100 మంది మృతి.. మరో 75 మంది గల్లంతు
కొనసాగుతున్న సహాయక చర్యలు
మనీలా : ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుపాను బీభత్సం సృష్టించింది. ఈ విధ్వంసంలో మృతుల సంఖ్య 100 కు చేరింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దాదాపు 75 మంది గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తుపాను ధాటికి చాలా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అధిక సంఖ్యలో వాహనాలు నీటమునిగాయి. తుపాను నేపథ్యంలో ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సుమారు 4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. దీవుల మధ్య నడిచే నౌకలు, చేపల పడవలు నిలిపివేశారు. 3,500 మందికి పైగా ప్రయాణికులు, ట్రక్ డ్రైవర్లు 100 పోర్టుల్లో ఇరుక్కుపోయారు. 186 దేశీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. తీవ్ర వర్షాలు, ఆకస్మిక వరదలు ప్రజలను ఇండ్ల పైకప్పులపైకి వెళ్లేలా చేశాయి. కార్లు నీటిలో కొట్టుకుపోయాయి.
సహాయక చర్యల కోసం వచ్చి కుప్పకూలిన హెలికాప్టర్
అగుసాన్ డెల్ సూర్ ప్రావిన్స్‌లో సహాయక చర్యల కోసం వెళ్లిన ఫిలిప్పీన్స్ వాయుసేన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది చనిపోయారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా లేవని సైన్యం తెలిపింది. సిబూ ప్రావిన్స్ తీవ్రంగా దెబ్బతిందని ఫిలిప్పీన్స్ సివిల్ డిఫెన్స్ కార్యాలయ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బెర్నార్డో రఫయెలిటో అలెజాండ్రో తెలిపారు.
వియత్నాం, థాయ్‌లాండ్‌లో కూడా అప్రమత్తం
కల్మేగి తుపాను ఇప్పుడు కేంద్ర వియత్నాం వైపునకు దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం వియత్నాం తీరాన్ని చేరుకుంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. థాయ్‌లాండ్ వాతావరణ విభాగం ఉత్తర, తూర్పు, మధ్య ప్రాంతాల్లో తీవ్ర వర్షాల హెచ్చరిక జారీ చేసింది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు సంభవించే అవకాశం ఉందని సూచింది. వియత్నాం అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.
ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుపాను బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



