Tuesday, November 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండిసెంబర్‌ 19నుంచి 29వరకు 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

డిసెంబర్‌ 19నుంచి 29వరకు 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌

- Advertisement -

లోగోను ఆవిష్కరించిన నిర్వాహకులు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఈ ఏడాది డిసెంబర్‌ 19 నుంచి 29వ తేదీ వరకు 38వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ ను హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ కళాభారతి ప్రాంగణంలో నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షులు డాక్టర్‌ యాకూబ్‌ షేక్‌, కార్యదర్శి వాసు, కోశాధికారి పి.నారాయణరెడ్డి, సలహా మండలి సభ్యులు ఎమ్మెల్సీ ఎం.కోదండరాం, కె.రామచంద్రమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉపాధ్యక్షులు కె.బాల్‌ రెడ్డి, బి.శోభన్‌ బాబు, జాయింట్‌ సెక్రెటరీ కె.సురేశ్‌, సభ్యులు ఎ.జనార్థన్‌ గుప్తా, యు.శ్రీనివాసరావు, టి.సాంబశివరావు, స్వరాజ్‌ కుమార్‌, డి.కిస్టారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాకుబ్‌ షేక్‌ మాట్లాడుతూ మూడేండ్లుగా ప్రతి ఏడాది డిసెంబర్‌లో పుస్తక మహౌత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు.

ఈ ఉత్సవంలో పిల్లల పుస్తకాలు మొదలు శాస్త్రీయ పుస్తకాల వరకు అన్ని రకాల జాతీయ, అంతర్జాతీయ బుక్‌ స్టాల్స్‌ ఉంటాయని తెలిపారు. 10 రోజుల్లో 360 మంది సాహిత్యకారులను పరిచయం చేస్తున్నామనీ, ప్రతి రోజు 4 గంటల పాటు పిల్లల కోసం కార్యక్రమాలుంటాయని తెలిపారు. స్థానిక సాంస్కృతిక ఈవెంట్స్‌ను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. పల్లె గ్రంధాలయాలకు గతేడాది 6 వేల నుంచి 7 వేల వరకు పుస్తకాలను అందజేసినట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా పుస్తక దాతల నుంచి బుక్‌ ఫెయిర్‌లో బుక్స్‌ సేకరించనున్నట్టు చెప్పారు. వాసు మాట్లాడుతూ ఈ ఏడాది ముఖ్యమైన పబ్లిషర్స్‌కు స్థానం కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. బుక్‌ ఫెయిర్‌లో 250 నుంచి 260 వరకు స్టాళ్లు ఉంటాయని చెప్పారు. ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ కలర్‌గా నీలిరంగును ఎంచుకున్నట్టు తెలిపారు. గత రెండేండ్లలో వివాదానికి దారి తీసిన పుస్తకాలు, ఇతర మతాలను కించపరిచేలా ఉన్న సాహిత్యం విషయంలో కమిటీ చర్చించినట్టు చెప్పారు.

అలాంటి ఘటనలు తలెత్తకుండా ఈ ఏడాది వాటిని బుక్‌ ఫెయిర్‌లో వాటిని తగ్గించి, నిషేధించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌ గతేడాది కంటే బాగుండబోతుందని తెలిపారు. గతేడాది బుక్‌ ఫెయిర్‌ ముగిసిన వెంటనే హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ సొసైటీ సమావేశమై సమీక్షించిందనీ, ఆ మేరకు లోటుపాట్లు మరింత సరిదిద్దుకుని రానుందని చెప్పారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుక్‌ ఫెయిర్‌ ఏర్పాటుతో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌లో ఢిల్లీ పబ్లిషర్స్‌ను ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. విజ్ఞానాన్ని అందిస్తున్న బుక్‌ ఫెయిర్‌ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

30 వరకు దరఖాస్తులకు ఆహ్వానం
హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో పాల్గొనేందుకు దరఖాస్తులను నవంబర్‌ 30 వరకు అన్ని పని దినాల్లో బాగ్‌ లింగంపల్లి ఎం.హెచ్‌.భవన్‌లోని హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ కార్యాలయంలో తీసుకుంటున్నట్టు తెలిపారు. స్టాళ్ల కేటాయింపు డ్రా తేదీని తర్వాత ప్రకటిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -