తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో వారికి పెద్దపీట : వీవీజీఎఫ్ గ్లోబల్ సదస్సులో మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహిళా సాధికారతే దేశాభి వృద్ధికి సూచిక అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. నెదర్లాండ్‌కు చెందిన అంతర్జాతీయ స్థాయి మహిళా నాయకత్వ వేదిక ”వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్” సదస్సులో ”ప్రతికూలతల నుండి సాధికారతవైపు.. దేశాలను మారుస్తున్న మహిళల శక్తి” అనే అంశంపై ఆమె ప్రసంగించారు. ”ఆఫ్రికాలో కోడింగ్ నేర్చుకుంటున్న అమ్మాయి, లాటిన్ అమెరికాలో వ్యాపారం ప్రారంభించిన తల్లి, భారతదేశంలోని గిరిజన స్త్రీ… మన అందరిది ఒకే గమ్యం. మహిళ అభివృద్ధి చెందితేనే సమాజం మొత్తం అభివృద్ధి చెందుతుంది. నా ప్రయాణం అడవుల నుండి గ్లోబల్ వేదికల వరకూ సాగింది. సాధికారత ఎవరో ఇస్తే రాదు. మనమే సాధించాలి. ప్రపంచానికి మహిళల శక్తి చూపించాల్సిన సమయం వచ్చింది” అని సీతక్క అన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళల భాగస్వామ్యం 40 శాతం కాగా, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అది 20 శాతం లోపే ఉందని తెలిపారు. స్థూల జాతీయ ఉత్పత్తిలో మహిళలకు భాగస్వామ్యం పెంచేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చే సంకల్పంతో పని చేస్తున్నామని వివరించారు. అందులో భాగంగా ప్రతి సంవత్సరం కనీసం రూ.25 వేల కోట్ల బ్యాంక్ లింకేజ్ రుణాలు మహిళా సంఘాలకు అందిస్తున్నామని చెప్పారు. ”ఇందిరా మహిళా శక్తి పాలసీ ద్వారా మహిళా సంఘాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దుతున్నాం. మహిళలు క్యాంటీన్లు నడుపుతున్నారు, సోలార్ ప్లాంట్లు నిర్వహిస్తున్నారు. పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. ఆర్టీసి బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళలే నేడు ఆ సంస్థకే బస్సులను అద్దెకు ఇస్తూ యాజమానులుగా ఎదిగారు” అని ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళలు సాధించిన విజయాలను గ్లొబల్ వేదికపై వెల్లడించారు. తన చిన్ననాటి ఆదివాసీ బాలిక జీవితం నుండి రాష్ట్ర మంత్రిగా ఎదిగిన ప్రేరణాత్మక ప్రయాణాన్ని, ఆ మార్గంలో సమాజానికి అందించిన సేవలను, ప్రజాస్వామ్య పోరాటాలను, కరోనా కాలంలో చేసిన సహాయ కార్యక్రమాలను సీతక్క వివరించారు. పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రపంచ వేదికపై ఆవిష్కరించారు.
మహిళా సాధికారతే దేశాభివృద్ధికి సూచిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



