తాహతుకు మించి ఆర్భాటాలు…మధ్యతరగతిపై అప్పుల భారం
ఈవెంట్లుగా మారిన పెండ్లిండ్లు
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వివాహాలూ ఉన్నాయ్
మొదలైన మ్యారేజ్ సీజన్
మీసా మధు
పెండ్లిండ్ల సీజన్ ప్రారంభమైంది. ఒకర్ని చూసి మరొకరు తమ పిల్లల పెండ్లిండ్లు ఆర్భాటంగా చేయాలని పోటీలు పడుతున్నారు. ఎవరి ఆర్థిక పరిస్థితులు వారికి ఉన్నా, దానికి తగ్గట్టే సర్దుకొని ‘మూడుముళ్లు’ కానిచ్చేద్దాం అని భావించట్లేదు. అప్పు చేసైనా ఆడంబరంగా ఆడపిల్లల్ని మెట్టినింటికి పంపాలని తల్లిదండ్రులు భావిస్తున్నారు. ముహూర్తాల సెంటిమెంట్‌తో ఈనెల 12 నుంచి డిసెంబర్ 16 వరకు దేశంలో దాదాపు 48 లక్షల పెండ్లిండ్లు జరగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో ఈ సీజన్‌లోనే లక్ష వివాహాలు జరుగుతాయని అంచనా. ఇప్పటికే సిటీల్లోని అన్ని కళ్యాణమండపాలు, ఫంక్షన్ హాళ్లు బుక్ అయిపోయాయి. వాటి అద్దెలు కూడా రెండు నుంచి మూడింతలు పెరిగాయి. గతంలో పెండ్లి అంటే కులవృత్తుల సమాహారం. ఇప్పుడు అదో ‘ఈవెంట్’గా మారిపోయింది. పెండ్లికి ముందే ‘ప్రీ వెడ్డింగ్ షూట్’తో మొదలై, అప్పగింతల వరకు అంతా ఆర్భాటమే! ఆ పెండ్లి తంతుని ‘గొప్ప’గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడం పరిపాటిగా మారింది.
ఆ ఈవెంట్స్‌ను చూసిన సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు కూడా ఆ స్థాయిలో తమ బిడ్డల పెండ్లిండ్లు చేయాలని భావించడం, దానికోసం ఉన్న ఆస్తుల్ని అమ్ముకోవడమో, తనఖా పెట్టుకోవడమో, అధిక వడ్డీలకు అప్పులు తేవడమో చేస్తూ నానా హైరానా పడుతున్నారు. పెండ్లి అంటేనే భరించలేని ‘స్థాయి’ ఖర్చుగా మారిపోయింది. ఇటీవలి కాలంలో సినీ నటులు, సెలబ్రిటీల వివాహాలకు కొన్ని పత్రికలు, చానళ్లు అధిక ప్రాధాన్యం ఇచ్చి ప్రచారం చేస్తున్నాయి. వాటి ప్రభావం కూడా వధూవరులపై ఉంటోంది. ఆ స్థాయిలో కాకున్నా, ఉన్నంతలో ‘గొప్ప’గా పెండ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తున్నారు. బిడ్డల కోరిక కాదనలేక తల్లిదండ్రులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి హంగు ఆర్భాటాలకు ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
సామాన్యుల అగచాట్లు
ఇంట్లో ఆడపిల్ల పెండ్లి చేయడానికి సామాన్యులు నానా అగచాట్లు పడుతున్నారు. కట్నకానుకలు, పెరిగిన ధరలతో పెండ్లితంతు తలకుమించిన భారం గా మారుతోంది. ఈ క్రమంలో తమకున్న భూములు, ప్లాట్‌లను విక్రయించేందుకు చూస్తే.. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ లేక ధరలు తగ్గిపోయి కొనేవారు కరువయ్యారు. అప్పు చేద్దామంటే, అధిక వడ్డీలు భయపెడుతున్నాయి. బంధువులు, స్నేహితుల నుంచి చేబదుళ్లు తప్పట్లేదు. ఆమాత్రం ఆస్తులు కూడా లేని కుటుంబాల అవస్థలు అన్నీఇన్నీ కావు.
పెరిగిన ధరలు
పెండ్లి అంటేనే బంధుమిత్రుల కోలాహలం. ఖర్చులు ఆ స్థాయిలో తప్పవు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వ అసమర్థపాలన వల్ల సామాన్యుల బతుకులు మరింత ఛిద్రం అవుతున్నాయి. కామన్‌మ్యాన్‌కు ద్రవ్యోల్బణం అంటే తెలియకపోవచ్చేమో కానీ, ఇంటి దగ్గరి అంగడిలో కిలో కందిపప్పు రూ.130 అనగానే కళ్లు తిరగడం ఖాయం. గతంలో ఎన్నడూ లేనట్టు ఇప్పుడు మార్కెట్లు, తోపుడు బండ్ల మీద కూరలు, ఉల్లిపాయలు, పండ్లు, ఆకుకూరలు సహా అన్నీ రూ.100కు రెండు కిలోలు, మూడు కిలోలు, నాలుగు కట్టలు అంటూ బోర్డులు తగిలించడం చూస్తూనే ఉన్నాం.
