Friday, November 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిఆరెస్సెస్‌ అర్ధశాస్త్రం ఒక 'నీతిచంద్రిక'

ఆరెస్సెస్‌ అర్ధశాస్త్రం ఒక ‘నీతిచంద్రిక’

- Advertisement -

(నిన్నటి తరువాయి..)

ఇప్పుడు పైన పేర్కొన్న సంస్థలన్నీ ‘ఆరెస్సెస్‌ వల్ల ప్రేరణ’ పొందిన సంస్థలే. వాస్తవానికి ఇవన్నీ కూడా ఆరెస్సెస్‌ 2014 తర్వాత ప్రభుత్వంతో బాంధవ్యం పెట్టుకోవ డానికి ఏర్పాటుచేసిన ‘ఆర్థిక సమూహం’ లోని భాగాలు. ఇవి కొన్ని విధానాల మీద ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు. కానీ నిస్సందేహంగా ఈ సంస్థలన్నీ ఆరెస్సెస్‌కు, ఇటు బీజేపీ నాయకత్వాన ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధేయమైనవే. అసంతృప్తిని వ్యక్తం చేసే వీటి విధానం కూడా చివరికి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చటానికే.

ఉదాహరణకి, కార్మికుల అనేక డిమాండ్ల మీద బిఎమ్‌ఎస్‌ ఆందోళన చేస్తుంది, కానీ ట్రేడ్‌ యూనియన్‌ అన్ని కలిసి ఇచ్చే నిరసన ప్రదర్శనలలోనూ, ముఖ్యంగా సమ్మె పోరాటాల్లో పాల్గొనదు. ఒక విషయం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, గోల్వాల్కర్‌ సమ్మెలను వ్యతిరేకించారు, వర్గ పోరాటాలను ఖండించారు. సహజంగానే, మోడీ ప్రభుత్వం విధానాలలోని కొన్ని అంశాల పట్ల ఈ సంఘాలు చూపే అసంతృప్తిలో అధిక భాగం ఆరెస్సెస్‌ నియంత్రణ కిందే నడిచేటట్లు చూసుకుంటారు. కొన్ని వైరుధ్యాలు బయటికి కనపడొచ్చు, కానీ అవి స్వామిభక్తికి లోబడి ఉన్నాయనేదే ముఖ్యమైన విషయం.

ఆరెస్సెస్‌ ఈ కొత్త దశలో ఉన్న మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, నీతి చంద్రిక కథలు కొత్త రూపంలో కొనసాగుతున్నాయి. ఆ పాత కథలు భారతదేశపు గతకాలాన్ని గొప్ప వైభవకాలంగా చూపించాయి. భారతదేశం తిరిగి అటువంటి క్రమశిక్షణ కలిగిన, ధర్మానికి బద్ధులైన సమాజంగా పురాతన గ్రంధాలు చెప్పిన విధంగా పరిపాలన వైపు మరలాలని ఆరెస్సెస్‌ ఆశిస్తున్నది. ప్రజలను సంపద్వంతమైన, వైభవోపేతమైన, ముక్తిప్రదాయియైన కలలతో ఊరిస్తున్నది.

ఈ కథల అసలు సారాంశం ఇది కావచ్చుగాక, కానీ ప్రజలను భారీ ఎత్తున మోక్షం కన్నా ఓటు వేయటానికి సమీకరించవలసిన అవసరం వీరికి ఏర్పడింది. దీనికోసం ‘అచ్చేదిన్‌’, ‘వికసిత్‌ భారత్‌’, ‘ సబ్‌ కా సాత్‌, సబ్‌ కా వికాస్‌’, ‘ మేడ్‌ ఇన్‌ ఇండియా’, ‘అమృత కాల్‌’ వంటి కమ్మని కలల వంటి కథలను బీజేపీ వల్లిస్తున్నది. వీటిలో వికసిత భారత్‌, అమృత కాల్‌ వంటి వాటిని ఆరెస్సెస్‌ పట్టుకొని ప్రచారం చేస్తున్నది.ఆరెస్సెస్‌ చెప్పే ఈ కొత్త బృహత్‌ కథనంలో ఇండియా విశ్వగురువుగా, ఒక బంగారు పక్షిగా మారుతున్నది.

