Friday, November 7, 2025
E-PAPER
Homeఎడిట్ పేజినినాదాలు.. విధానాలు…

నినాదాలు.. విధానాలు…

- Advertisement -

రాజకీయమంటే రాద్ధాంతం కాదు.. సిద్ధాంతమన్నారు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్‌ నాడార్‌. కానీ ఇప్పుడు దేశంలో ఎటుచూసినా, ఏ ఎన్నికను పరిశీలించినా సిద్ధాంతాలు పక్కకు.. రాద్ధాంతాలు ముందుకు అన్నట్టుగా ఉంది. ప్రజలు కేంద్ర బిందువుగా సాగాల్సిన రాజకీయాలు, ఎన్నికలు అందుకు భిన్నంగా వ్యక్తుల చుట్టూ తిరగటం శోచనీయం. నేతల ప్రసంగాల్లో ప్రజాస్వామ్యం, ప్రజాసంక్షేమం అనేది మచ్చుకైనా కానరావటం లేదు. విధానాల ప్రాతిపదికన జరగాల్సిన క్యాంపెయిన్లు, చర్చలు..నినాదాల హోరులో కొట్టుకుపోతున్నాయి. అందుకు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక కూడా మినహాయింపేమీ కాదు.

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మరణంతో సంభవించిన ఈ ఉప ఎన్నిక ప్రచార సరళి అనేకానేక ప్రశ్నలను లేవనెత్తుతున్నది. దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార, ప్రధాన ప్రతిపక్షాలు అదే స్థాయిలో ప్రచారాన్ని ‘కొత్త పుంతలు’ తొక్కించటం ‘ఎలాగైనా’ గెలిచి తీరాలన్న ఆ పార్టీల తహతహకు నిదర్శనం. ‘మీరు మాపార్టీకి ఓటేయకపోతే, మాపార్టీ ఓడిపోతే.. మీకిస్తున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి…’ అంటూ ప్రభుత్వాధినేత ఓటర్లను భయపెట్ట జూడటం పలు విమర్శలకు తావిచ్చింది. ప్రతిగా ‘అభివృద్ధిపై చర్చకు ఎక్కడికైనా వస్తా.. అసెంబ్లీ అయినా ఓకే, గాంధీభవన్‌ అయినా ఓకే…’ అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు సినిమా డైలాగులు కొట్టటం కూడా పరిణితి చెందిన రాజకీయం అనిపించుకోదు.

ప్రచారంలో నేతలందరూ తమ ప్రభుత్వ హయాంలోని జీడీపీ, జీఎస్‌డీపీ గురించి బాకా ఊదుకుంటు న్నారు. కానీ వారు గుర్తించాల్సింది, చర్చించాల్సింది వృద్ధి రేటు, ఆర్థికవృద్ధి గురించి కాదు.. ప్రజల ఆర్థికాభివృద్ధి ఎలా ఉంది? గతంతో పోలిస్తే వారి జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా? అందుకోసం తాము ఎలాంటి చర్యలు చేపట్టామనేది. కానీ లీడర్ల ప్రచారంలో ఈ అంశం మచ్చుకైనా కానరాదు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలోని సినీ కార్మికులు, వారి బతుకుల గురించి ఇప్పటి వరకూ పట్టించుకోని పాలకులు.. ఇప్పుడు ‘నేతి బీరకాయ’ మాటలు చెబుతుం డటం విచిత్రం. హైదరాబాద్‌లో ‘వరల్డ్‌ క్లాస్‌ ఫిల్మ్‌ సిటీ’ని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారేగానీ.. వేలాది మంది సినీ కార్మికుల జీవితాల మెరుగుదలకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పకపోవటం ప్రధాన పార్టీల లోప భూయిష్ట విధానాలకు ప్రత్యక్ష ఉదాహరణ.

ఇవన్నీ ఒక ఎత్తయితే… దొరికిన ప్రతీ వేదికనూ ఉపయోగించుకుని ప్రస్తుతం దేశంలోని విపత్కర పరిస్థితులను, పెచ్చరిల్లుతున్న మతోన్మాదాన్ని, రాజ్యాంగ విలువల హననాన్ని ఆ రెండు పార్టీలూ ఖండించకపోవటం అత్యంత బాధ్యత రాహిత్యం. వీటిని మరిచి వ్యక్తిగత దూషణ భాషణలు, భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలకే నేతలు పరిమితం కావటం అవకాశవాదం కాకపోతే మరేమిటి? ఇలాంటి అవకాశవాద రాజకీయాలకు ఎలాంటి తావు లేకుండా కేరళ రాష్ట్రం, అక్కడి వామపక్ష ప్రభుత్వం ఇటీవల ప్రపంచం మొత్తం తనవైపు చూసేలా ఒక కొత్త ప్రకటన చేసింది. అదే అత్యంత పేదరికం నుంచి కేరళ రాష్ట్ర విముక్తి. దీన్ని సాధించేందుకు పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అనుసరించిన పద్ధతులు యావత్‌ దేశానికి ఆదర్శం.

అలాంటి విధానాల స్ఫూర్తితో మన పాలకులు సైతం ముందుకు సాగాలి. ఎన్నికలు, ఉప ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రజానుకూల విధానాలకు పెద్ద పీట వేయాలి. ‘నేతా నహీ.. నీతి బదల్నా చాహియే…’ అన్నారు కమ్యూనిస్టు అగ్రనేత సీతారాం ఏచూరి. అంటే నేతలు మారినంత మాత్రాన సరిపోదు.. వారి విధానాలు మారాలని అర్థం. ఒక ఆటలో ఆటగాళ్లను మార్చినంత మాత్రాన ఉపయోగం లేదు.. ఆట ఆడే విధానంలో కూడా మార్పు రావాలి. దేశంలో సరళీకృత, నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత వామపక్షాలు తప్ప మిగతా పార్టీలన్నీ అనుసరిస్తున్నది, అమలు పరస్తున్నది ఆ విధానాలనే. కేంద్రంలోని బీజేపీ మరింత దూకుడుగా వాటిని రాకెట్‌ వేగంతో అమలు చేస్తోంది. పెట్టుబడిదారుల లాభాపేక్షకు మతోన్మాదాన్ని జోడించి, గొలుసుకట్టుగా జోడించి, దేశాన్ని, వనరులను కొల్లగొడుతోంది. అందువల్ల పార్టీలు, నేతల నినాదాలను కాకుండా విధానాలను అర్థం చేసుకోవాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -