నవతెలంగాణ – హైదరాబాద్: బిగ్ బాస్ తెలుగు సీజన్-9లో మరో ఎలిమినేషన్ జరిగింది. నటి దువ్వాడ మాధురి కేవలం రెండు వారాలకే హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో అత్యల్ప ఓట్లు రావడంతో ఆమె ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించారు. ఈ అనూహ్య పరిణామంతో మాధురి షాక్‌కు గురయ్యారు. ఈ వారం నామినేషన్ల ప్రక్రియలో మాధురితో పాటు సంజన, రీతూ చౌదరి, కల్యాణ్, తనూజ, రాము, డిమోన్ పవన్, గౌరవ్ ఉన్నారు.
ఓటింగ్ సరళిలో చివరి వరకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ గౌరవ్, మాధురి మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే, చివరికి ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు వచ్చిన మాధురి తన ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది. హౌస్ నుంచి వెళ్లిపోయే ముందు మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తాను ఎలిమినేట్ అవుతానని ముందే ఊహించానని, అయితే నవంబర్ 4న తన భర్త శ్రీనివాస్ పుట్టినరోజు ఉండటంతో ఆ సమయంలో ఆయనతో ఉండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు.



