Wednesday, November 5, 2025
E-PAPER
Homeమానవిసీతాఫ‌లం ఎంతో బ‌లం

సీతాఫ‌లం ఎంతో బ‌లం

- Advertisement -

సీతాఫలాల సీజన్‌ మొదలయింది. బయట ఎక్కడ చూసినా నిగనిగలాడుతూ రారమ్మంటూ నోరూరిస్తున్నాయి. తియ్యగా ఉండే వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. రుచిగానే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పండ్లతో రకరకాల స్వీట్లు చేసుకోవచ్చు. మరి అలాంటి సీతాఫలం రుచుల గురించి ఈరోజు తెలుసుకుందాం…

కుల్ఫీ
కావల్సిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు – కప్పు(గింజలు తీసెయ్యాలి), పాలు – మూడు కప్పులు, పంచదారా లేదా కస్టర్డ్‌ మిల్క్‌ – సరిపడా, యాలకుల పొడి – చిటికెడు.
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు సగం అయ్యేంత వరకు చిన్నమంటపై కాగనివ్వాలి. ఆ తర్వాత, పంచదార లేదా కస్టర్డ్‌ మిల్క్‌, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం చల్లగా అయిన తర్వాత, అందులో సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. దీన్ని కుల్ఫీ మౌల్డ్స్‌లో పోసి, ఫ్రీజర్‌లో రాత్రంతా ఉంచాలి. కుల్ఫీ గట్టిపడిన తర్వాత మౌల్డ్స్‌ నుంచి తీసి తింటే రుచి అదిరిపోతుంది.

బాసుంది
కావల్సిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు – కప్పు(గింజలు తొలగించి మిక్సీ పట్టుకోవాలి), పాలు – ఒకటిన్నర లీటరు, పంచదార – ఐదు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – ఒక టీస్పూను, బాదం, పిస్తా తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, కుంకుమ పువ్వు – కొద్దిగా.
తయారు చేసే విధానం: మందపాటి గిన్నెలో పాలు పోసి సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. పాలు అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. మరో ఐదు నిమిషాలు ఉడికించి, స్టవ్‌ ఆఫ్‌ చేసి పాల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత సీతాఫలం గుజ్జు, బాదం, పిస్తా తరుగు వేసి కలపాలి. ఈ బాసుందిని ఫ్రిజ్‌లో సుమారు రెండు మూడు గంటలు ఉంచి సర్వ్‌ చేసుకోవచ్చు.

కలాకండ్‌
కావల్సిన పదార్థాలు: పాలు – రెండు లీటర్లు, సీతాఫలం గుజ్జు – కప్పు(గింజలు లేకుండా చూసుకోవాలి), పంచదార పొడి – అర కప్పు, నిమ్మరసం – రెండు టీ స్పూన్లు, యాలకుల పొడి – టీ స్పూను, నెయ్యి – టీస్పూను, బాదం, పిస్తా తరుగు – గార్నిష్‌కు సరిపడేలా.
తయారు చేసే విధానం: మొదట ఒక లీటరు పాలను తీసుకొని సగం అయ్యేంత వరకు బాగా మరిగించాలి. మరో లీటరు పాలను వేరే గిన్నెలో మరిగిస్తూ అందులో నిమ్మరసం వేసి ఆ పాలను విరగ్గొట్టాలి. వాటిని పలుచని గుడ్డలో వేసి నీరు లేకుండా పిండాలి. అప్పుడది పనీర్‌ అవుతుంది. మరోపాత్రలో మరుగుతున్న పాలలో ఈ పనీర్‌, పంచదార పొడి, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించి చివరగా సీతాఫలం గుజ్జును వేసి బాగా కలపాలి. ఒక ప్లేటుకు నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని దానిపై సమానంగా పరచాలి. పైన బాదం, పిస్తా తరుగుతో గార్నిష్‌ చేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవచ్చు.

బిస్కెట్స్‌
కావల్సిన పదార్థాలు: సీతాఫలం గుజ్జు – కప్పు, రవ్వ – కప్పు, రాగిపిండి – కప్పు, నెయ్యి – చెంచా, పంచదారా – మూడు నాలుగు చెంచాలు, జీడిపప్పు – ఐదారు, నువ్వులు – చెంచా, కాచి చల్లార్చిన పాలు – తగినన్ని, గోధుమపిండి – కొద్దిగా, నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా.
తయారు చేసే విధానం: వెడల్పాడి గిన్నెలో రాగిపిండి, బొంబాయి రవ్వ, సీతాఫలం గుజ్జు, నెయ్యి, పంచదార, జీడిపప్పు పలుకులు, నువ్వులు వేసుకొని చపాతీ పిండిలా కలపాలి. పిండి సరిగా రాకపోతే కాచి చల్లార్చిన పాలు పోసుకొని చపాతీ ముద్దలా చేసుకోవచ్చు. పిండి పలచగా అయితే కాస్త రాగిపిండి వేసుకోవచ్చు. చపాతీ పీటపై గోధుమ పిండి చల్లుకుంటూ చిన్న చిన్న అప్పాల్లా చేసుకోవాలి. వాటిపై మనకు ఇష్టమైన మౌల్డ్‌తో ముక్కలుగా చేసుకోవాలి. స్టౌవ్‌ మీద కడాయి పెట్టి నూనె పోసి వేడి చేయాలి. వేడయ్యాక మంట మీడియం సైజులో పెట్టుకొని అందులో బిస్కెట్స్‌ వేసి వేయించుకోవాలి. మంచిగా వేగిన తర్వాత టిష్యూపేపర్‌ ఉన్న ప్లేట్‌లోకి తీసుకుంటే చాలు. కరకరలాడే సీతాఫలం బిస్కెట్స్‌ మీ ముందు ఉంటాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -