సామాన్య ప్రజలకు విద్య, వైద్య సౌకర్యాలు : మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ప్రభుత్వ పాఠశాలకు శంకుస్థాపన
మంత్రుల సభలో కానరాని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
నవతెలంగాణ-రామచంద్రాపురం
సంగారెెడ్డి జిల్లా కొల్లూరు లోని డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని వసతులు కల్పిస్తామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల ప్రాంగణంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సుమారు లక్ష మంది నివసిస్తున్నారని, దాంతో ఈ ప్రాంతం మినీ హైదరాబాద్‌గా మారిందన్నారు. దాంతో ఇక్కడి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా హైదరాబాద్‌లోని వీఎస్టీ పరిశ్రమ సాయంతో సీఎస్‌ఆర్ ఫండ్స్ కింద రూ.4 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఫేస్ 1 నిర్మాణ పనులకు సోమవారం మంత్రులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని సామాన్య ప్రజలకు విద్యా, వైద్యం సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. కొల్లూరు డబుల్ బెడ్‌రూమ్ నివాసితులకు కావలసిన కనీస వసతులు కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అతి త్వరలో పనులు పూర్తిచేస్తాయని అన్నారు. 
ఈ ప్రాంగణంలో పోలీస్ అవుట్ పోస్ట్, స్ట్రీట్ లైట్లు, సీసీ కెమెరాలు, శ్మశాన వాటిక, ప్రార్థనా మందిరాలు, ఆర్టీసీ బస్టాండ్, ప్రహరీ గోడ నిర్మాణం, రెండు అంబులెన్సులు, ఆరోగ్య కేంద్రం, రేషన్ దుకాణాలను త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక్కడ నివసించే పిల్లల సౌకర్యార్థం సుమారు రూ.7 కోట్లతో నూతన పాఠశాలను రెండు ఫేస్‌ల కింద నిర్మించనున్నామని అన్నారు. 60 తరగతి గదులు, అంగన్వాడీ కేంద్రం, డైనింగ్ హాల్ సౌకర్యంతో ఆధునిక పాఠశాలను నిర్మించనున్నట్టు తెలిపారు. మొదటి దశలో సుమారు రూ.4 కోట్లతో 30 క్లాస్ రూమ్‌లు, ఆటస్థల నిర్మాణం పనులు ప్రారంభిస్తున్నామన్నారు. అనంతరం వీఎస్టీ పరిశ్రమ ప్రతినిధులను మంత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, రాష్ట్ర హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది.

                                    