పైన చెప్పినట్టు ఆరెస్సెస్‌ అప్పుడప్పుడు అనంగీకార రాగాలు, లేక హెచ్చరికలు చేస్తునప్పటికీ బీజేపీ నయా ఉదార విధాన వైఖరి కొక్కాన్ని, తాడును,మురికి కుండీని పట్టుకుని వేలాడుతున్నది. ఈ నయా ఉదారవాద విధానం పాశ్చాత్య దేశాలలో తయారైంది, తొలిరోజుల్లో ప్రపంచ బ్యాంక్‌/ ఐఎంఎఫ్‌ల చేతను, ప్రస్తుతం విజయా సారధులుగా పిలవబడే కార్పొరేట్‌ శక్తుల మానస పుత్రులుచేత బలవంతంగా రుద్దపడ దుతున్నా ఆరెస్సెస్‌ ఈ విధానాలను గుట్టుచప్పుడుగా అంగీకరిస్తున్నది.

తక్షణ తీవ్ర సమస్యలపై కూడా ఆరెస్సెస్‌ మోడీ అనుకూల వైఖరినే తీసుకుంది. ఉదాహరణకు, నిరుద్యోగ సమస్యపై ఢిల్లీలో మోహన్‌ భగవత్‌ ఉపన్యాసంలో చెప్పిందేమిటి? ”మనం ఉద్యోగాలు వెతుకకులాడే వారి లాగా ఉండకూడదు, ఉద్యోగాలు ఇచ్చే వారి లాగా ఉండాలి. బతుకుతెరువుకి ఉద్యోగం అవసరం అనే భ్రమకు అంతం పలకాలి.” దీనివలన సమాజం లాభపడుతుందని, ఉద్యోగాల కోసం జరిగే ఒత్తిడి తగ్గుతుందని అయన నొక్కి చెప్పారు. ” ప్రభుత్వం ఎక్కువలో ఎక్కువగా 30 శాతం వరకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు మిగతా అందరూ స్వయం కృషితో ఆదాయాలు గడించాలి.” ఉద్యోగాల విషయంలో ఆరెస్సెస్‌ వైఖరి చాలాకాలంగా ఇదే. స్వయం ఉపాధి సర్వరోగ నివారణి అంటుంది ఆరెస్సెస్‌.

యువకులు ”పకోడీలు అమ్ముకొని” సంపాదించవచ్చునని మోడీ ఇచ్చిన సలహాను, అలాగే తాజాగా ఇటీవలి బీహార్‌ ఎన్నికల ప్రచార సందర్భంలో యువత రీల్స్‌ చేసి సంపాదిస్తున్నదని పొగిడిన విషయాన్ని గుర్తుచేసుకోండి. ఆరెస్సెస్‌, బీజేపీల మేధస్సు ఏ స్థాయిలో దివాలా తీసిందో, ప్రజల పట్ల ఉన్న బాధ్యత అవమానకరమైన రీతిలో ఎంత లోతుకు దిగజారిందో తెలుసుకోవటానికి ఇవి ఉదాహరణలు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలలోని అనేక కీలకాంశాలు ఆరెస్సెస్‌ గొప్పగాచెప్పుకునే జాతీయవాదానికి విరుద్ధంగా వున్నాయి. అయినప్పటికీ ఆరెస్సెస్‌ ఈ విషయాలపై మూగనోము పట్టింది.

రక్షణ రంగంతో కలుపుకొని అనేక కీలకమైన వ్యూహాత్మక రంగాలలోకి ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను అనుమతించడం, ప్రభుత్వ రంగ పరిశ్రమలను అమ్మటం, కీలకమైన పరిశ్రమలను ప్రయివేటుపరం చేయటంబీ ఉద్యోగ అభద్రతకు, వేతన నష్టాలకు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు స్వస్తి పలికే మొదలైనవి ఈ విధానాల్లో ఉన్నాయి. మోడీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఆరెస్సెస్‌కు గొప్ప ప్రయోజనాలు అందుతున్నాయి. ఆ కారణంగా మోడీ ప్రభుత్వాన్ని కాపాడటమనేది ఆరెస్సెస్‌ మరో అవకాశవాద ఎత్తుగడ. అయితే, ఇవన్నీ చూస్తున్న ప్రజలు ఇప్పుడు ఆరెస్సెస్‌ చేస్తున్న దేశభక్తి మీద, ధర్మం మీద, భారతదేశపు వారసత్వపు వైభవం మీద చేస్తున్న ప్రసంగాలను అంగీకరిస్తారా?
(”పీపుల్స్‌ డెమోక్రసీ” సౌజన్యంతో)
అనువాదం: కర్లపాలెం

  • సావేరా
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -