1917అక్టోబర్ 25-26 రాత్రి లెనిన్, ట్రాట్క్రీ నాయకత్వంలోని ‘రెడ్‌గార్డ్స్’ రష్యాలోని కీలక ప్రభుత్వ భవనాలు, సమాచార కేంద్రాలు, వింటర్ ప్యాలెస్ (తాత్కాలిక ప్రభుత్వం ఉన్న ప్రదేశం)ను స్వాధీనం చేసుకున్నారు. పెద్దగా ప్రతిఘటన లేకుండానే ప్రభు త్వం కూలిపోయింది. అధికారాన్ని ‘సోవియట్‌ల’కు అప్పగించారు. ఆ వెంటనే విప్లవనాయకుడు లెనిన్ ప్రపంచంలోని ‘తొలి సోషలిస్టు ప్రభుత్వాన్ని’ స్థాపించినట్లు ప్రకటించాడు. అప్పటివరకూ ప్రపంచంలో అనేక ప్రభుత్వాలు మారినా, రాజ్యాలు కూలినా ఆ మార్పులన్నింటికంటే విశిష్టమైన, వినూత్నమైన మార్పు ఈ విప్లవం ద్వారా ప్రపంచ మానవాళి అనుభవంలోకి వచ్చింది. అదేమిటంటే అప్పటివరకూ జరిగిన మార్పులన్నీ ‘ఒక దోపిడీ రూపం’ మారి మరో దోపిడీ రూపం అమల్లోకి వచ్చినవే తప్ప దోపిడీ లేని రాజ్యాన్ని మానవ సమాజం ఎరగదు. కానీ అక్టోబర్ విప్లవం ద్వారా దోపిడీ, పీడన లేని సమాజం సాధ్యమేననేది ఆచరణలో రుజువయింది.
1914 నుండి 1918 వరకూ మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ కాలంలో రష్యా ప్రజలు తీవ్రమైన కష్టాల్లో మునిగిపోయారు. యుద్ధం ప్రజలపై విపరీత భారాలు మోపింది. నిరుద్యోగం, ప్రాణనష్టం, ఆహార కొరత ప్రజల జీవనాన్ని దెబ్బతీసాయి. అదేసమయంలో అధికారంలో ఉన్న జార్ నికోలస్2 పైన ఆగ్రహం పెరిగింది. ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని దేశంలో అతర్యుద్దం ద్వారా కమ్యూనిస్టులు అధికారంలోకి రావాలని లెనిన్ సిద్ధాంతీ కరించాడు. ఆనాటి ప్రపంచంలోని ముఖ్య కమ్యూనిస్టు పార్టీలు (జర్మన్, ప్రెంచి, ఇటలీ వగైరా) లెనిన్ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ప్రతి దేశ కమ్యూనిస్టు పార్టీ (అపుడు సోషల్ డెమొక్రటిక్ పార్టీ పేరుతో ఉండేవి) యుద్ధంలో ఆ దేశ పెట్టుబడిదారీ ప్రభుత్వాలను సమర్ధించటం ద్వారా దేశభక్తిని ప్రదర్శించాలని వారు వాదించారు.
ఈ విభేదాలతో రెండవ ఇంర్నేషనల్ రద్దయింది. లెనిన్ ఒంటరివాడయ్యాడు. అయినప్పటికీ రష్కాలో బోల్షివిక్కుల నాయకత్వంలో అంతర్యుద్దం ప్రారంభమైంది. జార్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగిన ఈ తిరుగుబాటు పోరాటంలో బోల్షివిక్కులతో పాటు ఇతర జాతీయ బూర్జువాలు కూడా పాల్గొన్నారు.
