Monday, November 3, 2025
E-PAPER
Homeజాతీయంఇక 'పేదరిక నిర్మూలనే' లక్ష్యం

ఇక ‘పేదరిక నిర్మూలనే’ లక్ష్యం

- Advertisement -

కేరళ స్థానిక ఎన్నికల ఎల్డీఎఫ్‌ ప్రచారంలో
ఇదే ప్రధాన ఎజెండా : నిర్దేశించిన సీపీఐ(ఎం)
తిరువనంతపురం :
కేరళలో ఇప్పటికే తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం కొత్త లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. గృహస్థాయిలో పేదరికాన్ని నిర్మూలించడంపై దృష్టిపెట్టింది. రాష్ట్రంలో త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ ప్రచారంలో ఇదే ప్రధాన ఎజెండా ఉండనుంది. ఈ అంశాన్ని సిపిఎం నిర్ధేశించింది. ఈ వివరాలను సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. ఎల్డీఎఫ్‌ ఇప్పటికే రాష్ట్రంలో తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిందని, ఇప్పుడు పేదరిక నిర్మూలనే ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని తెలిపారు. నిరాశ్రయత, జీవనోపాధి లేకపోవడం.. వంటివి పేదరికానికి ప్రధానకారణాలని చెప్పారు. అలాగే, కేరళపై కేంద్రం కొనసాగిస్తున్న ‘ఆర్థిక ఆంక్షలు’ను తొలగించి, రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ. 2 లక్షల కోట్ల తప్పనిసరి సమాఖ్య నిధులను విడుదల చేస్తే నెలవారీ సామాజిక సంక్షేమ పెన్షన్‌ను రూ2,500కు పెంచే అవకాశం ఉందని కూడా గోవిందన్‌ విలేకరులకు తెలిపారు.

సమర్థ ప్రయత్నాలు
యూడీఎఫ్‌ నియంత్రణలో ఉన్న జిల్లా పంచాయితీలు, కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయితీలు కూడా రాజకీయాలకు అతీతంగా పేదరిక నిర్మూలన ప్రయత్నాల్లో ముందంజలో ఉన్నారని గోవిందన్‌ తెలిపారు. కుటుంబ శ్రీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, స్థానిక అసోసియేషన్లతో సహా లక్షలాది మంది వలంటీర్లు ఇందులో భాగంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలిత జిల్లా పంచాయతీ అయిన ఎర్నాకులంలో ఒక లబ్ధిదారున్ని పేదరికం నుంచి తొలగించినట్టుగా ప్రకటించకపోవడంతో, ఈ సమస్యను రాష్ట్ర మంత్రివర్గం తాత్కాలికంగా పరిష్కరించిందని తెలిపారు.

వ్యవసాయ కార్మికులు, వితంతువులు, సీనియర్‌ సిటిజన్లు, ట్రాన్స్‌జెండర్లు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన 18 నుంచి 35 ఏండ్ల వయస్సు గల మహిళలు (సుమారు 34 లక్షల మంది), అలాగే అవసరమైన, విద్యావంతులైన ఉద్యోగ ఆశావహులతో సహా దాదాపు కోటి మందిని రాష్ట్ర సామాజిక సంక్షేమ భద్రతా వలయంలోకి ఎల్డీఎఫ్‌ తీసుకువచ్చిందని గోవిందన్‌ తెలిపారు.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యవర్గ, రాష్ట్ర కమిటీ సమావేశాలకు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఎల్డీఎఫ్‌ కన్వీనర్‌ టిపి రామకృష్ణన్‌ హాజరయ్యారని గోవిందన్‌ తెలిపారు. స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారం కోసం రోడ్‌ మ్యాప్‌ను ఈ సమావేశాల్లో రూపొందించినట్టు గోవిందన్‌ వెల్లడించారు.

నిటి ఆయోగ్‌ నివేదిక
2021 నిటి ఆయోగ్‌ నివేదికలోని గణాంకాల ప్రకారం కేరళ జనాభాలో 0.7 శాతం మంది రోజువారీ పేదరికంతో బాధపడుతున్నారని గోవిందన్‌ చెప్పారు. రాష్ట్రంలో బహుముఖ పేదరికం 2025 నాటికి 0.7 శాతానికి తగ్గిందని నిటి ఆయోగ్‌ వెల్లడించిందని తెలిపారు. తీవ్ర పేదరికాన్ని నిర్మూలించగలిగితే.. బహుముఖ పేదరికాన్ని నిర్మూలించాలనే లక్ష్యం ప్రభుత్వానికి సులభంగా అందుబాటులో ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ లక్ష్యం సాధించడం కష్టమని ఆయన అన్నారు. ఉదాహరణకు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో జనాభాలో 20 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత విడి సతీశన్‌ చెప్పినట్టుగా మంత్రదండంతో ఎల్డీఎఫ్‌ తీవ్ర పేదరికాన్ని నిర్మూలించలేదని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -