షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలి 
తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ- సూర్యాపేట కలెక్టరేట్
ఇటీవల మొంథా తుఫాన్ మూలంగా నష్టపోయిన రైతుల పంటను అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని, షరతుల్లేకుండా తడిసిన ధాన్యాన్ని, పత్తిని కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ మూలంగా జిల్లాలో వరి పంట పూర్తిగా దెబ్బతిందన్నారు. ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంట చేతికందేలోపే మొంథా తుఫాన్ నిండా ముంచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ఇప్పటివరకు పంట నష్టపరిహారాన్ని ప్రకటించకపోవడం దుర్మార్గమని అన్నారు. ఎన్నికలు, కాంట్రాక్టులపై ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ రైతాంగంపై లేదని విమర్శించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల మూలంగా రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడన్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యాన్ని రోజుల తరబడి నిల్వచేసినా కొనుగోలు చేయడంలో జాప్యం చేస్తున్నారన్నారు. 
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దయి మొలకెత్తుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన, మొలకెత్తిన ధాన్యం, పత్తిని ఎలాంటి షరతుల్లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, వరి ఎకరాకు రూ.40 వేలు, పత్తికి రూ.70 వేల నష్టపరిహారం చెల్లించాలని కోరారు. అనంతరం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కందాల శంకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావు, పారేపల్లి శేఖర్‌రావు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శులు దండా వెంకటరెడ్డి, షేక్ సైదా, దుగ్గి బ్రహ్మం, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కోట గోపి, రైతు సంఘం జిల్లా నాయకులు దేవరం వెంకటరెడ్డి, నాగిరెడ్డి శేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నారాయణ వీరారెడ్డి, అవిరే అప్పయ్య, మేరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

                                    

