వ్యక్తిగత విమర్శలకే పరిమితం
ఏం చేసిందీ చెప్పలేని వైనం
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ఎన్‌డిఎ తరపున ప్రచారం చేపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాల నేతలపై వ్యక్తిగత దూషణలు మినహా ప్రజలకు తమ ప్రభుత్వం ఏమీ చేసింది..ఏం చేయనుంది వంటి విషయాల జోలికి వెళ్లడం లేదు. ఆరా లో ఆదివరాం నిర్వహించిన ప్రచారసభలోనే మోడీ ఇదే తీరు కొనసాగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్ ఇంకా కోలుకోవడం లేదని, నాడు అక్కడ బాంబులు పడుతుంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకుటుంబం నిద్రలు లేని రాత్రులు గడిపిందని ఆయన వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోశారని, దానికి కాంగ్రెస్ క్షమాపణ నేటికీ చెప్పడం లేదని మోడీ అన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన ‘ఓటరు అధికార్ యాత్ర’ను పరోక్షంగా ప్రస్తావిస్తూ ‘చొరబాటుదారులను రక్షించేందుకే ఈ ర్యాలీ నిర్వహించారని మోడీ ఆరోపించారు.
అలాగే ఆర్జెడి అనుకూలంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించేందుకు కాంగ్రెస్‌కు ఇష్టం లేదని, కానీ తేజస్వీయాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించేందుకు కాంగ్రెస్ తలపై తుపాకీ ఎక్కుపెట్టి మరీ ఆర్జెడి ఆ అవకాశాన్ని దక్కించుకుందని పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం ఆ పార్టీల నేతలు పరస్పరం పోట్లాడుకుంటారని వ్యాఖ్యానించారు. జాతీయ భద్రత, సైన్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేస్తోందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేశామని, ఉగ్రవాదులను వారి గడ్డపైనే శిక్షించాలని ప్రతిజ్ఞ చేశామని ఇలా బీహార్‌తో నేరుగా సంబంధం లేని పాత అంశాలను పునరుద్ఘాటించడం మినహా నిర్దిష్టంగా బీహార్ ప్రజానీకానికి ఏం చేశారన్నదీ ప్రధాని మోడీ తన ప్రసంగంలో చోటు కల్పించకపోవడంతో సభకు హాజరైన ప్రజలు సైతం నిరాశకు గురయ్యారు.