ఈ మొదటి దశ ప్రజాతంత్ర విప్లవం జార్‌ను కూలదోసి 1917 ఫిభ్రవరిలో ఒక ‘జాతీయ ప్రభుత్వాన్ని’ స్ధాపించింది. కానీ, ఏర్పడిన జాతీయ బూర్జువా నాయకత్వంలోని జాతీయ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించ లేకపోయింది. యుద్ధంలో రష్యా కొనసాగటం, రైతులకు భూమి ఇవ్వలేకపోవటం, కనీసం తిండికి కూడా నోచుకోని దుర్బర పరిస్థితులు కొనసాగాయి. ఈ దశలో లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్కులు ‘శాంతి-భూమి-ఆహారం’ నినాదాలతో ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు. ‘అన్ని అధికారాలు సోవియట్‌లకే’ అనే డిమాండ్‌తో జాతీయ ప్రభుత్వాన్ని కూల దోయాలని, సోషలిస్టు విప్లవానికి పిలుపునిచ్చారు. ఆ విధంగా 1917 అక్టోబర్ 26న రష్యాలో సోషలిస్టు విప్లవం జయప్రదమై ప్రజల ప్రభుత్వం ఏర్పడింది.(ఈ తేదీలు పాత జూలియన్ క్యాలెండర్ ప్రకారం. ఆ తర్వాత అమల్లోకి వచ్చిన గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అది నవంబర్ 7వ తేదీ అవుతుంది. అందుకే మనం ఇపుడు అక్టోబర్ విప్లవ వార్షికోత్సవాలను నవంబర్ 7న జరుపుకుంటున్నాం.)
ప్రతిధ్వనించిన ప్రపంచం
అక్టోబర్ విప్లవం కేవలం రష్యా సరిహద్దుల్లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా విప్లవ ఆలోచనలకు బీజం వేసింది. కార్మిక ఉద్యమాలు, వలస వ్యతిరేక పోరాటాలు, సామ్యవాద సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా ఈ విప్లవం నుండి ప్రేరణ పొందాయి. అక్టోబర్ విప్లవం ఒక దేశపు పాలనా వ్యవస్థను మార్చటమే గాక, ప్రపంచ చరిత్రను కూడా కొత్త దిశలో నడిపిన విప్లవంగా మనం అర్ధం చేసుకోవాలి. ఇక్కడో విషయాన్ని మనం విశ్లేషించుకోవటం అవసరం. మార్క్సిస్టు మూల సిద్ధాంతవేత్త మహనీయుడు కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్పాడు. ”ఇప్పటివరకూ తత్వవేత్తలు చాలామంది ప్రపం చాన్ని విశ్లేషిస్తూ వచ్చారు. కానీ అసలు విషయం దాన్ని మార్చటం.” అని. అంటే ఈ మాటల అర్ధం ఏమిటి?
ప్రపంచం బాగుండాలని, మానవాళి అందరూ సుఖ,సంతోషాలతో జీవించాలని కోరుకున్నవాళ్లు, అందుకు తపనపడ్డవాళ్లు చాలా మందే ఉన్నారు. తత్వవేత్తలు, ప్రపంచ ప్రఖ్యాత పండితులు అనేకమంది సంపదల ఎక్కువ తక్కువలుండరాదని, అందరూ సమానంగా ఉండాలని, కులమత భేదాలు ఉండరాదని, ధనిక, పేద తారతమ్యాలు నిర్మూలించబడాలని కోరుకున్న వాళ్లూ ఉన్నారు. దేవుడూ, దెయ్యాలు లేవనీ ఇదంతా భౌతిక ప్రపంచమేనని చెప్పిన భౌతికవాదులూ ఉన్నారు. మరింత ముందుకెళ్లి ఈ రుగ్మతలకు కారణం పెట్టుబడిదారీ సమాజమే అని చెప్పినవాళ్లు కూడా ఉన్నారు.అయితే ఈ తేడాలు పోవడానికి మార్గమేమిటో, అందుకు మానవులేమి చెయ్యాలో శాస్త్రీయంగా చెప్పిన వారు, రుజువు చేసిన వారు లేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మానవతావాదాలన్నీ మనిషి బుద్ది మార్పు వల్ల సాధ్యమవుతాయని నమ్మి ప్రచారం చేయటం మనకు కనపడుతుంది తప్ప మరే శాస్త్రీయ పద్ధతీ సూచించలేక పోయారు.
