క్లెయిమ్ చేయని సొమ్ము రూ.1.5 లక్షల కోట్లుొ బ్యాంకుల వద్ద మూలుగుతున్న నిల్వలు
ఆర్‌బీఐ డెఫ్ ఖాతాకు బదిలీలు
న్యూఢిల్లీ : మీరు ఏదేనీ బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసి ఆ విషయం మరిచిపోయారా? భయపడకండి. అది సురక్షితంగానే ఉంది. ఎవరూ క్లెయిమ్ చేయని లేదా సొంతదారు ఎవరో తెలియని లక్షన్నర కోట్ల రూపాయల సొమ్ము వివిధ బ్యాంక్ ఖాతాల్లో అలాగే మూలుగుతోంది. ఈ ఖాతాల్లో ప్రభుత్వంతో సంబంధమున్న వందలాది ఖాతాలు కూడా ఉన్నాయి. వాటిలో కోట్లాది రూపాయల నిల్వ ఉంది. ఇలాంటి డిపాజిట్లు ఎవరివో తెలుసుకొని, వారికి సాయపడేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఓ సారి ప్రయత్నించింది. ‘మీ డబ్బు ఎక్కడ ఉన్నదో కనిపెట్టేందుకు మేము సాయపడతాం’ అంటూ ప్రజలకు సందేశం ఇచ్చింది. 2023లో వంద రోజుల పాటు ప్రచారం నిర్వహించినా ఒరిగిందేమీ లేదు. దీంతో గత నెల 25వ తేదీన మరోసారి ప్రచారం ప్రారంభించింది. అసలైన డిపాజిటర్ల ఆచూకీ కనిపెడితే బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందజేస్తానని కూడా ప్రకటించింది.
ఖాతాలనే మరచిపోయిన అధికార యంత్రాంగం
ప్రభుత్వ ప్రచారం మొదలు కాగానే ఓ బ్యాంకర్ తన తన వాట్సప్ గ్రూపులో సందేశాన్ని ఇస్తూ అందులో ఒకే ప్రాంతానికి చెందిన యాభై డెఫ్ (డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎవేర్‌నెస్ ఫండ్) ఖాతాల జాబితాను జత చేశారు. వీటిలో ప్రభుత్వ నిధికి చెందిన ఓ ఖాతా కూడా ఉంది. అందులో కోట్లాది రూపాయల నిల్వ ఉంది. కొన్ని నగరాలలోని ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో ఇలాంటి 143 ఖాతాలు వెలుగు చూశాయి. ప్రజా సంక్షేమం, ఉపాధి కల్పన, సమాజ అభివృద్ధి కోసం ఉద్దేశించిన కోట్లాది రూపాయల సొమ్ము కూడా బ్యాంక్ ఖాతాల్లో అలాగే ఉండిపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. వందలాది ప్రభుత్వ సంబంధిత ఖాతాల్లో కోట్లాది రూపాయల నిల్వ ఉన్న విషయాన్ని అధికారులు మరచిపోయారు. జీరో అకౌంట్ ప్రారంభించిన వారు తమ పేర్లను తప్పుగా రాయడంతో ఆయా ఖాతాల్లో చేరిన ప్రభుత్వ సొమ్ము వారికి అందడం లేదు. అసలు ఆ ఖాతాలు నిజమైనవేనా, లబ్దిదారుల పేర్లు సరిగా ఉన్నాయా, వాటిలో జమ అయిన సొమ్మును లబ్దిదారులు తీసుకున్నారా, అలా జరగని పక్షంలో వారు అధికారులను సంప్రదించి పొరబాటును సరిదిద్దుకునే ప్రయత్నం చేసారా…ఈ ప్రశ్నలకు ఎవరి వద్దా సమాధానం లేదు.
డెఫ్ ఖాతాకు చేరుతున్న నిల్వలు
మనుగడలో లేని ఖాతాల్లో ఉన్న సొమ్మును గురించి బ్యాంకులు ఏ మాత్రం పట్టించుకోవు. దీంతో అవి అలాగే ఉండిపోతున్నాయి. సైనికులకు సంబంధించిన సొమ్ము కూడా అలాంటి ఖాతాలలోనే పేరుకుపోతోంది. ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌ఓ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, రాష్ట్రీయ గ్రామీణ్ గ్యారంటీ రోజ్‌గార్ యోజన, జవహర్ రోజ్‌గార్ యోజన, ఎల్‌ఐసీ మ్యూచువల్ ఫండ్, ప్రధాని గ్రామోదయ యోజన, ప్రధానమంత్రి రోజ్‌గార్ గ్రామీణ యోజన, ఇందిరా ఆవాస్ యోజన, ముఖ్యమంత్రి సహాయ నిధి…ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి వివిధ విభాగాలు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేసిన కోట్లాది రూపాయల సొమ్మును ఎవరూ క్లెయిమ్ చేయలేదు. అసలు ఇవన్నీ నిజంగా ప్రభుత్వ ఖాతాలేనా లేక అలాగే ఉన్న పేరుతో బ్యాంకులు అజాగ్రత్తగా సృష్టించిన ఖాతాలా అనే ప్రశ్న ఉదయిస్తోంది. దిగ్భ్రాంతి కలిగించే విషయమేమంటే ఈపీఎఫ్‌ఓ, ఈఎస్‌ఐసీ ఫండ్స్‌ను కాగ్ నిరంతరం తనిఖీ చేస్తుంటుంది. అలాంటి నిధులకు సంబంధించిన ఖాతాల్లో కూడా డబ్బు పేరుకుపోతోంది. సైనిక ఫండ్స్ సహా ఇలా క్రియాశీలకంగా ఉండే సంస్థల ఖాతాల జోలికి దశాబ్దానికి పైగా ఎలా పోకుండా ఉంటారు?. ఇలా చాలా కాలం పాటు క్లెయిమ్ చేయని ఖాతాలను చివరికి ఆర్‌బీఐకి చెందిన డెఫ్‌కు బదిలీ చేసి చేతులు దులుపుకుంటారు.
ప్రయివేటు సంస్థల ఖాతాల్లో సైతం…
ప్రయివేటు ట్రస్టులు, ఫౌండేషన్లు, ఛారిటీల ఖాతాలదీ ఇదే పరిస్థితి. ఖాతాల గురించి మరిచిపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. ఇలాంటి ఖాతాలు వేలల్లోనే ఉంటాయి. ఇలా ఎవరూ క్లెయిమ్ చేయకుండా మనుగడలో లేని ఖాతాల గురించి ఆర్‌బీఐ తన ఉద్గమ్ పోర్టల్‌లో ప్రజలను చైతన్యపరుస్తోంది. గత సంవత్సరం మార్చి నాటికి ఇలాంటి క్లెయిమ్ చేయని డిపాజిట్లు రూ.78,213 కోట్లకు చేరాయి. ఎస్‌బీఐ మినహా 2023లో ఉనికిలో లేని ఖాతాల్లో లక్ష కోట్ల రూపాయలు ఉన్నాయి.
ఆ డబ్బు ఎవరిదో…!?
- Advertisement -
- Advertisement -



