భయం వీడండి.. ముందడుగు వేయండి
ప్రతిఒక్కరికీ లక్ష్యం ఉండాల్సిందే : పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ
లక్ష్యం లేకపోతే జీవితం వ్యర్థం
మాట గొప్పది.. ఏదైనా చేయగలదు : మాజీ ఐఏఎస్ రమణాచారి
ఘనంగా బాలోత్సవం ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తొలి అడుగే విజయానికి నాంది అనీ, భయం వీడి ప్రయత్నిస్తే విజయం మనదే అవుతుందని పర్వతారోహకురాలు మాలావత్ పూర్ణ నొక్కి చెప్పారు. బాల్యం ఎంతో కీలకమైనదనీ, ప్రతి ఒక్కరూ లక్ష్యం పెట్టుకుని ముందుకు సాగాలని చిన్నారులకు పిలుపునిచ్చారు. గురువారం హైదరా బాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద బాలోత్సవం ఆధ్వర్యంలో పిల్లల జాతర మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారులు, ఐఏఎస్(రిటైర్డ్) కె.వి.రమణాచారి జాతీయ పతా కాన్ని ఆవిష్కరించారు. చిన్న వయస్సులోనే 24 గ్రంథాలయాలను ప్రారంభించి పుస్తకాలను సొంతంగా అందజేస్తున్న హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని ఆకర్షణ సతీశ్ బాలోత్సవం జెండాను ఎగురవేశారు.
అనంతరం జరిగిన ప్రారంభ సభలో ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాడిన ‘నీతో నీవు మాట్లాడుకో..’ అన్న పాట ప్రతి ఒక్కరినీ ఆలోచింప జేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బాలాచారి, బీఎస్‌సీపీఎన్ కంపెనీ చైర్మెన్ రాఘవయ్య, ఎల్‌ఐసీ ప్రతినిధి సుబ్రమణ్యం, భారత్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మెన్ వేణుగోపాల్ రెడ్డి, బాలోత్సవం అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఎన్.సోమయ్య, ఉపాధ్యక్షులు సుజావతి, కోశాధికారి బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ సభలో మాలావత్ పూర్ణ మాట్లాడుతూ తొలుత ట్రెక్కింగ్ మొదలు పెట్టినప్పుడు చాలా భయమేసిందనీ, అతి పేద కుటుంబం నుంచి వచ్చిన తాను ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దనే పట్టుదలతో ఒక్కో మొట్టును అధిగమిస్తూ 13 ఏండ్ల వయస్సులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించగలి గానని తన ఎదుగుదల ప్రస్థానాన్ని పిల్లలకు వివరించారు.
ఆ తర్వాత అన్ని ఖండాల్లోని అతి ఎత్త యిన శిఖరాలను అధిరోహించానని గర్వంగా చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా తెలం గాణలోని భువనగిరి కోటపైనా, ఏపీలో గండికోట పైనా టెక్కింగ్‌లో వేలాది మంది చిన్నారులకు శిక్షణ అందజేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తన ఎదుగుదలతో తల్లిదండ్రులు, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, కోచ్ శేఖర్‌బాబు కృషి, ప్రోత్సాహం చాలా కీలకమైనదనీ, వారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. ఆకర్షణ సతీశ్ మాట్లాడుతూ…కరోనా కాలంలో తనకు ఎదురైన అనుభవాలు, పుస్తకాలు లేక పేద పిల్లలు పడుతున్న ఇబ్బందులను చూసిన తర్వాత కలిగిన ప్రేరణతో గ్రంథాలయాలు స్థాపించే పని మొదలు పెట్టాననీ, ఈ విషయంలో నాన్న ప్రోత్సా హం మరువలేనిదని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలు, గిరిజన గ్రామాలు, పోలీస్ స్టేషన్లు, జువైనల్ హౌమ్స్, రైల్వే స్టేషన్లలో ఇప్పటి వరకూ 24 లైబ్రరీలను ప్రారంభించానని తెలిపారు. తాను మెట్రో రైల్వే స్టేషన్లో ప్రారంభించబోయే గ్రంథాలయ కార్య్రకమానికి ప్రధాని మోడీ రాబో తున్నారని చెప్పారు. పిల్లల్లో మాన సిక ఎదుగుదలకు పుస్తక పఠనం ఎంతో కీలకమని నొక్కి చెప్పారు. పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానం, ఊహాత్మకశక్తి పెరుగుతాయన్నారు. రమణాచారి మాట్లాడుతూ… రిటైర్డ్ ఐఏఎస్ ఎస్.ఆర్. శంకరన్ చిత్రపటాన్ని ఎవరెస్టు శిఖరంపై పూర్ణ ప్రదర్శించడం గొప్ప విషయ మనీ, పేదల ఐఏఏఎస్‌గా పేరు పొందిన ఎన్. శంకరన్ శిష్యుడిగా ఈ విషయంలో గర్వపడుతున్నా నని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా చిన్న వయస్సు నుంచే పూర్ణ మాదిరిగా లక్ష్యాలను పెట్టుకుని ముందుకు సాగాలని పిల్లలకు పిలుపునిచ్చారు.
సాధించాలనే ఆశయం, కోరిక లేకపోతే జీవితం వ్యర్థ మని స్పష్టం చేశారు. చిన్నప్పటి నుంచే ప్రతి విషయాన్ని తర్కించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తాను చిన్న వయస్సులో ప్రతి దానిపైనా ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు రాబట్టుకుంటూ ముందుకు సాగడం వల్లనే ఈ స్థాయికి ఎదిగానని వివరించారు. మాట కీలకమనీ, మాట తీరు బాగుంటే మనం ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పారు. రాఘవయ్య మాట్లాడుతూ.. జీవితంలో ఇది లేదు.. అది లేదు అని కూర్చోకుండా, ఇతరులతో పోల్చుకోకుండా మనకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని ప్రతి అడుగూ ఉత్సాహంతో ముందుకేయాలని పిల్లలకు పిలుపునిచ్చారు. వేలాది చిన్నారుల మధ్య జరుగుతున్న ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందనీ, ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న బాలోత్సవం కమిటీని అభినదిస్తున్నానని చెబుతూనే ఎల్లవేళలా సహకరిస్తానని హామీనిచ్చారు.
బాలోత్సవంలో పిల్లల సందడి..
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. పిల్లల సందడితో ఆ ప్రాంతమంతా శోభను సంతరించుకుంది. నాలుగు గోడల మధ్య బందీలుగా ఉండే విద్యార్థులంతా స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చినట్టుగా సందడి చేశారు. పిల్లలు తమ ఆటపాటలు, ప్రతిభాపాటవాలు, సృజనాత్మక ప్రదర్శనలతో వీక్షకులను ఆకట్టుకు న్నారు. సైన్స్ ఎగ్జిబిషన్‌లో పెట్టిన ప్రాజెక్టు వర్కులు, పిల్లలు వివరించే తీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. మత్తు పదార్థాలు-కుటుంబాలపై ప్రభావం అనే అంశంపై చిత్రలేఖనం, సెల్‌ఫోన్- ఏఐ వల్ల కలిగే నష్టాలు అనే అంశంపై వ్యాస రచన, మత్తు పదార్థాలు అనర్థాలు అనే అంశంపై కథారచన పోటీల్లో పలువురు విద్యార్థులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. జానపద, శాస్త్రీయ నత్యాలు, వెస్ట్రన్ డ్యాన్స్‌లు, దేశభక్తి గేయాల ఆలా పన, బతుకమ్మ, దాండియా ప్రదర్శనల్లో పిల్లలు ఆస్తకిగా పాల్గొన్నారు. ఆయా విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.