అందుకే మార్క్స్ అన్నాడు. చేయాల్సింది విశ్లేషించటం కాదు. దాన్ని మార్చటం అని. అలా మార్చటానికి ప్రకృతి అంతా నిరంతరం ఏ సూత్రాల ఆధారంగా మారుత్నుదో అవే సమాజానికీ వర్తిస్తాయనీ సమాజంలోని పరస్పర భిన్న ప్రయోజనాలు కలిగి ఉన్న వర్గాల మధ్య ఘర్షణే సమాజ మార్పుకు కారణమౌతుందనీ, ఆ మార్పులు అంతిమంగా సమసమాజం వైపు పయనిస్తాయనీ సూత్రీకరించారు. ఆ విధంగా ఇదివరకు ఏ తత్వవేత్తా గమనించని అద్బుత పరిష్కారాన్ని ‘మానవ సమాజ మార్పునకు వర్గపోరాటమే సాధనం’అనే పరిష్కారాన్ని మార్క్స్, ఎంగెల్స్‌లు మానవాళికి అందించారు. ఆ సమ సమాజాన్ని కోరుకునే శక్తులన్నీ చేయాల్సిందల్లా ఆయా సమాజాల్లో నిర్ధిష్ట కాలంలో ఘర్షిస్తున్న వర్గ శక్తులను సక్రమంగా గమనించి వాటి మధ్య ఘర్షణను పెంచటానికి ప్రయత్నించటమే. రష్యాలో ఈ శాస్త్రీయ మార్గాన్ని అనుసరించే లెనిన్ విప్లవ విజయాన్ని సాధించాడు.
మారిన ప్రజల జీవనం
అక్టోబర్ విప్లవం తర్వాత లెనిన్ ప్రభుత్వం తీసుకున్న మొదటి నిర్ణయాలు రష్యాలో ప్రజల జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేశాయి. బోల్షివిక్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రష్యాను మొదటి ప్రపంచయుద్ధం నుండి తప్పించింది. ‘ప్రజలకు శాంతి కావాలి’ అనే నినాదాన్ని నిజం చేస్తూ అన్ని దేశాలతో యుద్ధాన్ని నిలిపివేయాలని ప్రకటించింది. తర్వాత జర్మనీతో 1918లో బ్రెస్ట్-లిటోవస్కీ ఒప్పందం కుదుర్చుకుంది. రైతులు దీర్ఘకాలంగా కోరుకున్న భూపంపిణీని లెనిన్ ప్రభుత్వం అమలు చేసింది. భూస్వాముల,చర్చిల,రాజకుటుంబీకుల భూములను స్వాధీనం చేసుకుని రైతులకు పంచి పెట్టింది. ”దున్నేవానికే భూమి” అనే సూత్రాన్ని అమలు పరిచింది. ఫ్యాక్టరీలు, గనులు, రవాణా వ్యవస్థలపై కార్మికుల నియంత్రణను చట్టబద్దం చేసింది. కార్మికులు తమ ఉత్పత్తి, వేతనాలు, పని పరిస్థితులపై నిర్ణయాలు తీసుకునే హక్కు పొందారు.
అన్ని ప్రధాన బ్యాంకులు, రైల్వేలు, పరిశ్రమలు ప్రభుత్వ అధీనంలోకి తీసుకు రాబడ్డాయి. ఈ విధానం ద్వారానే దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రజానియంత్రణ ఏర్పడింది. విద్యను ఉచితంగా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్య సేవలను ప్రభుత్వ అధీనంలోకి తీసుకొచ్చి ప్రజాఆరోగ్య సేవల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1918లో కొత్త సోషలిస్టు రాజ్యాంగం ఏర్పాటు చేసి, అందులో స్త్రీలకు సమాన హక్కులు, ఉద్యోగ హక్కులు, పని సమయం పరిమితి, కార్మిక రక్షణల వంటివి చట్టబద్దంగా అమలు చేశారు. ఈ నిర్ణయాలు రష్యాలో శతాబ్దాల నాటి అసమానతలను, దోపిడీ వ్యవస్థను కూలదోశాయి. లెనిన్ తీసుకున్న ఈ మొదటి అడుగులు ప్రపంచవ్యాప్తంగా సామ్యవాద ఉద్యమాలకు ప్రేరణగా మారాయి.
