జిల్లా అధికారులు వచ్చే వరకూ విరమించబోమని నిరసన
సిద్దిపేట జిల్లా నంగునూరులో కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారులు
నవతెలంగాణ-నంగునూరు
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా మొలకెత్తిన ధాన్యంతో నంగునూరు-సిద్దిపేట ప్రధాన రోడ్డుపై క్రిమిసంహారక మందు డబ్బాలతో రైతులు రాస్తారోకో చేపట్టారు. సోమవారం రోడ్డుపై బైటాయించి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నాలో ప్రతిపక్ష పార్టీల నాయకులు పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ధాన్యం కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశామని, అయినా ఏ అధికారి, ప్రజాప్రతినిధులు.. రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించలేదని ఆరోపించారు.
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న రాజగోపాల్ పేట ఎస్‌ఐ టి.వివేక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జిల్లా స్థాయి అధికారులు తహసీల్దార్, వ్యవసాయ అధికారి వచ్చి ధాన్యం కొనుగోలు విషయంలో సమాధానం చెప్పేంత వరకూ నిరసన విరమించమంటూ రోడ్డుపై భైటాయించారు. సిద్దిపేట రూరల్ సీఐ శ్రీను వచ్చి సంబంధిత అధికారులకు ఫోన్‌లో సమాచారాన్ని అందజేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమతోనే ఉంటామని సీఐ రైతులకు సర్ధి చెప్పి తహసీల్దార్ కార్యాలయం వరకు వారిని తీసుకెళ్ళారు. కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని తహసీల్దార్ మాధవికి రైతులు ఫిర్యాదు చేశారు. కనీసం తాగు నీరు కూడా లేదని, వ్యవసాయ అధికారి గీతకు ఫోన్ చేసినా స్పందించడం లేదని రైతులు ఆరోపించారు.
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అధికారులు
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించాలని రైతులు కోరడంతో పోలీసుల ఆధ్వర్యంలో వెళ్ళి తడిసిన ధాన్యాన్ని, వర్షానికి కొట్టుకుపోయి మొలకెత్తిన ధాన్యాన్ని అధికారులు పరిశీలించారు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తహసీల్దార్ మాధవి హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మండల వ్యవసాయ అధికారి గీత తహసీల్దార్ కార్యాలయానికి రాగానే రైతులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. అనంతరం డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ వరలక్ష్మీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి నిర్వాహకులకు, రైతులకు పలు సూచనలు చేశారు. త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారి గీతను తొలగించాలని, కొనుగోలు కేంద్రం అవకతవకలపై డీసీఓ, తహసీల్దార్‌కు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు.

                                    

