– తగ్గుతోన్న ద్రవ్యోల్బణం సూచీ
– 13 నెలల కనిష్ట స్థాయికి టోకు ధరలు
న్యూఢిల్లీ : రుణ గ్రహీతలపై హెచ్చు వడ్డీ రేట్ల భారాన్ని తగ్గించడానికి సమయం అసన్నమయ్యింది. ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం సూచీ తగ్గుముఖం పట్టడంతో వడ్డీ రేట్లకు కోత పెట్టడానికి వీలుంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం దాదాపు ఆరేండ్ల కనిష్టానికి పడిపోయింది. సాధారణంగా అల్ప స్థాయిలో ద్రవ్యోల్బణం, తక్కువ వడ్డీ రేట్లు జీడీపీ వృద్ధికి మద్దతును అందిస్తాయి. దీంతో ప్రజల వద్ద ఆదాయాలు పెరగడంతో కొనుగోళ్లకు మద్దతు లభించనుంది. ఈ నేపథ్యంలో వడ్డీ రేట్ల తగ్గింపు అనివార్యమని నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం కేంద్ర గణంకాల శాఖ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. ఏప్రిల్‌లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 3.16 శాతానికి దిగివచ్చింది. ఇది 2019 జులై నాటి కనిష్ట స్థాయి. మరోవైపు టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) తగ్గింది.
గడిచిన ఏప్రిల్‌లో డబ్ల్యూపీఐ 0.85 శాతానికి పరిమితమై 13 నెలల కనిష్ట స్థాయి వద్ద నమోదయ్యింది. ఇంతక్రితం నెలలో ఇది 2.05 శాతంగా చోటు చేసుకుంది. ముఖ్యంగా అహార ఉత్పత్తుల ధరలు దిగిరావడమే ఇందుకు కారణం. మార్చిలో 4.66 శాతంగా ఉన్న అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం, ఏప్రిల్‌లో 2.55 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 3.07 శాతం నుంచి 2.62 శాతానికి దిగివచ్చింది. ఇంధనం, విద్యుత్ ద్రవ్యోల్బణం ఏకంగా 0.20 శాతం నుంచి మైనస్ 2.18 శాతానికి పడిపోవడం విశేషం. ద్రవ్యోల్బణం ఆధారంగానే ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం దిగిరావడంతో ఆర్బీఐ ఎంపీసీ ద్రవ్య సమీక్షల్లో రెపోరేటు మరింత దిగిరానుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్‌లో జరిగిన ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు చొప్పున మొత్తం అర శాతం తగ్గించింది. ఫలితంగా ఎట్టకేలకు రెపో రేటు 6 శాతానికి దిగివచ్చింది.దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినందున రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్లను భారీగా తగ్గించడానికి వీలుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రీసెర్చ్ ఇటీవల పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 3 శాతం దిగువకు తగ్గొచ్చని తెలిపింది. ఇదే పరిస్థితి కొనసాగితే వడ్డీ రేట్లను 125 బేసిస్ పాయింట్లు (1.25 శాతం) తగ్గించడానికి వీలుందని పేర్కొంది. జూన్-ఆగస్టు సమయంలో 75 బేసిస్ పాయింట్లు వడ్డీ రేట్ల తగ్గింపును అంచనా వేస్తున్నాము. ద్వితీయార్థంలో మరో 50 బేసిస్ పాయింట్లు తగ్గించడానికి వీలుందని పేర్కొంది.
వడ్డీ రేట్ల తగ్గింపు అనివార్యం..!
- Advertisement -
- Advertisement -