– దారి మళ్లిస్తే చర్యలు తప్పవు : సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పీఎంశ్రీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను ఆమోదించిన పనులకే వినియోగించాలని సమగ్రశిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. సోమ, మంగళవారం రెండు రోజుల పాటు హైదరాబాద్‌లోని ఆదివాసీ భవన్‌లో పీఎంశ్రీ, ఎస్‌ఎన్‌ఏ స్పర్శ్‌పై ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం మల్టీజోన్ 1లోని పీఎంశ్రీ 577 పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, రెండో రోజు మంగళవారం మల్టీజోన్-2లోని 462 పాఠశాలలు, గురుకులాల హెచ్‌ఎంలు, ప్రిన్సిపాల్స్, డిస్ట్రిక్ట్ క్వాలిటీ కోఆర్డినేటర్స్, డైట్ ప్లానింగ్ కోఆర్డినేటర్స్, ఎఫ్‌ఏఓ సిస్టం అనలిస్టులకు అవగాహన కల్పించారు. ప్రతి పనికి సంబంధించిన ఖర్చులను ఏ విధంగా ఉపయోగించాలనే విషయాలను సమగ్రంగా వారికి వివరించారు. 2025-26 సంవత్సరానికి ఆమోదించబడిన బడ్జెట్, ఆన్‌లైన్ బిల్లు సమర్పణపై శిక్షణ, స్పర్ష్, నాణ్యమైన విద్య, స్కూల్ గ్రాంట్, రవాణా సౌకర్యం, వృత్తి విద్య, సీడబ్ల్యూసీఎన్, అవుట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, జెండర్ అండ్ ఈక్విటీ, కమ్యూనిటీ మొబిలైజేషన్, సివిల్ వర్క్స్ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నవీన్ నికోలస్ మాట్లాడుతూ ఖర్చు చేసిన ప్రతి బిల్లును డీఈవోలకు సమర్పించాలని స్పష్టం చేశారు. ఈ పథకం అమలకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. అన్ని బిల్లులను స్పర్శ్, ఐఎఫ్‌ఎంఐఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్) పోర్టల్ ద్వారా ట్రెజరీకి సమర్పించాలని ఆదేశించారు. విక్రయదారులు, వెండర్లకు మాత్రమే బిల్లులు చెల్లించాలనీ, ఇతర వ్యక్తులకు నేరుగా బిల్లులు చెల్లించొద్దని తెలిపారు. జెమ్ తదితర నిబంధనల ప్రకారమే కొనుగోళ్లు ఉండాలనీ, అనుమతి లేని ఖర్చులకు వాడినా, నిధులను దారి మళ్లించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పీఎంశ్రీ పాఠశాలలను గుర్తించి, ప్రోత్సాహకరంగా వారిని సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు రాధా రెడ్డి , జాయింట్ డైరెక్టర్స్ పి.రాజీవ్, జాయింట్ డైరెక్టర్ వెంకట నరసమ్మ, ఫైనాన్స్ కంట్రోలర్ వెంకన్న, ఫైనాన్స్ అధికారులు, సంబంధిత కోఆర్డినేటర్లు, సమగ్ర శిక్ష సిబ్బంది పాల్గొన్నారు.
ఆమోదించిన పనులకే నిధులు వినియోగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



