Thursday, May 15, 2025
Homeజాతీయంకల్నల్‌ సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

కల్నల్‌ సోఫియా ఖురేషీపై బీజేపీ మంత్రి అనుచిత వ్యాఖ్యలు

- Advertisement -

– నాలుగు గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలి : మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఆదేశాలు
పదవి నుంచి తప్పించాలంటూ ప్రతిపక్షాల డిమాండ్‌

భోపాల్‌: ఇండియన్‌ ఆర్మీకి చెందిన మహిళా అధికారి కల్నల్‌ సోఫియా ఖురేషీపై మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత విజయ్‌ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మంత్రి అనుచిత వైఖరిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. చివరకు న్యాయస్థానం కూడా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. నాలుగు గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేయాలని మధ్యప్రదేశ్‌ పోలీసులను హైకోర్టు బుధవారం ఆదేశించింది. పాక్‌ ఉగ్రవాదులపై భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పాత్రికేయులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించిన అధికారులలో సైనిక దళానికి చెందిన కల్నల్‌ సోఫియా ఖురేషీ కూడా ఒకరు.మంత్రి విజరు షా ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఉగ్రవాదుల మతాన్ని కల్నల్‌ సోఫియా ఖురేషీ మతానికి లంకె పెట్టడం వివాదానికి దారితీసింది. హిందువుల అమానుష హత్యాకాండకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ‘ఉగ్రవాదుల మతానికి చెందిన ఓ సోదరి’ని పంపారని విజరు షా వ్యాఖ్యానించారు. ‘ఉగ్రవాదులు మన హిందూ సోదరుల బట్టలు విప్పించి చంపేశారు. దీనికి స్పందించిన ప్రధాని మోడీ వారి (ఉగ్రవాదులు) సోదరిని సైనిక విమానంలో పంపి ఇళ్లలో ఉండగా దాడి చేయించారు. వాళ్లు మన సోదరీమణులను వితంతువులుగా మార్చారు. అందువల్ల మోడీ వారి మతానికి చెందిన సోదరిని వారికి గుణపాఠం చెప్పేందుకు పంపారు’ అని విజరు షా అన్నారు.ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో కీలకంగా వ్యవహరించిన కల్నల్‌ సోఫియా ఖురేషిని ఉగ్రవాదుల సోదరిగా వ్యాఖ్యానిస్తూ వ్యాఖ్యలు చేసిన మంత్రి విజరు షాపై నాలుగు గంటల్లోగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలంటూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. ఈ విషయాన్ని తమకు తాముగా పరిగణనలోకి తీసుకున్న కోర్టు తీవ్రమైన క్రిమినల్‌ అభియోగాల కింద కేసు నమోదు చేయాలని డిజిపి కైలాష్‌ మక్వానాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజరు షాపై చర్యలు తీసుకునే అంశాన్ని యోచిస్తున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విజరు షా ప్రకటన దేశంలో పెను వివాదాన్ని సృష్టించింది. ఒక సీనియర్‌ సైనికాధికారిని అప్రదిష్టపాలు చేసేలా అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తమైంది. తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు, ఖండనలు వెల్లువెత్తడంతో విజరు షా క్షమాపణలు చెప్పారు. అయినా ఆయనను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. మధ్యప్రదేశ్‌ క్యాబినెట్‌ నుంచి విజరును వెంటనే తప్పించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ‘ప్రధాని మోడీ, బీజేపీ ఆయనను మంత్రి పదవి నుంచి తొలగిస్తారా లేక మౌనం వహిస్తారా అని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సాగరిక ఘోష్‌ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన స్థానాల్లో వున్న కొంతమంది మహిళలపై కొందరు వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జాతీయ మహిళా కమిషన్‌ ఖండించింది. ఇదిలావుండగా ఆర్‌ఎస్‌ఎస్‌ మద్దతుదారులు కల్నల్‌ సోషియా కుటుంబ నివాసంపై దాడి చేశారంటూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన ఓ పోస్ట్‌ వైరల్‌ అయింది. పాకిస్తాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో సమస్యలు సృష్టించేందుకు ఇలాంటి సైబర్‌ దాడులు జరుపుతున్నారని భావించిన పోలీసులు ఆ పోస్టును తొలగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఆ పోస్టును తొలగించారు. ‘అనిస్‌ ఉద్దిన్‌’ పేరిట కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియాలో ఈ పోస్ట్‌ పెట్టినట్లు గుర్తించారు. దీనికి పాకిస్తాన్‌ నుండి ఎక్కువగా మద్దతు లభించింది. ఈ ఘటన నేపథ్యంలో కల్నల్‌ సోఫియా నివాసం వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -