గణనీయంగా తగ్గిన ఉపాధి కల్పన 
47.6శాతం తగ్గిన పనిదినాలు 
19.94శాతానికి తగ్గిన కుటుంబాల సంఖ్య 
తొలగించిన జాబ్‌కార్డుల పునరుద్ధరణలో నిర్లక్ష్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు పని కల్పించి వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో రాష్ట్రం వెనుకబడింది. కార్మికుల సంఖ్య పెరిగినా ఉపాధి లేకపోవడంతో నిర్దేశించిన వేతనాన్ని కార్మికులు పొందలేకపోయారు. లిబ్‌టెక్ ఇండియా సంస్థ 2025 ఏప్రిల్ సెప్టెంబర్ వరకు ఉపాధి హామీపై నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేల్చింది. ప్రభుత్వ నివేదికల ఆధారంగానే తాము ఈ రిపోర్టు తయారు చేసినట్టు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉపాధి పనుల అమలు తీరుపై తాజా గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
సగటు పనిదినాల్లో క్షీణత
గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనిచేసిన ప్రత్యేక కుటుంబాల సంఖ్య 25.33లక్షల నుంచి 19.94లక్షలకు తగ్గింది. అంటే ప్రతి కుటుంబానికి సగటున 41రోజుల నుంచి 27 రోజులకు పనిదినాలు పడిపోయాయి. ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో మొత్తం పనిదినాలు 47.6శాతం తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఆ తగ్గుదల 10.4శాతం ఉంది అని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆదాయం తగ్గటానికి ప్రధాన కారణం పనిదినాలను కల్పించటంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు పని కల్పించి వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమలులో రాష్ట్రం వెనకబడటానికి నిర్వహణలో నిర్లక్ష్యం తప్ప మరొకటి కాదని విమర్శలు ఉన్నాయి.
వేతన నష్టం..
పని దినాలు తగ్గిపోవడం వల్ల ఆదాయాలు పడిపోయి, కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నాయి. కేంద్రం ప్రకటించిన వేతనం రూ.300 నుంచి రూ.307కు పెరిగినప్పటికీ పనిదినాలు తగ్గటం వల్ల కుటుంబం ఏడాదికి రూ.1,686 మాత్రమే పొందింది. గతేడాది ఉన్న పనిదినాలే కల్పిస్తే..ప్రతి కుటుంబ రూ.3,515 అదనంగా సంపాదించేదని ఉపాధి హామీ కార్మికులు తెలిపారు. ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తప్పనిసరి చేయటం వల్ల కార్మికులకు ఇబ్బందిగా మారింది. ఇందుకోసం కార్మికుల జాబ్ కార్డుకు ఆధార్ లింకు అవ్వాలి. ఆధార్, జాబ్ కార్డుపై పేరు సరిగ్గా పొంతన కుదరాలి. బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ లింక్ కావడంతోపాటు ఎన్‌పీసీఐలో నమోదు కావాలి. వీటిల్లో ఏది లేకపోయినా కార్మికులు ఏబీపీఎస్‌కు అనర్హులుగా మారుతున్నారు. 
2022-23లో ఆధార్ ఆధారిత చెల్లింపు విధానం(ఏబీపీఎస్) అమలు సమయంలో 5.1లక్షల జాబ్ కార్డులు తొలగించినట్టు సర్వే వెల్లడించింది. అయితే, అలాంటి తొలగింపు తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. 2025-26లో తొలగింపులు కొనసాగుతున్నాయి. కానీ..తొలగించిన వారిని తిరిగి చేర్చుకునే ప్రక్రియ జరగటం లేదు. అత్యధిక తగ్గుదల ఉన్న జిల్లాల్లో మేడ్చల్ మల్కాజిగిరి (-92.8శాతం), జోగులాంబ గద్వాల(-72శాతం), కామారెడ్డి( -68శాతం) నిజామాబాద్(-67శాతం) ఉన్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం. 
మోస్తరుగా తగ్గిన జిల్లాలను పరిశీలిస్తే.. ఆదిలాబాద్(-18శాతం), నల్లగొండ(-24.5శాతం),యాదాద్రి భువనగిరి(-34.3శాతం), సిద్దిపేట(-34.7శాతం)గా ఉన్నాయి. తెలంగాణలో నమోదైన 53లక్షలకు పైగా కార్మికులకు ఈకేవైసీ పూర్తి చేయలేదు. దీంతో వేతనాలు ఆలస్యం కావడం, లేదా నిరాకరించటం చేస్తున్నారు. రాష్ట్రంలో కేవలం 48.5శాతం మాత్రమే ఈకేవైసీ పూర్తయిందంటే..పరిస్థితి ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతున్నది. సామాజిక తరగతులవారీగా చూసినప్పుడు ఎస్సీ(-48.3శాతం) ఎస్టీ (-41.7శాతం)ఇతరులు(-49.3శాతం) తగ్గుదల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. పథకం అమలు చేయడంలోనూ, కార్మికులకు ఉపాధి కల్పించడంలోనూ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.

                                    