డెబ్బయేండ్ల సోషలిజం ఎందుకు కూలింది?
ప్రజలకు సర్వసౌఖ్యాలూ అందుబాటులోకి తెచ్చిన డెబ్బయి సంవత్సరాల సోషలిజం క్రమంగా బలహీనపడి 1989లో కుప్పకూలింది. ఎందుకిలా జరిగిందనేది అనేక మందికి ఆశ్చర్యం కలిగించటమేగాక, అనేక కమ్యూనిస్టు పార్టీలు నిరుత్సాహ పడ్డాయి. ప్రపంచ పెట్టుబడిదారీ శక్తులు బాగా పుంజుకున్నాయి. ‘కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలం చెల్లిందనీ, ఇక భవిష్యత్తు పెట్టుబడిదారీ విధానానిదేననీ, చరిత్ర అంతమైపోయిందనీ’ ప్రచారం లంకించుకున్నాయి. ఈ స్థితిలో ప్రపంచవ్యాప్తంగానే కమ్యూనిస్టులు, అభ్యుదయశక్తులు సహజంగానే కొంత బలహీనపడ్డాయి. కానీ వాస్తవమేమంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కాలదోషం పట్టలేదు, సరిగదా ఈనాటికీ సమస్త మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు చూపగలిగిన సైద్ధాంతిక స్పష్టత కమ్యూనిస్టులకు మాత్రమే ఉన్నది. సోవియట్‌లో, తూర్పు యూరోప్‌లో సోషలిస్టు రాజ్యాలు దెబ్బతిన్నది కమ్యూనిస్టు సిద్ధాంతాల వైఫల్యం వల్ల కాదు. ఆయా దేశాల్లోని కమ్యూనిస్టు పార్టీలు అనుసరించిన అపరిపక్వ విధానాలు, తప్పుల వల్ల ఆ పరిణామాలు సంభవించాయనేది ఆ తర్వాత పరిణామాల్లో స్పష్టంగా రుజువైంది.
కమ్యూనిస్టు పార్టీలు అధికారంలోకి రావటం వేరు, ఆ దేశంలో సోషలిజం నిర్మించటం వేరు. ఇవి రెండూ ఒకటికావు లేక ఆటోమేటిక్‌గా జరిగిపోవు. సోషలిజం అనేది స్వంత ఆస్తి లేని సమాజం. ఆ స్థితికి చేరటం అనేది కమ్యూనిస్టు పార్టీ ఒక దేశంలో అధికారంలోకి రావటంతోనే జరిగిపోదు. అందుకు సుదీర్ఘ కాలం అనేక రూపాల్లో ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సాగించి ఆ దశకు చేరాలి. ప్రజల చైతన్యస్థాయిని బట్టి ఆస్తి రూపాలు మార్చుకుంటూ ముందుకు సాగాలి. కొంతకాలం వ్యక్తిగత ఆస్తి, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానాలు కూడా వివిధ స్థాయిల్లో అమలు జరపాల్సి ఉంటుంది. అందుకే మార్క్స్ ‘సోషలిజం నిర్మాణం సుదీర్ఘకాలం ఒక యుగమంతా సాగుతుంది’ అని చెప్పారు. ఈ అంశం అర్థం చేసుకుని అమలు చేయడంలో వివిధ కాలాల్లో కమ్యూనిస్టు పార్టీలు అనేక తప్పిదాలు చేశాయి. ప్రజా చైతన్యస్థాయిని పరిగణలోకి తీసుకోకుండా ఆస్తి రూపాలను సోషలిజంలోకి అధికార డిక్రీల ద్వారా అమలుకు ప్రయత్నించాయి. అలాగే కార్మికవర్గ నాయకత్వం అంటే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంగా, దాని నాయకుల నియంతృత్వంగా మార్చిన సందర్భాలను మనం చూశాం. జరిగిన ఈ పొరపాట్లను గమనించి ఇపుడు మిగిలిన సోషలిస్టు దేశాలు అనేక ప్రయోగాలు చేస్తూ సోషలిజం నిర్మించే ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
