జిల్లా అదనపు కలెక్టర్ భాస్కరరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలో ఉద్యాన పంట అయినటువంటి ఆయిల్ పామ్ సాగు విస్తరణ లక్ష్యాలను సాధించి, రైతుల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉద్యానవన, వ్యవసాయ, కోపరేటివ్,ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో అయిల్ ఫామ్ సాగు విస్తరణ పై ఏ .ఓ లకు, పి.ఏ.సి.ఎస్ కార్యదర్శులకు, హార్టికల్చర్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతుల ఆదాయం పెరిగేలా ప్రతి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ తోటల పెంపక విస్తీర్ణం పెంచడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
జిల్లా లో 3500 ఎకరాలలో పంట సాగు లక్ష్యంగా ఉందని,సాగు కోసం రైతులను గుర్తించి అవగాహన కల్పించాలని, సబ్సిడీలు, అంతర పంటల ఆదాయం, డ్రిప్ రాయితీలు తదితర వివరాలను రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. విజయవంతమైన రైతులను రోల్ మోడల్‌గా చూపించి, సాగు విస్తీర్ణాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ పంటల సాగు ద్వారా రైతులకు లబ్ధి చేకూరేలా అమలు చేయాలన్నారు. పండ్ల తోటలు, కూరగాయలు, ఆధునిక సాగు పద్ధతులు, కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లు వంటి సదుపాయాలను సమర్థవంతంగా అందించాలన్నారు. రైతులు వరి ధాన్యం బదులుగా ఆయిల్ ఫామ్ పంట వేసే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు.
తెలంగాణ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులకై రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ పద్ధతులపై ప్రభుత్వం రాయితీలు అందిస్తోందని తెలిపారు. వర్గాల వారీగా రాయితీలు అందుబాటులో ఉండటంతో, రైతులు సాగు ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకునే అవకాశం ఉందన్నారు. ప్రతి నెల ఒకరోజు రైతు వేదికలో మండల స్థాయి అధికారులు సంబంధిత శాఖలతో రైతుల సమావేశాలు నిర్వహించి, పథకాలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు,రైతులకు లబ్ధి చేకూరేలా గ్రామ స్థాయిలో కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి మాధవి,వ్యవసాయ అధికారి రమణ రెడ్డి,కో ఆపరేటివ్ అధికారి శ్రీధర్ నాగార్జున, చైర్మన్లు, ఉద్యానవన, వ్యవసాయ శాఖ, మండల స్థాయి అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శి లు పాల్గొన్నారు.



