జనవరి 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ
నవంబర్ 15 నుంచి జనవరి 25 వరకు సంఘీభావ సమావేశాలు
ఆల్‌ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యుత్ సవరణ బిల్లు 2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జనవరి 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు ఆల్‌ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్(ఏఐపీఈఎఫ్) వెల్లడించింది. మంగళవారం ముంబైలో జరిగిన నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఏఐపీఈఎఫ్ అధ్యక్షులు శైలేంద్ర దూబే తెలిపారు. విద్యుత్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించేం దుకు రైతులు, వినియోగదారుల సంఘాలతో ఐక్య ఫ్రంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ర్యాలీకి సంఘీభావంగా నవంబర్ 15 నుంచి జనవరి 25 వరకు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ ఉద్యోగులు, రైతులు, వినియోగదారుల సమా వేశాలు నిర్వహించనున్నట్టు వివరించారు. సవరణ బిల్లు 2025 ద్వారా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని పూర్తిగా ప్రయివేటీకరించాలనే కుట్రకు పాల్పడుతోందని విమర్శించారు. బిల్లు పట్టాలెక్కితే విద్యుత్ ధరలు పెరిగి సామాన్య ప్రజలు, రైతులకు కష్టాలు తప్పవని హెచ్చరించారు. ”ప్రయివేట్ కంపెనీలకు యూనివర్సల్ విద్యుత్ సరఫరా బాధ్యత ఉండదు. తమ లాభదాయకమైన పారిశ్రామిక, వాణిజ్య వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వ సంస్థల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తాయి. రైతులు, గృహ వినియోగ దారులకు విద్యుత్ సరఫరా చేసే బాధ్యత మాత్రం ప్రభుత్వ విద్యుత్ పంపిణీ సంస్థలదే అవుతుంది. ఫలితంగా అవి దివాళా తీయాల్సి వస్తుంది. విద్యుత్ కొనుగోలు చేయడానికి లేదా ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ఇక్కట్లు తప్పవు. సవరణ బిల్లు సెక్షన్ 61లో మార్పులు చేయడం ద్వారా వచ్చే ఐదేండ్లలో క్రాస్-సబ్సిడీని తొలగించాలని ప్రతిపాదిస్తోంది.
6.5 హార్స్‌పవర్ మోటార్‌ను రోజుకు ఆరు గంటలు నడిపితే రైతులు నెలకు కనీసం రూ.12 వేల విద్యుత్ బిల్లు చెల్లించాల్సి వస్తుంది. పేదరిక రేఖకు దిగువన ఉన్న వినియోగదారులకు విద్యుత్ ధర యూనిట్‌కు కనీసం రూ.10 నుంచి 12 వరకు పెరుగుతుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని సగటు విద్యుత్ వినియోగదారులు, రైతులకు గుదిబండగా మారనున్న సవరణ బిల్లును ఉపసంహరించుకునే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. ఈ సమావేశంలో అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య ప్రధాన కార్యదర్శి పి. రత్నాకర్ రావు, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ అఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీర్స్ ముఖ్య నాయకులు మోహన్ శర్మ, సుదీప్ దత్తా, కె. అశోక్ రావు, కృష్ణ భోయూర్, లక్ష్మణ్ రాథోడ్, సంతోష్ ఖుమ్కర్, సంజరు ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ ఎంప్లాయిస్ అండ్ ఇంజినీర్స్ నాయకులు నలువాల స్వామి తెలిపారు.
విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



