సామ్రాజ్యవాదం, మనువాదంపై సంఘటిత ఉద్యమాలు: ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ-సూర్యాపేట
హైదరాబాద్‌లో జనవరిలో జరగనున్న ఐద్వా 14వ జాతీయ మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 23వ వార్డులో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సామ్రాజ్యవాదం, మనువాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలు హక్కులు సాధించుకో వాలని ఆమె సూచించారు. కేంద్రంలో అధికారం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహిళా హక్కులపై దాడి చేస్తూ చట్టాలను నిర్వీర్యం చేస్తోందన్నారు. అన్ని రంగాల్లోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న మహిళలను ఇంటికే పరిమితం చేయాలని మనువాద ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మనువాదం మహిళలకు స్వేచ్ఛ లేకుండా బానిసలుగా తయారు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు సామాజికంగా, ఆర్థికంగా సమానత్వాన్ని కల్పించి అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు.
మీడియాలో స్త్రీలను, అశ్లీలత, అసభ్యకరంగా చిత్రీకరించడంపై ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. మహిళలపై జరుగుతున్న హింస, దాడులు, దౌర్జన్యం, హత్యలకు వ్యతిరేకం గా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు హైదరాబాద్‌లో జరగనున్న జాతీయ మహాసభ వేదిక కానుందని తెలిపారు. ఈ మహా సభకు దేశవ్యాప్తంగా వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి హైదరాబాద్‌లో జరుగుతున్న జాతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దెల జ్యోతి, జిల్లా కోశాధికారి మేకనబోయిన సైదమ్మ, నాయకులు గుడిపూరి లక్ష్మి సునంద, సుమలత, సంపూర్ణ, శైలజ, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.



