– పేరుకే బీజాపూర్ జాతీయ రహదారి
– 46 కిలో మీటర్లు.. 40 మలుపులు, 21 డేంజర్ జోన్లు
– అప్రమత్తమయ్యే లోపే ప్రమాద ఘంటికలు
– ఇరువైపులా ఐదు ఫీట్ల మేర రోడ్డుకు కోతలు
– మిగిలిన పది ఫీట్లలోనే వాహనాల ప్రయాణం
– వాహనాలు అదుపుతప్పి తరచూ ప్రమాదాలు
– దానికి పాలకుల తప్పిదాలూ కారణమే..
– స్థానికులు, క్షతగ్రాతుల అభిప్రాయాలు సేకరించిన ‘నవతెలంగాణ’
ఇదో మృత్యుదారి కథ. పేరుకే అది జాతీయ రహదారి. అడుగడుగూ అధ్వానమే. 46 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్డే. కనీసం రోడైనా సాఫీగా ఉందా అంటే అదీ లేదు. 40 మూల మలుపులు, వందలాది గుంతలు. దీనికితోడు 25ఫీట్ల రోడ్డులో ఇరువైపులా ఐదు ఫీట్ల మేర రోడ్డుకు కోతలు. ఇక ఈ రోడ్డెక్కితే గమ్యం చేరే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగించాల్సిందే. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు కోల్పోవాల్సిందే. ఈ క్రమంలోనే ఈ రోడ్డు వెంట నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. సోమవారం జరిగిన బస్సు ప్రమాదానికి కూడా ఈ ‘రోడ్డే’ ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదాలకు కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారిపై ‘నవ తెలంగాణ’ ప్రత్యేక కథనం.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కర్నాటక ప్రాంతానికి అనుసంధానం చేస్తున్న జాతీయ రహదారి హైదరాబాద్ టూ బీజాపూర్ రహదారి. ఇది జిల్లా అప్ప జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు సుమారు 46 కిలో మీటర్లు ఉంటుంది. రోడ్డు విస్తీర్ణం 25 ఫీట్లు కాగా.. రోడ్డుకు ఇరువైపులా ఐదు ఫీట్ల మేర కోతలు ఉన్నాయి. ఇక మిగిలిన 15 ఫీట్ల రోడ్డులో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నడి రోడ్డులో కూడా రెండు, మూడు ఫీట్ల లోతులోకి గుంతలు ఉండటంతో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన బస్సు, టిప్పర్ ప్రమాదానికి ఈ ‘రోడ్డే’ ప్రధాన కారణమని స్థానికులు చెబుతున్నారు. కాగా, టిప్పర్, బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు.. 35 మంది గాయపడ్డారు. 21 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి హెచ్చరికలూ లేవు. 25 ఫీట్లు ఉన్న రోడ్డు కాస్తా పది, పన్నెండ్లు ఫీట్లకు కుచించుకుపోయింది. దీంతో వాహనాలు లెఫ్ట్ సైడ్ వెళ్తే ప్రమాదమని గ్రహించిన డ్రైవర్లు రైట్ సైడ్ మాత్రమే వాహనాలను నడుపుతున్నారు.
సింగిల్ రోడ్డులో హెవీ వెహికిల్స్
జాతీయ రహదారి అంటే నాలుగు లైన్లు లేదా ఆరు లైన్ల విస్తీర్ణంతో ఉంటుంది. ఈ రోడ్డు మాత్రం సింగిల్ రోడ్డుకే పరిమితం. అయినప్పటికీ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. నిమిషంపాటు రోడ్డుపై వాహనాలు ఆగితే కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతుంది. ఎదురుగా వచ్చే వాహనం హెవీ వెహికల్ అయితే ఒక వాహనం రోడ్డు దిగాల్సిన పరిస్థితి. ఇలాంటి రద్దీ రోడ్డును విస్తరించడంలో ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం చేశాయి. వారి జాప్యమే ఇప్పుడు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటోంది.
21 డేంజర్ జోన్లు..
అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు సుమారు 21 డేంజర్ జోన్లు ఉన్నాయి. కండ్లపల్లి, చిట్టెంపల్లి, అలూరు, ఖానాపూర్, మిర్జాగూడ, దామరగిద్ద, ఇబ్రహీంపల్లి, కేసారం, మల్కాపూర్, కందవాడ, ముడిమ్యాల, తోల్కట్ట, కేతిరెడ్డిపల్లి, షాపూర్, కనకమామిడి, అమ్దాపూర్, హిమాయత్‌నగర్, అజీజ్‌నగర్, గండిపేట చౌరస్తా, మృగవాని, మన్నెగూడ చౌరస్తా ప్రాంతాలు డేంజర్ జోన్లుగా ఉన్నాయి. ఏడాది క్రితం అలూరులో కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఇలా ఐదేండ్ల కాలంగా సుమారు 700 ప్రమాదాలు జరిగాయి. ఇందులో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు.
