బీజాపూర్ జాతీయ రహదారికి శంకుస్థాపన చేసిండ్రు.. మళ్లీ కన్నెత్తి చూడలేదు
చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై స్పందించని బీజేపీ నాయకులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీరుపై స్థానికుల్లో ఆగ్రహం
సోషల్ మీడియాకే పరిమితమైన చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
నెత్తుటి మరకలు.. కన్నీళ్లను కండ్లు చూడని దినం లేదు… హైదరాబాద్ టు బీజాపూర్ జాతీయ రహదారికి. ఈ రహదారిలో జరిగే ప్రతి ప్రమాదమూ పాలకుల నిర్లక్ష్యమేనని కండ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిసి రోడ్డు విస్తరణకు శంకుస్థాపన చేసి పనులు పూర్తి చేయకపోవడాన్ని ఏమంటారని స్థానికులు ప్రశిస్తున్నారు. శంకుస్థాపన చేసిన నేతలు ఎవ్వరూ తిరిగి మళ్లీ కన్నెత్తి చూడలేదని వాపోతున్నారు. ఇంతమంది ప్రాణం బలిగొన్న వారికి కనికరం కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. ఈ ప్రమాదాలకు కారణమైన ప్రజాప్రతినిధులు ఎక్కడా..! ప్రజల గోడు వారికి పట్టదా.. మృతుల కుటుంబాలను పరామర్శించే ధైర్యం కూడా నాయకులకు లేదా? అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారి పాపమే చేవెళ్ల ఘటనకు కారణమన్న అభిప్రాయం ప్రతి ఒక్కరిలోనూ వ్యక్తమవుతోంది.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయప్రతినిధి
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి 2018లో మంజూరైంది. నేషనల్ హైవే అథారిటి 163 రోడ్డును గుర్తించింది.. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు 46 కిలో మీటర్ల మేరకు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇందుకు రూ.928.14 కోట్ల బడ్జెట్ కేటాయించారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అంతాబాగానే ఉన్నా.. పర్యావరణం పేరుతో కోర్టు కేసును అడ్డుపెట్టుకుని గత పాలకులు ఈ రోడ్డు నిర్మాణాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులుగా 2014 నుంచి 2019 వరకు కొండ విశ్వేశ్వర్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నారు.
2019 నుంచి 2024 వరకు రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఎమ్మెల్యేగా 2014 నుంచి ఇప్పటి వరకు కాలే యాదయ్య 2024 వరకు బీఆర్‌ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ ప్రాంతంలో సుమారు 40 ఏండ్లుగా రాజకీయ చక్రం తిప్పుతున్న ‘పటోళ్ల, పట్నం’ కుటుంబాలు పదేండ్లు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఉన్నాయి. ఆ తర్వాత మహేందర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. పదేండ్ల కాలంలో చిన్న కోర్టు కేసును పరిష్కరించి ప్రజల ప్రాణం కాపాడేందుకు ప్రయత్నం చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి స్వార్థపు రాజకీయాలు అమాయక ప్రజల ప్రాణాలను తీసాయని ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై ఎంపీలు పార్లమెంట్‌లో లేవనెత్తి ‘గ్రీన్ ట్రిబ్యునల్’ నుంచి కేసును పరిష్కరించే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ దిశగా ఏ రోజూ ప్రయత్నం చేయలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎక్కడ ?
జాతీయ రహదారిపై ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రజలు మరణిస్తే ప్రమాద పరిస్థితులను సైతం పరిశీలించని ప్రజా ప్రతినిధి ఎందుకు అని జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా వాసిగా కేంద్రమంత్రి వర్గంలో ఉన్న కిషన్‌రెడ్డి ఇప్పటి వరకు ఘటనకు సంబంధించి స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో ప్రధాన మంత్రి మృతుల కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కానీ లోకల్‌గా ఉన్న కేంద్ర మంత్రికి స్పందించడానికి సమయం లేదా? అని జిల్లావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతుల కుటుంబాలను పరామర్శించలేదు.
సోషల్ మీడియకు పరిమితమైన చేవెళ్ల ఎంపీ
చేవెళ్ల పార్లమెంట్ ప్రజలు ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు అనుకున్నారు. మా ఆశల మీద నీళ్లు చల్లినట్టు అయిందని వాపోతున్నారు. కనీసం సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ సొంత అస్పత్రి అపోలకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తారని జిల్లా ప్రజలు ఆశించినా.. ఎంపీ ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వాల్సిన ఎంపీ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఇంట్లో కూర్చోడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా రోడ్లపై గుంతలు ఉంటేనే ప్రమాదాలు జరగవంటూ అశాస్త్రీయంగా మాట్లాడారు.
ముమ్మాటికీ నాయకుల నిర్లక్ష్యమే ..
పదేండ్ల కాలంగా అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో స్థానికంగా ఉన్న నాయకత్వం రోడ్డు నిర్మాణాన్ని పక్కన పెట్టింది. ప్రభుత్వంతో మాట్లాడి రోడ్డు నిర్మాణ పనులు చేపడితే వందలాది ప్రాణాలు పోయేవి కాదు. అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే ఆ కేసు సమస్యే కాదు. కానీ ఏ రోజూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ.. ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు కానీ పట్టించుకోలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కోర్టుకు వెళ్లిన వ్యక్తితో సీఎం మాట్లాడి కేసును విత్ డ్రా చేయించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మధుసూధన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా గంథ్రాలయ చైర్మెన్
స్వార్థ రాజకీయాలకు ప్రజలు బలి
అధికారంలో ఉన్న వారు తలచుకుంటే అయ్యే పనులను సైతం చేయకుండా తమ స్వార్థం కోసం ప్రమాదాలకు కారణమయ్యారు. కమీషన్ల కోసం, తమ భూములు కాపాడుకోవడం కోసం లీడర్లు హైదరాబాద్ – బీజాపూర్ జాతీయ రహదారి భూసేకరణలో ప్రజాప్రతినిధులు కీలకపాత్ర పోషించారు. జాతీయ రహదారిలో ఇన్ని మూల మలుపులు ఉండవు. నేతల స్వార్ధమే ప్రమాదాలకు కారణం. కాడిగళ్ల భాస్కర్, సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు



