నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు పని చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అన్నారు. గురువారం గద్వాల శివారులోని కొండపల్లి రహదారిలో ఉన్న బాలాజీ జన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా రైతులు తెచ్చిన పత్తి నాణ్యతను,తూకం ప్రక్రియను పరిశీలించి,పత్తి జిన్నింగ్ ప్రక్రియను ప్రారంభం నుండి చివరి దశ వరకు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ .. రైతులు ప్రభుత్వ నిబంధనలు ప్రకారం కొనుగోలు కేంద్రాలకు పత్తిని ఆరబెట్టి తీసుకొని వస్తే గిట్టుబాటు ధర లభిస్తుంది అన్నారు.రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.మీ పత్తిని పూర్తిస్థాయిలో కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని,ఒక్క ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు సీసీఐ అధికారులు కొనుగోలు కొనసాగిస్తారని తెలిపారు.స్లాట్ బుకింగ్,రిజిస్ట్రేషన్ సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.పత్తి పంట వేసేటప్పుడే రైతులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో,దాని ప్రకారమే స్లాట్ బుకింగ్ చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం త్వరలో మరో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మిల్లులో ప్రతిరోజు 1350 క్వింటాళ్ల సామర్థ్యంతో పత్తి కొనుగోలు జరుగుతోందని,దీనిని 2000 క్వింటాళ్లకు పెంచాలని మిల్లు యాజమాన్యం కోరగా, కలెక్టర్ 1800 క్వింటాళ్ల వరకు పెంచే అవకాశం పరిశీలించాలని సీసీఐ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్ అధికారిని పుష్పమ్మ,సిసిఐ ఇన్చార్జి రాహుల్ కలేనా,గద్వాల మార్కెట్ యార్డ్ కార్యదర్శి నరసింహ, తదితరులు పాల్గొన్నారు.