నా సీట్లో కూర్చున్న ఇద్దరూ చనిపోయారు
హైదరాబాద్‌లో పెండ్లికి వెళ్తున్న. తాండూరులో బస్సెక్కా.. నాతో పాటు మరో ఇద్దరు ఎక్కారు. ముగ్గురం ఒకే సీట్లో ఎమర్జెన్సీ డోర్ దగ్గర కూర్చున్నాం. అక్కడి వరకు టిప్పర్ దూసుకువచ్చింది. నేను ఎట్లా బతికానో తెలియదు. నాతో కూర్చున్న ఇద్దరూ చనిపోయారు. నా ప్రాణం పోతే నా బిడ్డలు అనాథలయ్యేవారు. భూములు, జాగాలు లేవు. కూలీనాలీ చేసి బతికేటోళ్లం. ఈ రోడ్డు ఎంతో మంది ప్రాణాలు తీసింది. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఊరుకుంటే ఎట్లా? రోడ్డు బాగుంటే మాకు ఈ గతి పట్టేది కాదు. సీఎం రేవంత్‌రెడ్డి సార్ కనికరించాలి.
– బస్వరాజు, తాండూరు, బస్సు ప్రమాద బాధితుడు.
ఇలాంటి ప్రమాదం మొదటి సారి చూశా..
20 ఏండ్లుగా కండెక్టర్‌గా ఉద్యోగం చేస్తున్నా. నా సర్వీసులో ఇలాంటి ప్రమాదం మొదటిసారి చూస్తున్నా. రెప్పపాటులో జరిగిపోయింది. టిప్పర్ బస్సును ఢకొీట్టగానే.. నా సీటు ముందు ఉన్న రాడ్‌కు తల గుద్దుకుంది. ఫుట్‌బోర్డులో నిల్చున్న కానిస్టేబుల్ నన్ను కాపాడాడు. డ్రైవర్ నెల రోజులుగా ఈ బస్సుకు వస్తున్నాడు. – రాధ, ప్రమాద బస్సు కండెక్టర్
ఫొటోలు తీసేకంటే.. ప్రాణాలు కాపాడితే బాగుండేది
ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చిన వారిలో ఎక్కువ మంది ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఫొటోలు తీసేకంటే ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేస్తే చాలా మంది బతికేవారు. వంద మందిలో పది మంది మాత్రమే బస్సులో ఇరుక్కున్న మమ్మల్ని తీసేందుకు ప్రయత్నించారు. నా ముందు కూర్చున్న ఒకామె దాహం దాహం అని అరిచి చచ్చిపోయింది. అక్కడ ఉన్న వారు ఎవరూ పట్టించుకోలేదు.– అనసూయ, పూడురు, బస్సు ప్రమాద బాధితురాలు
నిలబడి బతికిపోయా..
వీక్ ఆఫ్ అని ఇంటికి వచ్చి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తున్న. సోమవారం ఉదయం 4:30కి తాండూరులో బస్సు ఎక్కిన. మన్నెగూడ ప్రాంతానికి వచ్చిన తర్వాత మహిళ కోసం సీటు ఇచ్చి నేను నిలబడిన.. నేను ఆమెకు చేసిన సాయం నా ప్రాణాలను కాపాడింది. ప్రమాదంలో టిప్పర్‌లో ఉన్న కంకర మమ్మల్ని కమ్మేసింది. నేను 90 శాతం మునిగిపోయా. బస్సు పైకొండిని ఎడమచేతితో పట్టుకోవడంతో చేయి.. ముఖం తప్పా దేహం మొత్తం కంకరలో మునిగిపోయింది. ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా లేదు. నేను బతుకుతానన్న నమ్మకం కూడా లేకుండే. నా కండ్ల ముందు నాకు అంగుళం దూరంలో ఉన్న పెద్దాయన కంకరలో మునిగిపోయి చనిపోయాడు. ప్రమాదం జరిగిన అర్థ గంట వరకు మమ్మల్ని బయటికి తీసేవారు లేరు. తొందరగా రెస్క్యూ టీం వస్తే చాలా మంది బతికేవారు. రోడ్డు కారణంగానే మాకీ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఆలోచించాలి.– శ్రీనివాస్, బస్సు ప్రమాద బాధితుడు



