నది.
తెలుగులో ఈ శిల్పంతో రాసినవారిలో బుచ్చిబాబు, శ్రీశ్రీ, రావిశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్, అంపశయ్య నవీన్, వడ్డెర చండీ దాస్ ముఖ్యులు. ఈ కాలపు రచయిత బి.ఎస్.ఎమ్. కుమార్ రచనలలో చైతన్య స్రవంతి శిల్పం కనిపిస్తుంది. కథల్లో, నవలల్లో ఈ శిల్పం మొదటినుంచి చివరిదాకా సాగవచ్చు లేదా మధ్యమధ్య ఉండవచ్చు. బుచ్చిబాబు రాసిన చైతన్య స్రవంతి అనే కథ చైతన్య స్రవంతి శిల్పంలో ఉంది. అసంపూర్ణ వాక్యాలతో నిండివుండటం వలన కథకు ప్రవాహగతి సిద్ధించింది. ఇది కూడా ఈ శిల్పపు లక్షణాలలో ఒకటి. తెలుగులో ఈ శిల్పానికి ఉదాహరణలు అనతగిన కొన్ని వాక్యాలను చదవండి.
”రష్యన్ మనస్తత్వవేత్త, జకాప్ సిపిల్ పాలిష్ స్కీ ముగ్గురు లాయర్లు మాత్రిమార్తి చోటు లేక కడ్డీ వొదిలి రోడ్డుమీద పడ్డారు, – రోడ్ డామేజ్ – డిఫమేషన్ సెక్షన్ కోల్ టార్ సిమెంట్ – ఏనుగువీపు మీద పడిన (పండిన?) పుండు మీద వాలిన యీగలమాదిరి – ఏనుగు కాదు – వొంటి – మధురవాణి లొటపిట, చెటపట, భమిడిపాటి కచటతప – అండమాన్సులో నీటికుండని అంటి పెట్టుకునివున్న ఖైదీల ఎండిన పెదవుల మాదిరి -” (బుచ్చిబాబు కథ, ‘చైతన్య స్రవంతి’)
అసంబద్ధమైన శబ్దసమ్మేళనాల సహాయంతో అద్భుతమైన syntactical flamboyance ను సాధించి, జాయిస్ వచన రీతికి అతి దగ్గరగా వచ్చిన తెలుగు రచయిత బి.ఎస్.ఎం. కుమార్. ప్రత్యేకమైన ప్రయత్నమేమీ అవసరం లేకుండానే అటువంటివారికి ఆ నైపుణ్యం సిద్ధిస్తుందేమో. ఆయన రాసిన దేహ నాగరక లిపి పుస్తకం లోని ఈ వాక్యాలను పరిశీలించండి. ”ఛాతీలో నసిగిన వెంట్రుకల గస తీర్థనల్ని వడపోసుకొని” మండి.. జరజరమని నిన్ను పైటని చెమట పట్టిచ్చినప్పుడు.. చూపు కొసలో చల్లారిపోయిన ‘టీ’ కప్పుల్ని ఊదుకొంటూ మంటల్ని జేబూలో పోసుకొని వెళ్తూన్న వాన నడకని దగ్గర చేసుకొన్నాం.”
”గాలి ప్రమిదల ఆవిరితో చుట్టేసిన నిద్రమత్తులు మడుగులో ఊరారుతున్న దేహాలు.. గండి పడ్డ దుఃఖం.. సిగ్గుపడుతున్న మెట్లకింద నాచుపట్టిన అనుమాన దోషాలు నెరిసాయి. ఊరంపట భూమిలో తొణకిసలాడే వాన వెనకాల ఇల్లు -”
ఇంకా తీర్థన (తీర్థం + ప్రార్థన/ కీర్తన), తటాక్షించిన (తటస్థించిన + కటాక్షం), నైరూధ్యం (నైరూప్యం + వైరుధ్యం), ఊక్షసి (ఊర్వశి + రాక్షసి) లాంటి ఎన్నో కొత్త మాటలు కనిపిస్తాయి. ఊహల తొడతొక్కుడులో ఉద్భవించే ఇటువంటి పదాలను portmanteau words అంటారు. జేమ్స్ జాయిస్ కూడా saddenly (sad + suddenly), guesstimate (guess + estimate) లాంటివాటిని ప్రయోగించాడు.
చైతన్య స్రవంతిలో భాష నమూనా ఒకే పద్ధతిలో (fixed గా) ఉండకపోవచ్చు. పైన ఉదాహరించిన ఇద్దరు రచయితల వాచకాలను గమనిస్తే ఈ విషయం అవగతమౌతుంది. ఇటువంటి అరుదైన శిల్పాలు ఏ భాషాసాహిత్యానికైనా అపురూపమైనవి.
- ఎలనాగ



