స్టార్ పేసర్ మహ్మద్ షమికి దక్కని చోటు
భారత్-ఏ వన్డే జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి
ఊహించినట్టుగా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో పాదం గాయానికి గురైన రిషబ్ పంత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ అనంతరం ఇటీవల దక్షిణాఫ్రికా-ఏతో తొలి అనధికార టెస్టులో ఫిట్‌నెస్, ఫామ్ చాటిన రిషబ్ పంత్.. సఫారీ సిరీస్‌కు జట్టులోకి రావటంతో పాటు వైస్ కెప్టెన్సీ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ పర్యటన అనంతరం వెన్నునొప్పితో బాధపడిన పేసర్ ఆకాశ్ దీప్.. దులీప్ ట్రోఫీకి దూరమయ్యాడు. తాజాగా ఫిట్‌నెస్ సాధించటంతో ఆకాశ్ దీప్‌ను సైతం సెలక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసింది. రిషబ్ పంత్, ఆకాశ్ దీప్ రాకతో ఎన్ జగదీశన్, ప్రసిద్ కృష్ణకు ఉద్వాసన తప్పలేదు. భారత్, దక్షిణాఫ్రికా తొలి టెస్టు ఈ నెల 14 నుంచి కోల్‌కతలో జరుగనుండగా.. 22 నుంచి రెండో టెస్టు గువహటిలో జరుగుతుంది.
తిలక్‌కు కెప్టెన్సీ పగ్గాలు
భారత క్రికెట్ నాయకత్వ బృందంలోకి తెలుగు తేజం తిలక్ వర్మ అడుగుపెట్టాడు. దక్షిణాఫ్రికా-ఏ జట్టుతో జరిగే మూడు మ్యాచుల 50 ఓవర్ల ఫార్మాట్ సిరీస్ ఈ నెల 13, 16, 19న రాజ్‌కోట్‌లో జరుగనుంది. ఈ సిరీస్‌లో భారత్-ఏ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్సీ వహించనున్నాడు. భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్, ఇటీవల భారత్-ఏ జట్టుకు సారథ్యం వహించిన శ్రేయస్ అయ్యర్ తీవ్ర గాయం బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో భారత్-ఏ జట్టు పగ్గాలు తిలక్ వర్మకు దక్కాయి. వైస్ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఎంపికయ్యాడు. అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్, విప్‌రాజ్ సహా నిశాంత్ సింధులు భారత్-ఏ తరఫున ఆడనున్నారు.
భారత టెస్టు జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జశ్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీశ్ కుమార్ రెడ్డి, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, ఆకాశ్ దీప్.
భారత్-ఏ వన్డే జట్టు
తిలక్ వర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆయుశ్ బదొని, నిశాంత్ సింధు, విప్‌రాజ్ నిగమ్, మానవ్ సుథర్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, ప్రభుసిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్).



