పది మాసాల్లో 71 కేసుల్లో 82 మందికి జైలు శిక్ష
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
నేరనియంత్రణ, న్యాయస్థానాలలో న్యాయ నిరూపణలో జిల్లా పోలీసులు విశేష ఫలితాలను సాధిస్తున్నారని నేరం చేసిన వారు శిక్ష నుండి తప్పించుకోలేరని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. సిరిసిల్లలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఈ సంవత్సరం (జనవరి నుండి అక్టోబర్) కాలంలో జిల్లా పోలీసు శాఖ సమగ్రంగా వ్యవహరించి న్యాయస్థానాల్లో 71 కేసుల్లో తీర్పులు వెలువడగా 82 మంది నేరస్తులకు జైలు శిక్షలు, జరిమానాలు విధించబడ్డాయని ఎస్పీ వివరించారు.హత్య కు సంబంధించి 3 కేసులో 5మంది నిoదితులకు జీవిత ఖైదు,4 కేసులలో 5 మందికి ఐదేళ్ల జైలు శిక్ష, ఒక కేసులో ఒక వ్యక్తికి నాలుగేళ్ల జైలు శిక్ష, 11 కేసులలో 14 మందికి మూడేళ్ల జైలు శిక్ష, రెండు కేసుల్లో ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష, 26 కేసుల్లో 28 మందికి ఏడాది జైలు శిక్ష, 24 కేసుల్లో 26 మందికి ఏడాదిలోపు జైలు శిక్ష లు పడేలా పోలీసులు వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.
ప్రాసిక్యూషన్ విభాగం సమన్వయంతో వ్యూహాత్మకంగా విచారణ జరిపి న్యాయ నిరూపణతో శిక్షలు పడేలా చేస్తున్నామని, క్షణికావేశంలో చేసిన నేరాలకైనా న్యాయశిక్ష తప్పదని, అందరూ చట్టానికి లోబడేలా ప్రవర్తించాలని అన్నారు.జిల్లాలో మద్యం, గంజాయి,దొంగతనాలు, మోసపూరిత ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి సారించి,కేసులు త్వరితగతిన దర్యాప్తు చేసి, కోర్టులో పటిష్టమైన సాక్ష్యాలతో ప్రాసిక్యూషన్ విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా ప్రాసిక్యూషన్ అధికారులు,సీఐలు,ఎస్ఐలు, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్లు క్రమం తప్పకుండా కేసుల పురోగతిని సమీక్షిస్తూ,తీర్పులు శిక్షల రూపంలో రావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు పోలీసుల పట్ల నమ్మకం ఉంచి సహకరించాలని ఆయన కోరారు.