రూ.100 అంటే అదేదో రూ.10తో సమానంగా మారిపోయింది. అలాగని సామాన్యుల జీత భత్యాలు దానికి తగినట్టు పెరిగాయా అంటే అలాంటిదేం లేదు. ఆదాయానికి మించి ధరలు, ఖర్చుల్ని పెంచి, ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బు వసూలు చేయడమే మోడీ మార్క్ ద్రవ్యోల్బణం. ఈ పెరిగిన ధరల్ని పెండ్లిండ్లలో భరించలేక తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతున్నారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ దిగజారడం అంటే కూడా దాదాపు ఇదే! ఈ ప్రభావం ఇప్పుడీ పెండ్లిండ్లపై పడుతోంది.
కార్పొరేట్ల ఆర్భాటం
ఈ పెండ్లిండ్ల సీజన్‌లో దాదాపు రూ.6 లక్షలకోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారవర్గాలు అంచనా వేశాయి. కేవలం నెలరోజుల్లో అన్ని కోట్ల వ్యాపారం ఎవరికి ప్రయోజనాలు కలిగిస్తుందో అర్థం చేసుకోవాలి. ఈ వ్యాపార విస్తరణల కోసమే సోషల్ మీడియాలో సెలబ్రిటీల పెండ్లిండ్లు, ఇతర ఫంక్షన్లను కార్పొరేట్లు ప్రమోట్ చేస్తున్నారు. వీటివల్ల కొందరికి ఉపాధి లభించవచ్చమో కానీ, అంతిమంగా పెండ్లి పేరుతో నష్టపోయేది సామాన్యులే! దీనివల్లే ఆడపిల్ల పెండ్లి అంటేనే ఆర్థిక భారం అనే భావన సమాజంలోకి విస్తృతంగా వెళ్తోందనే విషయాన్ని గమనించాలి.
అన్నీ కాస్ల్టీనే…
ఒక సామాన్య కుటుంబం ఆడపిల్ల పెండ్లి చేసేందుకు కట్నకానుకలతో కలిసి కనీసం రూ.10 లక్షల వరకు ఖర్చు చేయక తప్పట్లేదు. ఫంక్షన్‌హాల్స్ రేట్లు లక్షల్లోనే ఉంటున్నాయి. మండపం, అలంకరణలు, పెట్టిపోతలకు బట్టలు, బాజాభజంత్రీలు, భోజనాలు ఇతరత్రా ఖర్చులు గుదిబండగా మారుతున్నాయి. ఫంక్షన్ హాల్ కాకుండా ఇంటిదగ్గరే టెంట్ వేసి పెండ్లి చేద్దామన్నా, టెంట్‌హౌస్‌తో పాటు వంటసామాగ్రి అద్దెలూ తక్కువేం లేవు. అసలే చాలీచాలని వేతనాలతో బతుకీడుస్తున్న మధ్యతరగతి కుటుంబాలు ఆడంబరాలకు వెళ్లలేక, ఉన్నంతలో సర్దుకోలేక ఆర్థికంగా నానా అగచాట్లు పడాల్సి వస్తోంది.
ఇలా కూడా చేయొచ్చు
పెండ్లి అంటే ఆర్భాటమే కాదు. ఓ జంట కలకాలం సుఖంగా కలిసుండటమే. దానికోసం తక్కువ ఖర్చుతో చేసుకొనే వివాహాలూ ఉన్నాయి. వధూవరులు, వారి తరఫు బంధువులు అంగీకరిస్తే తక్కువ ఖర్చుతో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవచ్చు. ఆర్యసమాజ్ వంటి చోట్లా పెండ్లిండ్లు చేసుకోవచ్చు. కమ్యూనిస్టుల తరహాలో స్టేజ్ మ్యారేజ్‌లు చేసుకోవచ్చు. ఇవన్నీ తక్కువ ఖర్చుతో జరిగేవే. కేవలం హిందూ సంప్రదాయంలోనే కాదు…ఇతర మతాల్లో కూడా పెండ్లి అనగానే హంగుఆర్భాటం, ఖర్చులు సర్వసాధారణంగా మారాయి. ఎవరి సంప్రదాయంలో అయినా, ఇతర పద్ధతుల్లో అయినా, వధూవరుల్ని ఒక్కటి చేయడమే పెండ్లి లక్ష్యం. ఆ మూల సూత్రాన్ని వదిలేసి, ఆర్భాటాల కోసం అప్పులపాలై అవస్థలు పడుతూ, ఆడపిల్ల పెండ్లిని తలకు మించిన భారంగా మార్చేయడం ఎంతవరకు సమంజసం? సమాజం ఆలోచించాల్సిందే!!
భయపెడుతున్న బంగారం
బంగారం భారతీయులకు సెంటిమెంట్‌తో కూడిన ఆస్తి. పెండ్లి సమయంలో వీసమెత్తు బంగారమైనా తప్పనిసరి. ఇప్పుడా బంగారం రేటు భయపెడుతోంది. ప్రస్తుతం తులం (10 గ్రాములు) రూ.1.24 లక్షల వరకు ధర పలుకుతోంది. దీనితో కనీసం పుస్తెలు, ముక్కుపుడక, కమ్మలు వంటివి ఐదు తులాల్లో కొన్నా, రూ.6 లక్షలకు పైనే ఖర్చు అవుతోంది. ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇప్పుడు బంగారమే పెద్ద సవాలుగా మారింది. ఆడపిల్ల పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీ కూడా ధర పెరగడంతో అటకెక్కేసింది.



