Thursday, November 6, 2025
E-PAPER
Homeజిల్లాలుకౌలు రైతులకు శాపంగా మారిన కిసాన్ కపాస్

కౌలు రైతులకు శాపంగా మారిన కిసాన్ కపాస్

- Advertisement -

ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలుతో కౌలు రైతుల్లో ఆందోళన

రైతులకు అవగాహన కల్పించకుండానే కిసాన్ కపాస్ యాప్

ఎకరాకు 15 క్వింటాళ్ల వరకు కొనుగోలుకు పరిమితి పెంచాలి

నవతెలంగాణపాలకుర్తి

రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ కౌల రైతులకు శాపంగా మారింది. పత్తి అమ్మకానికి కిసాన్ కపాస్ యాప్ లో కౌలు రైతులకు అవకాశం కల్పించకపోవడంతో కౌలు రైతులు భూమి కౌలుకు ఇచ్చిన రైతులను, లేదా మధ్య దళారీలను ఆశ్రయించి నష్టపోవాల్సిన పరిస్థితి దాపురించింది. గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 20% నుండి 30% వరకు భూములను కౌలుకు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు.

వేల రూపాయల్లో కౌలు రుసుము చెల్లించి, లక్షల్లో పెట్టుబడులు పెట్టిన కౌలు రైతుకు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కిసాన్ కపాస్ యాప్ ద్వారా పంట అమ్ముకునే హక్కు లేకుండా చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో రైతు 5 ఎకరాల నుండి 20 ఎకరాల వరకు కౌలు ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక్కో ఎకరాకు ఐదు క్వింటాళ్ల నుండి 12 క్వింటాళ్ల వరకు పత్తి పంట దిగుబడి రావడం, కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా కొనుగోలు చేసే పత్తిని ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని ప్రకటించడంతో కౌలు రైతులు మనోవేదనకు గురవుతున్నారు.

ఆరుగాలం కష్టపడి పత్తి పంటను పండించి ఇతరుల పేరున, మధ్య దళారీల ద్వారా పత్తి పంటను సిసిఐ కి కట్టబెడితే వచ్చే నగదు వారి ఖాతాలనే జమ అవుతుందని, సమయానికి డబ్బులు ఇవ్వకుంటే కౌలు రైతుల జీవితాలు బుగ్గిపాలు తప్పవనే ఆందోళనకు గురవుతున్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం నుండి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ కపాస్ యాప్ పట్ల రైతులకు అవగాహన కల్పించాల్సి ఉండగా అవేవీ పట్టనట్లుగా ఒక్కసారిగా కిసాన్ కపాస్ యాప్ ను ప్రవేశపెట్టడం కౌలు రైతులకు నిరాశ నిస్పృహలు కలిగేలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసింది. కిసాన్ కపాస్ యాప్ లో కౌల రైతుకు సంబంధించి వివరాలు లేకపోవడంతో పత్తి పంటను యాప్ ద్వారా అమ్ముకునేదెలా అంటూ కౌలు రైతు వాపోవుచున్నాడు. 30% రైతులు కౌలు పై ఆధారపడి వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్ లు, కొనుగోళ్ల షరతులతో దిక్కుతోచని స్థితిలో కౌలు రైతు కొట్టుమిట్టాడుచున్నాడు. ప్రకృతి వెంటాటడం, పత్తి పంట దెబ్బతినటం, ఓ పక్క కేంద్ర ప్రభుత్వం షరతులు విధించడం రైతులు అయోమయానికి గురవుచున్నారు. కిసాన్ కంపస్ యాప్ ద్వారా పత్తి పంటను విక్రయించుకుందామంటే పంట సాగు వివరాలు ఆన్లైన్లో పూర్తిస్థాయిలో నమోదు కాకపోవడం కౌలు రైతులకు అనేక ఇబ్బందులకు దారితీస్తుంది. ప్రభుత్వం అందించే పరిహారం కౌలు రైతులకు అందే పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. కిసాన్ కాపాస్ యాప్ తో సంబంధం లేకుండా కౌలు రైతులకు ఎలాంటి పరిమితులు విధించకుండా సిసిఐ ద్వారా పత్తి పంట అమ్మకాలకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించేందుకు చర్యలు చేపట్టి, కేంద్రం ప్రకటించిన షరతులను ఎత్తివేయాలి. రైతులను నట్టేట ముంచేందుకే కేంద్రం అడ్డగోలు షరతులను తీసుకువచ్చి తేమశాతం, రంగు మారిన పత్తి పేరుతో రైతులను నష్టం చేసేందుకే కుట్రలు చేస్తున్న కేంద్రం కుట్రపూరితమైన విధానాలను ఎండగట్టేందుకు రైతులు సమాయత్తం కావలసిన అవసరం ఆసన్నమైంది.

రతులు లేకుండా ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలి

గుగులోతు సుధాకర్ కౌలు రైతు దుబ్బ తండా ఎస్పీ

ఎలాంటి షరతులు లేకుండా ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిసిఐకి ఆదేశాలు జారీ చేయాలి. రైతులను, కౌలు రైతులను వ్యవసాయానికి దూరం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం రైతులు భరించలేని చట్టాలను, షరతులను తీసుకువస్తుంది. వ్యవసాయానికి సరిపడా భూములు లేకనే కౌలుకు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కౌలు రైతులకు ఆందోళనను కలిగిస్తుంది. పత్తి కొనుగోళ్లపై కేంద్రం విధిస్తున్న అక్షరతులను వెంటనే ఎత్తివేయాలి. ఎలాంటి షరతులు లేకుండా కేంద్రం చర్యలు చేపట్టి పత్తి పంటకు కనీస మద్దతు ధర 10,000 నిర్ణయించి రైతులను ఆదుకోవాలి.

రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం

మాచర్ల సారయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు, గూడూరు

వ్యవసాయ రంగాన్ని దివాలా తీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంది. రైతు పండించిన పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. కౌలు రైతును గుర్తించేందుకు క్షేత్రస్థాయిలో సందర్శించి నిర్ధారణ చేయాలి. వేల రూపాయలు వెచ్చించి భూములను కౌలుకు సాగు చేస్తున్న కౌల రైతులకు కేంద్ర ప్రభుత్వ విధానాలతో పాటు నకిలీ విత్తనాలు వెంటాడుచున్నాయి. పంట విక్రయాల్లో ఎలాంటి పరిమితులు లేకుండానే ఎకరాకు 15 క్వింటాళ్ల పత్తిని సిసిఐ ద్వారా కొనుగోలు చేయాలి. రైతులను, కౌలు రైతులను మోసం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులను, కౌలు రైతులను సంఘటితం చేసి ఉద్యమాలు చేస్తాం. రైతుల హక్కులను సాధించుకుంటాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -