అరుంధతి రెడ్డికి అపూర్వ స్వాగతం
హైదరాబాద్ : ఐసీసీ 2025 మహిళల వన్డే వరల్డ్‌కప్ చాంపియన్ భారత జట్టు సభ్యురాలు, పేస్ బౌలర్ అరుంధతి రెడ్డికి హైదరాబాద్‌లో గురువారం అపూర్వ స్వాగతం లభించింది. సెమీఫైనల్లో ఏడు సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను మట్టికరిపించిన భారత్.. టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాపై చారిత్రక విజయం నమోదు చేసి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రపంచకప్ విజయానంతరం ప్రధాని మోడీని కలిసేందుకు ముంబయి నుంచి నేరుగా న్యూఢిల్లీకి వెళ్లిన భారత క్రికెటర్లు.. అక్కడ్నుంచి స్వరాష్ట్రాలకు చేరుకున్నారు. హైదరాబాద్ క్రికెటర్ అరుంధతి రెడ్డి గురువారం రాత్రి 9 గంటలకు న్యూఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. క్రీడా ప్రాధికార సంస్థ (శాట్జ్) చైర్మెన్ శివసేనా రెడ్డి, వీసీ ఎండీ సోనీబాలా దేవి సహా క్రీడాభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అరుంధతి రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ప్రపంచకప్ విజేత అరుంధతి రెడ్డి నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలువనుంది.



