-బీట్ ఆఫీసర్ నరేష్,సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ సస్పెన్షన్
-ముగ్గురు బేస్ క్యాంపు సిబ్బంది విధుల నుండి తొలగింపు
నవతెలంగాణ-రాయికల్:

ఈనెల 5వ తేదీన నవతెలంగాణ దినపత్రికలో అల్లీపూర్ అటవీ విస్తీర్ణంలో టేకు దోపిడి శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా అటవీశాఖ అధికారి రవి ప్రసాద్ స్పందించారు.అల్లీపూర్ అటవీ పరిధిలో జరిగిన అక్రమ టేకు చెట్ల నరికివేత పై నవతెలంగాణ బయటపెట్టిన కథనంతో వనశాఖలో కఠిన చర్యలు ప్రారంభమయ్యాయి. జగిత్యాల జిల్లా అల్లీపూర్ సెక్షన్‌లో విధులు నిర్వర్తిస్తున్న రేచపల్లి (తూర్పు),రేచపల్లి (పశ్చిమ), నగునూర్,అల్లీపూర్ (పశ్చిమ) బీట్‌ల ఇన్‌చార్జ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్లావత్ నరేష్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఫారెస్ట్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.ఉత్తర్వుల ప్రకారం నరేష్ తన చట్టబద్ధ విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో రేచపల్లి (పశ్చిమ) బీట్‌లో పెద్ద ఎత్తున టేకు చెట్ల నరికివేత జరిగినట్లు నిర్ధారణ కావడంతో టీ.జీ.సి.ఎస్- సిసిఏ 1991లోని నిబంధనల ప్రకారం ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా చర్యలు పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.రేచపల్లి సెక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్ గాలిపల్లి శ్రీనివాస్‌పై కూడా విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం కారణంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.విచారణ ముగిసే వరకు ఆయన ప్రధాన కార్యాలయంలో ఉండాలని జీవనాధార భత్యం మాత్రమే అందజేయబడుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అల్లీపూర్ బేస్ క్యాంపులో పనిచేస్తున్న ముగ్గురు ఫీల్డ్ సిబ్బందిని విధుల నుండి తొలగించినట్లు డి.ఎఫ్.ఓ తెలిపారు.



