Thursday, November 6, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలునిబంధనలు ఎత్తేయాలి

నిబంధనలు ఎత్తేయాలి

- Advertisement -

పత్తికి మద్దతు ధర ఇవ్వకుండా తేమ శాతం పేరుతో కోతలా?
విదేశీ పత్తి దిగుమతి వల్ల దేశ రైతులు నష్టపోతున్నారు
మొత్తం పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి
విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చలు జరపండి
బంద్‌తో విద్యార్థులకు తీవ్ర నష్టం
నిరుద్యోగుల పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు
డ్రగ్స్‌ మాఫియాను అరికట్టాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ

నవతెలంగాణ-కొత్తగూడెం
పత్తి కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు ఎత్తేసి.. మొత్తం పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్‌ చేశారు. తేమ శాతం పేరుతో కోతలు విధించొద్దని కోరారు. కొత్తగూడెంలోని మంచికంటి భవన్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తేమ శాతం పేరుతో పత్తి కొనుగోలు చేయకుండా ఆంక్షలు పెట్టడం సరికాదన్నారు. యాప్‌ ద్వారానే పత్తి కొనుగోళ్లకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని చెప్పడం వల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పడం సిగ్గు చేటన్నారు. అదనపు పత్తి పంటను ఏమి చేయాలో కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నుంచి పత్తి కొనుగోలు చేయకుండా విదేశాల నుంచి సుంకాలు ఎత్తివేసి దిగుమతి చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం వల్ల నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని, వారి పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు ఇస్తోందని జాన్‌వెస్లీ ప్రకటించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రయివేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మెలో ఉన్నాయని, బంధువల్ల విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వారితో చర్చలు జరిపి మొదట హామీ ఇచ్చిన రూ.12 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్‌ బిల్లుకు బీజేపీ అడ్డుపడుతోందని, బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపితే లేనిపోని కారణాలు చెప్పి అడ్డుకుంటోందని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్‌ మహమ్మారి పెరిగిపోయిందని, దీని వల్ల యువత జీవితాలను కోల్పోతున్నారని జాన్‌వెస్లీ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ వ్యాపారం పెరిగిందని, పది నెలల్లో 11 వందల కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్‌ను అరికట్టడంలో ప్రభుత్వం నిద్ర మత్తు వీడాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేలే వరకూ బనకచర్లకు ఎలాంటి అనుమతులూ ఇవ్వొద్దని కేంద్రాన్ని కోరారు.

రైతులను కాపాడే పంటల బీమా కావాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌
రైతులు చనిపోయాక కల్పించే బీమా కంటే.. ముందే రైతులను కాపాడే పంటల బీమా అమలు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన పంటకు రక్షణ కల్పించడంలో సరైనా సౌకర్యాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మార్కెట్‌కి వచ్చిన పంటకు రక్షణ లేకపోతే రైతులు చేనులో పంటను పెట్టుకోలేడు, ఇంట్లో పెట్టుకోలేడు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ పంటకు కొనుగోలు కేంద్రాల వద్ద రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు. కేంద్ర బృందం రాష్ట్రంలో నష్టపోయిన పంటను సర్వే చేసి, రైతులకు ఎకరానికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

దెెబ్బతిన్న రహదారులు మరమ్మతులు చేయాలి : సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అకాల వర్షాలకు దెబ్బతిన్న రహదారులను వెంటనే మరమ్మతులు చేయించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. రహదారుల మరమ్మతులు చేశాకే ఇసుక లారీలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అకాల వర్షం వల్ల జిల్లాలోని అళ్లపల్లి, గుండాల పరిసరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పంటల బోనస్‌ రూ.18 కోట్ల 65 లక్షల రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరారు. ఈ విలేకర్ల సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -