– బీహార్‌లో పోలింగ్‌కు రంగం సిద్ధం
– రేపు 18 జిల్లాల పరిధిలోని 121నియోజకవర్గాల్లో ఓటింగ్
– కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు… కేసు నమోదు
పాట్నా: బీహార్‌లో తొలి విడత ప్రచారం ముగిసింది. ఎన్డీయే, మహాగట్‌బంధన్ కూట ముల హౌరాహౌరీ ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో తెరపడింది. ఈనెల 6న 18 జిల్లాల పరిధిలోని 121 నియోజక వర్గాల్లో పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. అయితే ఇరుకూటముల తరఫున అగ్రనేతలు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. అధికారం నిలబెట్టుకో వాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, మళ్లీ గద్దెనెక్కాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్ బంధన్ మధ్య గట్టిపోటీ నెలకొన్న విషయం విధితమే. ఎన్డీయే తరఫున ప్రధాని మోడీ, కేంద్ర హౌంశాఖ మంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, సీఎం నీతీశ్‌కుమార్, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్, మహాగట్‌బంధన్ తర ఫున రాహుల్‌గాంధీ, తేజస్వీయాదవ్, అఖిలేశ్‌యా దవ్, సీపీఐ(ఎం) తరఫున బృందాకరత్, మహ్మద్ సలీం తదితరులు ప్రచారం నిర్వహించారు.
18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో పోలింగ్
బీహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈనెల 6న 18జిల్లాల పరిధి లోని 121 నియోజక వర్గాల్లో తొలి విడత పోలింగ్ జరగనుంది. ఈ విడతలో ఆర్జేడీ అగ్రనేత, మహాగట్ బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్, బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌధరీ, జానపద గాయకురాలు మైథిలీ ఠాకూర్ సహా 1,314మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మిగితా 122 సీట్లకు ఈనెల 11న రెండో విడతలో పోలింగ్ జరగనుంది.
మహువా స్థానం నుంచి బరిలో మాజీమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్
రాఘోపూర్ నియోజకవర్గం స్థానం నుంచి తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఎన్డీఏ తరపున బీజేపీకి చెందిన సతీశ్‌కుమార్, జన్‌సురాజ్ పార్టీ నుంచి చంచల్‌కుమార్ ఆయనతో తలపడుతున్నారు. వైశాలి జిల్లాలోని మహువా స్థానం నుంచి లాలు పెద్దకుమారుడు, మాజీమంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలో ఉన్నారు. ఆర్జేడీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ముఖేశ్ కుమార్, ఎల్జేపీ నుంచి సంజరు సింగ్ పోటీచేస్తున్నారు. ముంగర్‌జిల్లా తారాపుర్ నుంచి బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ పోటీ పడుతున్నారు. మహాగట్‌బంధన్ తరఫున ఆర్జేడీకి చెందిన అరుణ్‌షా ఆయనతో తలపడుతున్నారు. దర్భంగా జిల్లా అలీనగర్ నుంచి జానపద గాయకురాలు, బీజేపీకి చెందిన మైథిలీ ఠాకూర్ ఎన్డీయే అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి బినోద్ మిశ్రా, జన సురాజ్ పార్టీ తరఫున విప్లవ్‌కుమార్ చౌదరీ పోటీ చేస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో ఇప్పటివరకు బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే, ఆర్జేడీ నేతృత్వంలోని మహాగట్‌్‌బంధన్ ప్రాబల్యం కొనసాగింది. ఈసారి ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల రణంలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉండనుంది? ఏ కూటమిని దెబ్బతీయనుందనేది ఈనెల 14న తేలనుంది. కాగా బీహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశ 6న, రెండో దశ 11న జరగనుండగా, నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.
కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ పై కేసు..
బీహార్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (లలన్ సింగ్) వివాదాస్పద వ్యాఖ్యలు నేపథ్యంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇటీవల మొకామా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్న లలన్ సింగ్ మాట్లాడుతూ.. పోలింగ్ రోజున పేదలు బయటకు రాకుండా వారి ఇండ్లకుకు తాళాలు వేయాలని, వారు ఎట్టిపరిస్థితుల్లో ఓటేయకుండా అడ్డుకోవాలని అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో ప్రతిపక్షాలు మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దీనిపై ఆర్జేడీ నేతలు ‘ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేలా కేంద్రమంత్రి ప్రవర్తించారు’ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. లలన్ సింగ్ బహిరంగంగా ఓటర్లను బెదిరిస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశారు. బెదిరింపుల ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించినందుకు కేంద్ర మంత్రిపై సత్వర, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీడియో ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు బీహార్ ఎలక్ట్రోల్ అధికారి పేర్కొన్నారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా లలన్ సింగ్‌కు నోటీసులు సైతం జారీ చేసినట్టు తెలిపారు.



