ఫీజులు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తానంటే నమ్ముదామా..?
బీఆర్‌ఎస్ హయాంలోనే అభివృద్ధి
మా గెలుపు పక్కా.. ఇక మెజార్టీనే తేలాలి : పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని కాంగ్రెస్ జూబ్లీహిల్స్‌లో తిరుగుతోందని, మీకు ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే రాష్ట్రాన్ని ఆగమాగం చేశారని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ రోజుల్లో కరెంట్.. నీళ్లకు కూడా కటకట ఉండేదని, బీఆర్‌ఎస్ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం సాయంత్రం అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి సోమాజిగూడ డివిజన్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మాగంటి సునీతా గెలుపు పక్కా అయిందని, ఇక మెజార్టీ తేలాల్సి ఉందని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 2023న ఎలాంటి ఫలితాలను చూపించామో అదే రిపిట్ అవుతుందన్నారు. హైదరాబాద్ మహానగరం అమ్మలాంటిదని, అందరికీ అన్నం పెట్టే అమ్మ హైదరాబాద్ అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు హైదరాబాద్‌లో ప్రతి రోజూ పవర్‌కట్ అయ్యేదని, పరిశ్రమలు నడిచే పరిస్థితి లేకుండేనని అన్నారు. అపార్టుమెంటుల్లో జనరేటర్లు, చిన్నచిన్న దుకాణాలు, ఆఖరికి జిరాక్స్ సెంటర్లకు వెళ్లినా ఇన్‌వైర్టర్లు పెట్టుకోవాల్సిన దుస్థితి ఉండేదని తెలిపారు. పీజేఆర్ నాయకత్వంలో వాటర్‌బోర్డు వద్ద ధర్నాలు ఉండేవని, ఖాళీ బిందెలతో లొల్లిలొల్లి ఉండేదని ఎద్దేవా చేశారు. ఆ తర్వాత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాక ఏడాదిలోనే కరెంట్ సమస్య తీర్చుకుని 24గంటలపాటు సరఫరా చేసుకున్నామని చెప్పారు. ఐటీ రంగం పెరగడంతో రియల్‌ఎస్టేట్ రంగం పెరిగిందని, దాంతో వ్యాపారం, వాణిజ్యం పెరిగిందని వివరించారు. పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమం విషయంలో రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ అడ్డగోలు హామీలతో అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందని ఆరోపిం చారు. రాహుల్‌గాంధీ మాటలు విని యువకులు మోస పోయారన్నారు. వైఎస్ తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యాసంస్థలను బెదిరిస్తు న్నారని ఆరోపించారు. ఫీజులు కట్టనోడు జూబ్లీహిల్స్ అభివృద్ధి చేస్తానంటే నమ్ముదామా? అని ఓటర్లను అడిగారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టడ మేనా?.. పేదల ఇండ్లను కూలగొడుతున్న హైడ్రా పెద్దల జోలికి ఎందుకెళ్లడం లేదు? అని ప్రశ్నించారు. బుల్డోజర్‌కు అడ్డుపడేది బీఆర్‌ఎస్సేనని, ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఒక్క ఛాన్స్ ఇస్తేనే రాష్ట్రం ఆగమైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



