వీకెండ్స్‌లో జల్సాలు
అక్రమ నిర్మాణాల్లో అసాంఘీక కార్యక్రమాలు
ప్రత్యేక ఈవెంట్ల పేరుతో యువతకు గాలం
రంగారెడ్డి జిల్లాలో వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లు
మొయినాబాద్‌లో అత్యధికం
ఇటీవల పలు పార్టీలపై దాడులు, అరెస్టులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ఫామ్‌హౌస్‌లు అసాంఘీక కార్యకలపాలకు కేరాఫ్‌గా మారుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే చాలు.. రేవ్, ముజ్రా పార్టీలకు అడ్డాలు అవుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌ల్లో ప్రత్యేక ఈవెంట్ల పేరుతో యువతకు గాలం వేస్తున్నారు. విదేశీయులతో చిందులు, విందులు ఏర్పాటు చేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అన్‌లైన్‌లో ప్రత్యేక పేజీలు నిర్వహిస్తూ.. యువతను ఏకం చేసి.. పార్టీలు నిర్వహిస్తున్నారంటే.. పరిస్థితి ఏ తీరుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్దమొత్తంలో ఫామ్‌హౌస్‌లు ఉండటం, వాటిల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటిగా మారింది. అయితే అడపదడపా పోలీసులు దాడులు నిర్వహించి, పలువురిని అరెస్టు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కట్టడి చేయలేని పరిస్థితి ఉంది. రేవ్, ముజ్రా పార్టీలకు కేరాఫ్‌గా మారిన ఫామ్‌హౌస్‌లపై ప్రత్యేక కథనం.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మొయినాబాద్‌లో సుమారు 500 వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. మొయినాబాద్ ప్రాంతం 111 జీవో పరిధిలో ఉండటంతో ఇక్కడ పెద్ద, పెద్ద నిర్మాణాలు చేపట్టేందుకు అవకాశం లేకపోవడంతో ఈ ప్రాంతం మొత్తం ఫామ్‌హౌస్‌లకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతంలో మొదట్లో సినీ ఇండిస్టీకి చెందిన కొంత మంది ప్రముఖులు ఖాళీ సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. విశ్రాంతి భవనాలు కాస్తా.. అసాంఘీక కార్యకలపాలకు అడ్డాగా మారాయి. ప్రస్తుతం మొయినాబాద్ ప్రాంతంలో వ్యాపారం నేపథ్యంలోనే ఫామ్‌హౌస్‌లు నిర్మిస్తున్నారు.
మొయినాబాద్‌లో మొదలైన ఫామ్‌హౌస్ కల్చర్ ప్రస్తుతం జిల్లా మొత్తం పాకింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఫామ్‌హౌస్‌లు నిర్మించి వ్యాపారాలు చేస్తున్నారు. మంచాల మండలంలో ఫామ్‌హౌస్‌లు నిర్మించి.. అన్‌లైన్‌లో యువతను ఎట్రాక్ట్ చేసి పార్టీలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. శంషాబాద్, రాజేంద్రనగర్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, జన్వాడ, మొయినాబాద్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్‌మెట్ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. కొంతమంది వీటిని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు.
ఫామ్‌హౌస్‌ల్లో రేవ్ పార్టీలు
ఇటీవల మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో మైనర్లు ముజ్రా పార్టీ నిర్వహించారు. నగరానికి చెందిన ఒక వ్యక్తి డీజే ఇన్‌స్టాలో ట్రాప్‌హౌస్ పేరుతో అకౌంట్ నిర్వహించారు. మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ట్రాప్‌హౌస్ నిర్వహిస్తున్నట్టుగా విపరీతంగా ప్రకటనలు గుప్పించి అందరినీ ఊరించాడు. ఒక్కరికైతే రూ.1,600, జంటగా వస్తే రూ.2,800గా నిర్ణయించాడు. ఇన్‌స్టాలో ఇది చూసి మైనర్లు పార్టీకి సిద్ధమయ్యారు. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ నిర్వహించారు. పోలీసులకు ఈ సమాచారం అందడంతో ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించి, 59మందిని పట్టుకున్నారు. ఇందులో 22 మంది మైనర్లు ఉన్నారు.
అందులో 5 మంది అమ్మాయిలు ఉండగా, మరో 17 మంది అబ్బాయిలు ఉన్నారు. అలాగే మంచాల మండలం లింగంపల్లిలో కొద్దిరోజుల క్రితం ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రాపార్టీ నిర్వహించగా.. పోలీసులు దాడులు చేసి పలువురిని అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు కొకొల్లలు. అయితే ఈ ఘటనల నేపథ్యంలో.. ఇబ్రహీంపట్నం పరిధిలోని ఫామ్‌హౌస్ నిర్వాహకులతో మహేశ్వ రం డీసీపీ సునీతారెడ్డి సమావేశం నిర్వహించి, అవగాహన కల్పించారు. ముజ్రా పార్టీలు నిర్వహిస్తే.. చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంతటితో సరిపెట్టకుండా.. పకడ్బందీ చర్యలు తీసుకుని, అసాంఘిక కార్యక్రమాలను పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.