సోషలిజమే ప్రత్యామ్నాయం
ఇప్పటికే నిర్మించబడిన సోషలిస్టు రోల్‌మోడల్ ఏదీ లేనందును సోషలిజం నిర్మాణంలో అనేక తప్పిదాలు జరగటం, అనుభవంలో వాటిని సరిదిద్దుకోవల్సి రావటం సహజమే. కమ్యూనిస్టులు వర్గపోరాటాలు నిర్మించే క్రమంలో ఈ 170 సంవత్సరాల చరిత్రలో కూడా అనేక పొరపాట్లు, దిద్దుబాట్లు ఆ విధంగా జరిగాయి. ఏమైనా మానవ స్వభావం సంపూర్ణంగా వికసించటానికి అడ్డుగా ఉన్న వర్గదోపిడీ సమాజం- పెట్టుబడిదారీ సమాజం- కూల్చబడటం ఒక తప్పనిసరి పరిణామం. పెట్టుబడిదారీ విధానం కూడా ఒకేసారి నిలదొక్కుకోలేదు. అది ఒకసారి ఆవిర్భవించాక అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నది. ఆ రాజ్యాలు కూలిపోయి తిరిగి ఫ్యూడల్ రాజ్యాలు ఏర్పడటం, మళ్లీ వాటిని కూలదోసి పెట్టుబడిదారీ విధానం స్థిరపడటం జరిగింది. నేటి ప్రపంచంలో పెట్టుబడిదారీ విధానం తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నది. ఈ సంక్షోభాలను అధిగమించటానికే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. ఆ తర్వాత కమ్యూనిస్టులను ఎదుర్కొనటానికి, ప్రభావం తగ్గించటానికి రెండో ప్రపంచయుద్ధం తర్వాత ‘సంక్షేమ రాజ్యం’ నమూనాను పెట్టుబడిదార్లు అమలు చేశారు.
అయినా సంక్షోభ పరిష్కారం జరగక కొత్త సంక్షోభాలు ముందుకొచ్చాయి. దాని పరిష్కారానికి ‘1970ల తర్వాత, ఇండియాలో 1990ల నుండి ‘ప్రపంచీకరణ విధానాలు’ అమలు చేశారు. కానీ ఇపుడు ఆ విధానాలు కూడా విఫలమై సామ్రాజ్యవాద నాయకుడుగా ఉన్న అమెరికా తన ఆధిపత్యం నిలుపుకోవటానికి ప్రపంచీకరణ నుండి విరమించుకుని తిరిగి అనేక దేశాలపైన నేడు టారిఫ్‌ల విధింపు రూపంలో తిరిగి ‘రక్షణాత్మక విధానాలు’ అనుసరించటానికి పూనుకుంటున్నది. ఈ విధానాలను చైనా, రష్యాల నాయకత్వంలో బ్రిక్స్, ఎస్.సి.ఓ సంస్థల రూపంలో సంఘటితమౌతున్న అనేక దేశాలు ప్రతిఘటిస్తున్నాయి. అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ ‘చరిత్ర ముగిసిపోయింది. ఇక పెట్టుబడిదారీ విధానమే అంతిమం’ అని చెప్పిన బూర్జువా పండితుల జోస్యాలను పటాపంచలు చేస్తున్నాయి. ‘సోషలిజమే ప్రత్యామ్నాయమనే నిజాన్ని’ ఎలుగెత్తి చాటుతున్నాయి. అక్టోబర్ మహావిప్లవ స్ఫూర్తితో ఈ బాటలో ముందుకు సాగటమే మానవాళి మనుగడకు, వసుధైక కుటుంబ సాధనకు మన ముందున్న మార్గం.
తమ్మినేని వీరభద్రం



