నల్లగొండ, పాలమూరు ప్రాజెక్టులపై వివక్ష 
బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతో పెరిగిన టన్నెల్ ఖర్చు
అప్పుడు రూ.2వేల కోట్లు… ఇప్పుడు రూ. 4600 కోట్లు
ప్రపంచంలో 40కి.మీ. టన్నెల్ ఎక్కడా లేదు
ఇది పూర్తైతే తెలంగాణ రికార్డ్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
మ్యాగెటిక్ సర్వే ద్వారా ఎల్‌ఎల్‌బీసీ పనుల పరిశీలన
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
”బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రాజెక్టుల పట్ల వివక్ష చూపారు. ఏడాదికి కిలోమీటర్ సొరంగం తవ్వినా ఎస్‌ఎల్‌బీసీ ద్వారా నల్లగొండ ఫ్లోరైడ్ బాధితులకు తాగు, సాగునీరు అందేది. నాడు కాంగ్రెస్ మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఆ పార్టీకి మంచి పేరు వస్తుందన్న కపట బుద్ధితో ఎస్‌ఎల్‌బీసీతో పాటు కేఎల్‌ఐ బీమా, కోయిల్‌సాగర్, నెట్టంపాడు ప్రాజెక్టులను గత సీఎం పూర్తి చేయలేదు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు వ్యయం పెరిగింది..” అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరు ద్ధరణ కోసం హెలికాప్టర్ మ్యాగెటిక్ సర్వే పనులను సోమవారం ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. అనంతరం మన్నెవారిపల్లిలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. 
30 టీఎంసీల తరలింపుతో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983లో ఎస్‌ఎల్బీసీ ప్రాజెక్టు మంజూరైందన్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూ చివరికి ఉమ్మడి రాష్ట్రంలో 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో టన్నెల్-1, టన్నెల్-2 పనులను రూ.1968 కోట్లతో ప్రారంభించారని గుర్తు చేశారు. టన్నెల్ బోర్‌మిషన్‌ను దేశంలోనే తొలిసారి ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌కు ఉపయోగించారని తెలిపారు. 2014 వరకు 30 కిలోమీటర్లు పూర్తయితే.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోలేదన్నారు. ఏడాదికి కిలోమీటర్ తవ్వినా పదేండ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఫ్లోరైడ్ బాధితులకు తాగునీరు, బీడు భూములకు సాగునీరు అందేదని అన్నారు. రాజకీయ దురుద్దేశంతో ఆ నాటి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు తీరని అన్యాయం చేసిందని విమర్శించారు. గ్రావిటీ ద్వారా నల్లగొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచంలో 40కి.మీ టన్నెల్ ఎక్కడా లేదని, అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తామని చెప్పారు. ఇది పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుందన్నారు. ఆనాడు రూ.2 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని, బీఆర్‌ఎస్ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4600 కోట్లకు పెరిగిందని అన్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమేకాదు.. అనేక ఆటుపోట్లను దాటుకుంటూ తాము అధికారంలోకొచ్చాక మళ్లీ పనులు మొదలు పెట్టామని తెలిపారు. గుట్టలలో ఉన్న పొరల కారణంగా పలచటి మట్టి రావడంతో జరిగిన ప్రమాదంలో దురదృష్టవశాత్తు ఎనిమిది మంది కార్మికులు చనిపోయారన్నారు. 
ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. కేసీఆర్ పదేండ్ల కాలంలో రూ.లక్షా 86 వేల కోట్లు కాంట్రాక్టర్లకు ప్రాజెక్టుల నిర్మాణంలో ముట్టజెప్పారని ఆరోపించారు. అందులో లక్షా 5 వేల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేసినా.. ఎకరా కూడా తడపలేదని విమర్శించారు. కృష్ణానది నీటిలో మన వాటా మనం తీసుకోకపోవడం వల్ల ఆంధ్రా తరలించుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 299 టీఎంసీలు చాలు అని ఆనాడు హరీశ్‌రావు సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. మన వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్‌లో తాము వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నామని చెప్పారు.
హరీశ్‌రావు చిల్లర మాటలు మానుకోవాలి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
”తప్పులు.. అప్పులు చేసి దోపిడీ చేశారనే ప్రజలు మిమ్మల్ని పక్కనబెట్టారు.. ప్రజా పాలన అందజేస్తున్న కాంగ్రెస్‌పై మీ విమర్శలు సరికావు” అని సాగునీటి వనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే ఇక్కడి ప్రజలు మమ్మల్ని క్షమించరని, ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్యతండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31 లోగా సమస్యలు పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వానిదని చెప్పారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేమని, ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకుని ప్రాజెక్టు పూర్తి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ, దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్మీ నిపుణులు, ఎంజీఆర్ ఎఫ్ అధికారులు పాల్గొన్నారు.

                                    

