కాంగ్రెస్‌ను గెలిపించకుంటే సన్నబియ్యం ఆపుతామని బెదిరింపులు
మజ్లీస్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలు
హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది : మీట్‌ది ప్రెస్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీట్‌దిప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే సన్నబియ్య, మహిళల ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను నిలిపి వేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సన్న బియ్యానికి కేంద్రం రూ.42 ఇస్తుంటే, రాష్ట్రం రూ.15 మాత్రమే ఖర్చు చేస్తుందని అన్నారు. కేంద్రం సాయంతో నడుస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని సీఎం ఎలా ఆపుతారో చెప్పాలని నిలదీశారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలే గెలిచినా…వారు అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిం చారని విమర్శించారు. నియోజకవర్గంలోని అనేక బస్తీల్లో 365 రోజులు పొంగిపొర్లే డ్రైనేజీలు, వెలగని వీధి దీపాలు, పరిశుభ్రమైన తాగునీరు లేకపోవడం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని ప్రధాన పౌర సంస్థలైన జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వంటి సంస్థలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6 గ్యారంటీల గురించి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ప్రస్తావించటం లేదని విమర్శించారు.
జాబ్ క్యాలెండర్, నిరుద్యోగులకు ఇస్తామన్న రూ.4,000 నిరుద్యోగ భృతి, మహిళలకు ఇస్తామన్న రూ.2,500 సాయం, పావుల వడ్డీ రుణాలు, తులం బంగారం, పించన్ రూ.4వేలకు పెంపు తదితర హామీలు అమలు చేసిన తర్వాతే ఒట్లడగాలని హితవు పలికారు. మజ్లీస్ మెప్పు పొందడం కోసం రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలకు పరిమితమవుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నొక్కి చెప్పారు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రైల్వే స్టేషన్లు, పలు ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుతో పాటు విద్య, వైద్యం తదితర సంక్షేమ పథకాలకు సాయం అందిస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లపై ఇటీవల విధించిన షరతులతో పాటు స్మార్ట్ సిటీల గుర్తింపును సమీక్షిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయని కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.



