భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమిని సెలక్షన్ కమిటీ మరోసారి పక్కనపెట్టింది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన సమయంలో.. షమి ఫిట్‌నెస్ సాధించలేదని సెలక్షన్ కమిటీ పేర్కొనగా.. ఫిట్‌గానే ఉన్నానంటూ స్టార్ పేసర్ రంజీ ట్రోఫీ బరిలోకి దిగాడు. ఉత్తరాఖాండ్, గుజరాత్‌తో మ్యాచుల్లో కలిపి 15 వికెట్లు పడగొట్టి ఫామ్ చాటుకున్నాడు. అయినా, అజిత్ అగార్కర్ ప్యానల్ మహ్మద్ షమిని దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు పరిగణనలోకి తీసుకోలేదు. పేస్ విభాగంలో జశ్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌తో పాటు ఆకాశ్ దీప్ ఉన్నాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి, స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ జట్టులో నిలిచారు. కుల్‌దీప్ యాదవ్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జట్టులో నిలిచాడు. సఫారీతో టెస్టులకు సన్నద్ధం కోసం ఆసీస్ పర్యటన నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చిన కుల్‌దీప్ బెంగళూరులో జరుగనున్న సఫారీ-ఏతో రెండో అనధికార టెస్టులో ఆడనున్నాడు. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్‌లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు బ్యాటింగ్ విభాగంలో ఉండగా.. రెండో వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్ ఎంపికయ్యాడు.



