ఎర్రజెండా ముద్దుబిడ్డ గుగులోత్ ధర్మ : తమ్మినేని వీరభద్రం, జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెంలో ధర్మ విగ్రహం, స్తూపం ఆవిష్కరణ
నవతెలంగాణ-కొత్తగూడెం
అణగారిన వర్గాల కోసం పనిచేసేదని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని పలువురు వక్తలు అన్నారు. ప్రతి ఒక్కరి సమస్య పరిష్కారం కోసం సంఘాలను ఏర్పాటు చేసిందీ వారేనన్నారు. సమస్యలకు పరిస్కారం చూపించగలిగే శక్తి ఒక్క ఎర్రజెండా సిద్ధాంతానికి మాత్రమే ఉందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం మంగపేట గ్రామంలో బుధవారం గుగులోత్ ధర్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ధర్మ విగ్రహ, స్తూప ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నాయకులు కున్సోత్ ధర్మ అధ్యక్షతన జరిగిన సభలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, మాట్లాడారు.
ఎర్రజెండా ముద్దుబిడ్డ గుగులోత్ ధర్మ నాయక్ అని, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి శ్వాస వరకూ పనిచేసిన గొప్ప ఆదర్శవాది అని అన్నారు. సుజాతనగర్ ప్రాంతంలో అమరుడు కాసాని ఐలయ్య మడమతిప్పని పోరాట పటిమ గలిగిన నాయకుడని, ఆయన అడుగు జాడల్లోనే ధర్మా కూడా చివరి వరకు కమ్యూనిస్టు సిద్ధాంతం పట్ల నిబద్ధతతో పనిచేశారని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం గుగులోత్ ధర్మ నిర్వహించిన ఉద్యమాలు నేటితరానికి ఆదర్శమని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బండారు రవికుమార్, జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.



